రాష్ట్రంలో డబ్ల్యూహెచ్‌వో టీకా కేంద్రం | WHO mRNA Vaccine Hub In Telangana: Minister KTR | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో డబ్ల్యూహెచ్‌వో టీకా కేంద్రం

Jan 20 2023 3:00 AM | Updated on Jan 20 2023 10:58 AM

WHO mRNA Vaccine Hub In Telangana: Minister KTR - Sakshi

ప్యానెల్‌ డిస్కషన్‌లో కేటీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్‌ తయారీ కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సమావేశాల్లో భాగంగా పలు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. కరోనా మహమ్మారి వల్ల వైద్య రంగంలో ఉన్న లోపాలు ప్రపంచవ్యాప్తంగా కనిపించాయన్నారు, కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో తమ దగ్గర కావాల్సినన్ని వెంటిలేటర్లు లేవని న్యూయార్క్‌ గవర్నర్‌ అన్నారని, ఆ పరిస్థితుల్ని అంచనా వేస్తే లైఫ్‌ సైన్సెస్‌కు పెద్దపీట వేయాలన్న ఆలోచన కలిగిందన్నారు.

ఈ మేరకు చేసిన కృషి వల్ల ప్రపంచంలోకెల్లా మూడో వంతు వ్యాక్సిన్లు తెలంగాణలోనే ఉత్పత్తి అవుతున్నాయన్నారు. తెలంగాణలోనే 40 శాతం ఫార్మసీ ఉత్పత్తులు తయారవుతున్నాయని చెప్పారు. కరోనా తరహాలో మరే ఇతర మహమ్మారులు వచ్చినా ఎదుర్కొనే రీతిలో టీకాలు అవసరమని గుర్తించి ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్ల ఉత్పత్తి విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థను సంప్రదించామని, అందుకు ఆ సంస్థ కూడా ఆసక్తి ప్రదర్శించిందని... త్వరలోనే తెలంగాణలో ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్‌ హబ్‌ను డబ్లు్యహెచ్‌వో ఏర్పాటు చేయబోతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 

అత్యధిక వృద్ధి రేటు తెలంగాణలోనే.. 
దేశంలో అత్యధిక వృద్ధి రేటు తెలంగాణలోనే ఉన్నట్లు మంత్రి కేటీఆర్‌ చెప్పారు. కోవిడ్‌ ఉన్నా.. నోట్ల రద్దు చేసినా.. కేంద్రం సహకరించకున్నా.. తెలంగాణ రాష్ట్రం వృద్ధి రేటులో దూసుకువెళ్తున్నట్లు కేటీఆర్‌ వెల్లడించారు. రాష్ట్రంలో సమ్మిళిత వార్షిక వృద్ధిరేటు 15 శాతంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. ఒకవేళ కేంద్రం తమకు సహకరించి ఉంటే తెలంగాణ మరింత వేగంగా వృద్ధి సాధించేదని పేర్కొన్నారు. తెలంగాణ తరహాలో ఇతర రాష్ట్రాలన్నీ పనిచేసుంటే దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే రూ. 5 లక్షల కోట్ల మార్కును దాటేదన్నారు. 

మోదీ సర్కార్‌ అప్పు రూ.100 లక్షల కోట్లు.. 
మోదీ ప్రధాని కావడానికి ముందు దేశ అప్పు రూ. 56 లక్షల కోట్లుగా ఉండగా మోదీ పాలనలో దేశం కొత్తగా రూ. 100 లక్షల కోట్ల మేర అప్పులపాలైనట్లు మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. గత 8 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ఖజానాకు పన్నుల రూపంలో రూ. 3.68 లక్షల కోట్లు అందించినా తమ ప్రభుత్వానికి కేంద్రం నుంచి వచ్చింది కేవలం రూ. 1.68 లక్షల కోట్లేనని కేటీఆర్‌ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement