
బీఆర్‌ఎస్ పిటిషన్‌పై తేల్చిచెప్పిన హైకోర్టు
ప్రత్యేక ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదని వెల్లడి
వాదనలు ముగించిన ధర్మాసనం
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బోగస్ ఓట్లపై బీఆర్‌ఎస్ అభ్యర్థి సమర్పించిన ఫిర్యాదుపై ఎన్నికల కమిషన్ చర్యలు ప్రారంభించినందున తమ జోక్యం అవసరం లేదని హైకోర్టు అభిప్రాయపడింది. ఓటర్ల నమోదు, తొలగింపు నిరంతర ప్రక్రియ అని, ఈ నెల 21 వరకు సమయం ఉన్నందున సరైన చర్యలు తీసుకోవాలని ఈసీని ఆదేశించింది. ఒకసారి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అత్యంత అనివార్యమైతే తప్ప న్యాయస్థానాలు జోక్యం చేసుకోవద్దన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ప్రస్తావించింది.
కోర్టు ఉత్తర్వుల కారణంగా ఎన్నికల ప్రక్రియలో జాప్యం జరగకుండా చూసుకోవాలని సుప్రీం హెచ్చరించిందని వ్యాఖ్యానించింది. ఇక ఈ పిటిషన్‌లో ప్రత్యేక ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ విచారణ ముగించింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బోగస్ ఓట్లతోపాటు బయటి వ్యక్తుల పేర్లు చేర్చారంటూ మాగంటి సునీతతోపాటు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మోహియుద్దీన్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.
వాదనలేంటంటే...
పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది దామ శేషాద్రినాయుడు వాదనలు వినిపిస్తూ.. ‘బీఆర్‌ఎస్ అభ్యర్థి ఈసీ అధికారిక వెబ్‌సైట్ నుంచి ఓటర్ల జాబితాను తీసుకున్నారు. నియోజకవర్గంలో 12 వేల బోగస్ ఓట్లతోపాటు బయటి వ్యక్తులు జాబితాలో ఉన్నారు. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు చేపట్టకుండా నిష్క్రియాత్మకంగా వ్యవహరిస్తోంది. అధికార పార్టీ తో కుమ్మక్కైన ఈసీ ఓటర్ల జాబితా సమగ్రతను దెబ్బతీసేలా ఎన్నికల దురి్వనియోగానికి పాల్పడింది.
బోగస్ ఓట్లు తొలగించి.. నవంబర్ 11న ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేలా ఈసీని ఆదేశించాలి’అని చెప్పారు. ఈసీ తరఫున సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ.. ‘ఓటర్ల నమోదు, తొలగింపు ప్రక్రియ నిరంతరం సాగుతుంది. ఈ నెల 21న నామినేషన్లు పూర్తయ్యే వరకు సవరణకు అవకాశం ఉంది. జాబితాపై పరిశీలన చేసి చర్యలు తీసుకుంటాం. సెప్టెంబర్ 2న ఈసీ విడుదల చేసిన ప్రాథమిక జాబితా ప్రకారం 3.92 లక్షల ఓటర్లున్నారు. సవరణల తర్వాత 6,976 మందిని కొత్తగా చేరగా, 663 మందిని తొలగించారు.
తుది ఓటర్ల జాబితా సెప్టెంబర్ 30న ప్రచురించాం. మొత్తం ఓటర్ల సంఖ్య 3.99 లక్షలు. జాబితాపై ఓటర్ల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదు. 12వేల బోగస్ ఓట్లు చేర్చారన్న వాదన సమర్థనీయం కాదు’అని చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఈసీ చర్యలు ప్రారంభించినందున ప్రత్యేక ఉత్తర్వులు అనవసరం లేదని పేర్కొంది. పిటిషనర్లు తమ ఫిర్యాదుపై చర్యలకు వేచిచూడకుండా కోర్టును ఆశ్రయించారని చెప్పింది.