
శ్రీశైలం ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తి నీటి విడుదల
దిగువకు 1.94 లక్షల క్యూసెక్కుల వరద
సాగర్‌లో 171 టీఎంసీలకు చేరిన నిల్వలు..
నిండుకుండలా మారిన శ్రీశైలం
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ జలాశయంలో గంటగంటకు నీటిమట్టం పెరుగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తడంతో వరద సాగర్ వైపు పరుగులు తీస్తోంది. ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి నిలకడగా వరద కొనసాగుతోంది. మంగళవారం ఉదయం 6 గంటలకు 1,53,672 క్యూసెక్కుల వరద ఉండగా, జలాశయంలో నీటి నిల్వలు 881 అడుగుల్లో 196.56 టీఎంసీలకు చేరాయి.
జలాశయం గరిష్ట నీటిమట్టం 885 అడుగులు, గరిష్ట నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, నిల్వలు 199 టీఎంసీలకు చేరడంతో మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ప్రాజెక్టు 4 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 1,06,976 క్యూసెక్కుల వరదను కిందకి విడుదల చేశారు. అయితే మంగళవారం రాత్రి 8 గంటల సమయానికి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం 1.86 లక్షల క్యూసెక్కులకు పెరిగింది.
నీటి మట్టం 882.2 అడుగులకు పెరిగింది. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 20 వేల క్యూసెక్కులను ఏపీ, కల్వకుర్తి లిఫ్టు ద్వారా తెలంగాణ 1600 క్యూసెక్కులను తరలించుకుంటున్నాయి. మొత్తం 1.94 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదలవుతున్నాయి.
ఎగువ నుంచి స్థిరంగా వరద
ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లలోకి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ఆల్మట్టి డ్యామ్‌లోకి 1.08 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. లక్షా 15 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. నారాయణపూర్ డ్యామ్‌లోకి 1.14 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 1.17 లక్షల క్యూసెక్కులు కిందకు వదిలేస్తున్నారు. దాని దిగువన తెలంగాణలో ఉన్న జూరాల ప్రాజెక్టులోకి 1.25 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. గరిష్ట నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలకు గానూ 7.95 టీఎంసీలను నిల్వ చేస్తూ 1.26 లక్షల క్యూసెక్కులను గేట్లు, విద్యుత్ కేంద్రం ద్వారా దిగువకు వదులుతున్నారు.
మరోవైపు తుంగభద్రలో వరద ఉధృతి కొనసాగుతోంది. డ్యామ్‌లోకి 52 వేల క్యూసెక్కుల నీరు చేరుతుండగా.. 61 వేల క్యూసెక్కులు దిగువకు వదిలేస్తున్నారు. జూరాల, తుంగభద్ర నుంచి విడుదల చేస్తున్న వరద శ్రీశైలం ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండడంతో జలాశయం వేగంగా నిండిపోయింది.
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జునసాగర్‌కు 1.94 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండటంతో నిల్వలు క్రమంగా పెరుగుతున్నాయి. నీటిమట్టం 531.9 అడుగులకు చేరింది. సాగర్ గరిష్ట నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 171.88 టీఎంసీలకు చేరింది. వరదలు ఇలానే నిలకడగా కొనసాగితే మరోవారం రోజుల్లో సాగర్ నిండే అవకాశం ఉంది.