Hyderabad: సూట్‌కేసులో యువతి మృతదేహం | Woman body found stuffed in Trolley Bag in Hyderabad | Sakshi
Sakshi News home page

Hyderabad: సూట్‌కేసులో యువతి మృతదేహం

Jun 5 2025 1:14 PM | Updated on Jun 5 2025 1:13 PM

Woman body found stuffed in Trolley Bag in Hyderabad

బాచుపల్లిలో కలకలం 

 హత్య చేసి సూట్‌కేసులో కుక్కి పొదల్లో పడేశారు 

కుళ్లిన స్థితిలో మృతదేహం

నిజాంపేట్‌: ఓ యువతిని హత్య చేసి సూట్‌కేసులో తీసుకువచ్చి బాచుపల్లి పరిసర ప్రాంతాల్లో పడేసిన సంఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌ పరి«ధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం బుధవారం బాచుపల్లిలోని జీతేపీర్‌ దర్గా ఎదురుగా ఉన్న జీపీఆర్‌ లే అవుట్‌ విజయదుర్గ ఓనర్స్‌ అసోషియేషన్‌ కాలనీలో పొదల మధ్యలో ఓ సూట్‌కేసు నుంచి గత రెండు రోజుల నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. 

దీంతో బాచుపల్లి ఇన్‌స్పెక్టర్‌ ఉపేందర్‌ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా అందులో యువతి మృతదేహం లభ్యమైంది. ఆమె వయసు సుమారు 25 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో గుర్తుపట్టలేని విధంగా ఉంది. బాలానగర్‌ డీసీపీ సురేశ్‌కుమార్, అడిషనల్‌ డీసీపీ సత్యనారాయణ, ఏసీపీలు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఐదు నుంచి పది రోజుల క్రితం ఈ హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. 

దర్యాప్తే కీలకం.. 
యువతి హత్య పోలీసులకు సవాల్‌గా మారింది. ఎక్కడో చంపేసి సూట్‌కేసులో మృతదేహాన్ని తీసుకువచ్చి ఇక్కడ పడేయడం, అందులో మృతదేహం పూర్తిగా కుళ్లిపోవడంతో పోలీసులకు దర్యాప్తు కీలకంగా మారింది. రంగంలోకి ఐదు పోలీసు బృందాలను దింపి సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు. అదే విధంగా వివిధ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మిస్సింగ్‌ అయిన వారి వివరాలతో పోల్చి చూస్తున్నారు. ఇప్పటి వరకు ఎక్కడి నుంచి పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. 

గాజులు, డ్రెస్‌లే ఆధారాలు.... 
మృతి చెందిన యువతి ఒంటిపై ఉన్న గాజులు, డ్రెస్‌ ఆధారంగానే పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. భార్యా భర్తల గొడవల కారణంగా ఏమైనా ఈ హత్య జరిగిందా? లేదా మరే ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పరిశీలిస్తున్నారు. ఒంటిపై మెరున్‌ కలర్‌ పంజాబీ డ్రెస్‌ ఉంది. ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళనా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. 

 

 

Advertisement
 
Advertisement
Advertisement