పిల్లలు తమకు ఎదురైన విషయాలను భయం లేకుండా పెద్దలతో పంచుకోగలగాలి. మనసులోని మాట చెప్పేందుకు జంకకూడదు.. తమకు జరిగినది చెబితే తిడతారేమో, తప్పుపడతారేమోనన్న భయం వారిలో ఉండకూడదు. ఇటీవల వచ్చిన ఇరుముడి సినిమా ఇచ్చిన సందేశం కూడా ఇదే. పిల్లలు భయం వీడి తమకు ఎదురైన అనుభవాలను చెప్పగలిగితేనే.. వారి సమస్యలు వెలుగులోకి వస్తాయి. ఇందుకు నిదర్శనంగా.. పాఠశాలలో ‘గుడ్ టచ్.. బ్యాడ్ టచ్’ పాఠం చెబుతున్న సమయంలో ఏడేళ్ల బాలిక తనపై జరుగుతున్న వేధింపులను టీచర్‌కు వెల్లడించింది.
స్కూల్లో గుడ్ టచ్.. బ్యాడ్ టచ్‌పై పాఠం చెబుతున్న సమయంలో.. ఏడేళ్ల బాలిక తమ ఇంట్లో అద్దెకు ఉంటున్న అంకుల్ చేస్తున్న పనుల గురించి చెప్పడంతో టీచర్ షాక్‌కు గురయ్యారు. తనకు ఎదురవుతున్నది లైంగిక వేధింపులనే విషయం కూడా తెలియని ఆ చిన్నారి.. తనకు జరిగినదంతా వివరించింది. దీంతో విషయం తల్లిదండ్రుల దృష్టికి వెళ్లగా.. వారు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చోటుచేసుకుంది.
పోలీసులకు అందిన ఫిర్యాదు ప్రకారం.. రాజేశ్ కనోజియా అనే వ్యక్తి ఆ బాలిక ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. చాక్లెట్లు ఇస్తానని ఆశ చూపి తన గదిలోకి పిలిచేవాడని అక్కడ ఆమెను అనుచితంగా తాకి లైంగికంగా వేధించేవాడట. ఈ విషయం బయటపెడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని.. బాలిక తండ్రిని చంపేస్తానని కూడా బెదిరించినట్లు సమాచారం.
నాలుగు నెలలపాటు..
ఫిర్యాదు ప్రకారం.. ఈ ఘటనలు జూన్ 30 నుంచి అక్టోబర్ 13 మధ్య జరిగినట్లు తెలుస్తోంది. పాఠశాలలో గుడ్ టచ్–బ్యాడ్ టచ్ గురించి చెబుతున్నప్పుడు బాలిక తనకు ఎదురైన అనుభవాన్ని టీచర్‌తో పంచుకుంది. దీంతో విషయం తల్లికి తెలియగా, ఆమె పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు పోక్సో చట్టంతోపాటు సంబంధిత నిబంధనల కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.
పిల్లల మాట వినడం ఎందుకు ముఖ్యం?
పిల్లలు తమకు ఎదురైన ఇబ్బందులను చెప్పేందుకు భయపడకుండా చూడటం పెద్దల బాధ్యత. వారి మాటలను తేలిగ్గా తీసుకోకుండా, శ్రద్ధగా వినాలి. తమకు అసౌకర్యంగా అనిపించే స్పర్శ గురించి నమ్మకమైన పెద్దలకు చెప్పవచ్చని చిన్న వయసు నుంచే అవగాహన కల్పించాలి. నాగ్‌పూర్ ఘటనలో బాలిక తన అనుభవాన్ని టీచర్‌తో పంచుకోవడం వల్లే విషయం వెలుగులోకి వచ్చింది. పిల్లలకు మాట్లాడే స్వేచ్ఛ ఇవ్వడం, వారు చెప్పేది నమ్మకంగా వినడం ఎంత అవసరమో ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.
ఇదీ చదవండి: ‘ఏయ్.. నేను నీ బాస్‌ని’ రెచ్చిపోయిన ఐఏఎస్


