బెంగళూరు: ఒకప్పుడు సంచలనం సృష్టించిన భర్త హత్య కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న శుభా శంకరనారాయణకు నిరాశ ఎదురైంది. ఆమెతోపాటు ఈ కేసులో శిక్ష అనుభవిస్తున్న ప్రియుడు డి. అరుణ్ వర్మ పెట్టుకున్న క్షమాభిక్ష అర్జీని కర్ణాటక ప్రభుత్వం తిరస్కరించింది. గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ అర్జీపై చర్చించిన అనంతరం తిరస్కరించాలని నిర్ణయించినట్లు హోం మంత్రి ప్రియాంక్ ఖర్గే వెల్లడించారు.
ఇష్టం లేని పెళ్లే కారణమా?
2003లో జరిగిన ఈ హత్య అప్పట్లో తీవ్ర సంచలనం రేపింది. న్యాయ విద్యార్థినిగా ఉన్న శుభాకు ఇష్టం లేకుండానే గిరీశ్‌తో వివాహం చేశారని, ఈ నేపథ్యంలో ఆమె తన ప్రియుడు అరుణ్ వర్మతో కలిసి భర్తను హత్య చేసేందుకు కుట్ర పన్నిందని కేసు దర్యాప్తులో ఆరోపణలు వెలుగుచూశాయి. పథకం ప్రకారం గిరీశ్‌ను రింగ్‌రోడ్డుకు తీసుకెళ్లి హత్యాయత్నం చేయగా, తీవ్ర గాయాలపాలైన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
ఈ కేసులో నిందితులుగా ఉన్న శుభా శంకరనారాయణ, అరుణ్ వర్మలకు బెంగళూరు కోర్టు జీవితఖైదు విధించింది. అప్పటి నుంచి వారు శిక్ష అనుభవిస్తున్నారు.
గవర్నర్ నుంచి ప్రభుత్వానికి ఫైల్
శిక్ష నుంచి క్షమాభిక్ష కోరుతూ శుభా, అరుణ్ వర్మ గవర్నర్‌కు అర్జీ సమర్పించారు. గవర్నర్ ఆ ఫైల్‌ను రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనకు పంపించారు. గురువారం మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించి అర్జీని తిరస్కరించినట్లు హోం మంత్రి ప్రియాంక్ ఖర్గే మీడియాకు వివరించారు. దీంతో ఈ కేసులో శిక్ష అనుభవిస్తున్న ఇద్దరికీ క్షమాభిక్ష లభించలేదు.
ఇదీ చదవండి: హైదరాబాద్ పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై కార్ల బీభత్సం! భారీగా ట్రాఫిక్ జామ్!


