గంగాధర: రైతుల సాగునీటి సమస్యలు పాదయాత్రలు, ప్రదక్షిణలు చేస్తే పరిష్కారం కావని, కన్నెపల్లి పంపులు ఆన్ చేయిస్తే పరిష్కారం అవుతాయని, చొప్పదండి ఎమ్మెల్యే దీనిపై దృష్టి పెట్టా లని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు. నారాయణపూర్ రిజర్వాయర్, వరదకాలువకు నీటిని విడుదల చేయాలని గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో మంగళవారం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. రవిశంకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులను విస్మరించిందన్నారు. చిత్తశుద్ధి ఉంటే కన్నెపల్లి పంప్‌హౌస్ మోటార్లు ఆన్ చేసి అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి ద్వారా వరదకాలువకు నీరు విడుదల చేసి మిడ్‌మానేర్, లోయర్‌మానేరు నింపాలన్నారు. వరదకాలువతో వేలాది ఎకరాలకు సాగునీరందేదని, ప్రస్తుతం చుక్కనీరు లేక దాదాపు 70 కిలోమీటర్ల పరిధి లోని రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. నారాయణపూర్ రిజర్వాయర్, కాలువ పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. చొప్పదండి మరోసారి ఎడారిగా మారే పరిస్థితి కనిపిస్తోందన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు.


