ఏరు.. మళ్లీ నీరు.. | water crisis in Telangana photo feature | Sakshi
Sakshi News home page

water crisis: నిన్నటి వరకు నీళ్లులేక ఎండిపోయి

Apr 11 2025 5:57 PM | Updated on Apr 11 2025 5:57 PM

water crisis in Telangana photo feature

రెండు గిరిజన గ్రామాల్లో తాగునీటి ఇక్కట్లు

బండలు తేలి.. నెర్రలు కనిపించిన మహబూబాబాద్‌ జిల్లా గార్ల సమీపాన ఉన్న పాకాల ఏరు ప్రస్తుతం నీటితో నిండుకుండను తలపిస్తోంది. నెల రోజులుగా పాకాల ఏరు ఎండిపోయి.. కనీసం పశువులు తాగేందుకు సైతం నీళ్లులేని పరిస్థితి. ఇళ్లల్లోని బావులు, బోర్లు ఇంకిపోయాయి. జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయడంతో గురువారం ఉదయం ఒక్కసారిగా ఏటిలోకి నీళ్లు చేరుకున్నాయి.

మళ్లీ ‘బోరు’మనకుండా..
బేల మండలం శివారు గ్రామాల్లోని మహారాష్ట్ర సరిహద్దులో పెన్‌గంగా నదిని జీవనదిగా భావిస్తుంటారు. మూడు కాలాల పాటు నీటితో కళకళలాడే ఈ నది కూడా ఇసుకాసురుల పుణ్యమాని అడుగంటిపోయింది. అక్రమార్కులు నదిలో  యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు చేపడుతుండటంతో.. ఎన్నడూ లేనివిధంగా ఎండిపోయింది. నదిపైనే ఆధారపడి యాసంగి పంటలను సాగు చేసిన బేల మండలం సాంగిడి గ్రామ రైతులు.. చేలకు నీరందే పరిస్థితి లేకపోవడంతో తల్లడిల్లుతున్నారు. నదిలో ఓ గుంటలా తవ్వుకుని అందులో 12 బోర్లను వేశారు. నీళ్లు ఊరిన కొద్దీ పంటలకు అందిస్తున్నారు. నీరు అడుగంటితే బోరు చెడిపోకుండా.. మోటారు నడిచే వరకు రైతులు అక్కడే నిరీక్షించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. 

వృక్ష విలాపం 
అధిక ఉష్ణోగ్రతలతో కరీంనగర్‌ జిల్లాలోని మెట్ట ప్రాంతమైన రామడుగు, గంగాధర ప్రాంతాల్లో భారీ వృక్షాలు సైతం మోడువారుతున్నాయి. కాలువ ద్వారా వచ్చే నీటితో దిగువన ఉన్న పొలాలు పారుతుండగా.. ఆపైన మెట్ట ప్రాంతంలో ఉన్న భారీ వృక్షాలు నీరందక ఎండిపోతున్నాయి.
– సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్‌

ఆన్‌లైన్‌లోనే హాజరు
కూలీలు కచ్చితంగా ఉపాధి పనులకు హాజరు కావాల్సిందే. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో ఫొటో దిగాల్సిందే.. పనులు పూర్తయ్యాక కూడా ఫొటో దిగి ఇంటికి వెళ్లాలి. కూలీల పనిదినాల సంఖ్య లెక్కించాల్సిందే.. ఇలా పనులు ప్రారంభించినప్పటి నుంచి ముగిసే వరకూ మొబైల్‌ యాప్‌లో వివరాలన్నీ నమోదు చేయాల్సిందే. అర్హతగల ప్రతీ కుటుంబానికి 100 రోజుల పని దినాలు కల్పిస్తూ, వలసల నివారణ లక్ష్యంగా చేపట్టిన ఈజీఎస్‌లో.. రోజువారీ ప్రక్రియ ఇది. పెద్దపల్లి జిల్లా పెద్దబొంకూర్‌ గ్రామ శివారులో ఉపాధి హామీ కూలీల హాజరును ఫీల్డ్‌ అసిస్టెంట్‌ తన మొబైల్‌లో నమోదు చేస్తూ ఇలా కనిపించారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి   

Advertisement
 
Advertisement
Advertisement