గ్రీన్‌ సిగ్నల్‌ | - | Sakshi
Sakshi News home page

గ్రీన్‌ సిగ్నల్‌

Jul 29 2026 1:04 AM | Updated on Jul 29 2026 1:04 AM

తీగలగుట్టపల్లి ఆర్వోబీ భూసేకరణలో తొలగిన ప్రతికూలత

ఆర్‌అండ్‌బీ సూచించిన రెండు సర్వే నంబర్లలో గందరగోళం

తప్పుడు సర్వే నంబర్లు తొలగించి ప్రభుత్వానికి రెవెన్యూ నివేదిక

భూ సేకరణకు అనుమతి ఇవ్వాలని జనవరిలో కోరిన కలెక్టర్‌

ఇటీవల అనుమతులు రావడంతో పనుల్లో కదలిక

త్వరలో 1.20 ఎకరాలకు గెజిట్‌ నోటిఫికేషన్‌

భూసేకరణకు మరో నాలుగు నెలలు సమయం

నాలుగో యేడు వచ్చినా.. నానా కష్టాలే

భూసేకరణకు

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌:

జిల్లా అధికారుల మధ్య సమన్వయ లోపం నగరవాసులకు శాపంగా మారింది. మూడేళ్లుగా కరీంనగర్‌ ప్రజలను ముప్పతిప్పలు పెడుతున్న తీగలగుట్టపల్లి ఆర్వోబీ పనుల్లో ఎడతెగని జాప్యం జరుగుతోంది. భూసేకరణ విషయంలో స్థానిక అధికారులకు హైదరాబాద్‌లోని ఉన్నతాధికారుల మధ్య సమన్వయ లోపంతో మూడేళ్లుగా ఆర్వోబీ పనులు నత్తనడక సాగుతున్నాయి. తాజాగా భూసేకరణ చిక్కులు తొలగడంతో పనులు ఊపందుకోనున్నాయి. కరీంనగర్‌– చొప్పదండి మార్గంలో తీగలగుట్టపల్లి వద్ద రైల్వే గేట్‌ పై రూ.156 కోట్ల అంచనా వ్యయంతో (సేతుబంధన్‌ పథకం కింద కేంద్రం రూ.128 కోట్లు, రాష్ట్ర వాటా రూ.28 కోట్లు) రైల్వే ఓవర్‌ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణానికి జూలై 13, 2023లో శంకుస్థాపన జరిగింది. 40 సంవత్సరాల వరకు ప్రజలకు ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా ఆర్వోబీ నిర్మాణాన్ని చేపడుతున్నట్లు అప్పటి మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. నాలుగు లేన్లతో వేస్తున్న బ్రిడ్జిని మొత్తం 750 మీటర్ల పొడవు, 21 మీటర్ల వెడల్పుతో సర్వీస్‌ రోడ్లు, స్థలసేకరణ, ఇతర వసతులు కల్పించి ఏడాదిలోగా నిర్మాణాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. మొన్నటి జూలై 13తో మూడేళ్లు పూర్తి కాగా.. పనుల్లో పురోగతి లేకపోవడం నగరవాసులకు శాపంగా మారింది. రోజుకు దాదాపు 20 సార్లు రైలు గేటు పడుతుండటంతో ఇబ్బంది పడుతున్నారు. ఇక చికిత్స కోసం వచ్చే రోగుల ప్రాణాలు గాలిలో కలిసిన ఉదంతాలు తెలిసిందే.

ఎందుకు ఆలస్యమంటే?

ఆర్వోబీకి ఇరువైపులా సర్వీసు రోడ్లకు దాదాపు 150 ఫీట్ల స్థలం కావాలని రోడ్లు భవనాలశాఖ జిల్లా రెవెన్యూ విభాగానికి లేఖ రాసింది. ఈ క్రమంలో స్థానికుల నుంచి భూసేకరణ విషయంలో తీవ్ర ప్రతిఘటనలు, న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. దీంతో సేకరించాల్సిన స్థలాన్ని 120 ఫీట్లకు కుదించి, మార్కింగ్‌ చేసి, సర్వే నంబర్లతో రెవెన్యూ విభాగానికి నివేదిక ఇచ్చారు. ఆ నివేదికపై రెవెన్యూ విభాగం సర్వే చేసింది. ఆర్‌అండ్‌బీ అధికారుల నివేదికలో రెండు సర్వే నంబర్లు తప్పుగా ఉన్నాయని రెవెన్యూ విభాగం గుర్తించి అప్రమత్తం చేసింది. అనంతరం ఆ పొరపాట్లు సరి చేశాక, స్థలసేకరణకు సెక్షన్‌ 10ఏ కింద మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఈ ఏడాది జనవరిలో ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీకి అప్పటి ఆర్డీవో నివేదిక మేరకు కలెక్టర్‌ కార్యాలయం లేఖ రాసింది. లేఖ రాసిన ఆరు నెలలకు ఇటీవల ఆర్‌అండ్‌బీ విభాగం ఈఎన్‌సీ హైదరాబాద్‌ కార్యాలయం స్పందించి 10ఏ కింద మినహాయింపు ఇచ్చింది. దీంతో పనులలో కాస్త కదలిక వచ్చింది. దీని ప్రకారం మరికొద్ది రోజుల్లోనే కలెక్టర్‌ కార్యాలయం 120 ఫీట్లమేర తనకు కావాల్సిన స్థలానికి కావాల్సిన 1.20 గుంటల స్థలానికి త్వరలోనే గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇస్తుంది. రెండు నెలల వ్యవధితో అదే నోటిఫికేషన్‌ను రెండోసారి జారీ చేస్తారు. ఆ తరువాత భూనిర్వాసితులతో అభ్యంతరాలపై మాట్లాడి పరిహారం నిర్ణయిస్తారు. ఈ వ్యవహారమంతా సాగేందుకు మరో నాలుగు నెలలు జరిగే అవకాశముంది.

నిధుల బెడద, భూసేకరణ, న్యాయపరమైన చిక్కులతో మూడేళ్లు పూర్తయినా ఆర్వోబీ ముందుకు సాగడం లేదు. రెండువైపులా పిల్లర్లు కట్టినా మధ్యలో కీలకమైన వంతెనను కలిపే పనులను ఇంతవరకూ చేపట్టలేదు. భూసేకరణకు నోటిఫికేషన్‌కు అన్ని అడ్డంకులు తొలగిన నేపథ్యంలో బ్రిడ్జి పనులు వేగవంతం కానున్నాయి. ప్రస్తుతం వర్షాకాలంలోనూ విద్యార్థుల నుంచి వృద్ధుల వరకూ రోజూ తీగలగుట్టపల్లి మీదుగా ప్రయాణించే సమయంలో వేలాదిగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌, కలెక్టర్‌ చిత్రామిశ్రా పనులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. కరీంనగర్‌– చొప్పదండి మార్గంలో ప్రజల ఇబ్బందులు పెరిగిపోతున్న వేళ పనులను వేగవంతం చేయాలని ఆర్‌అండ్‌బీ, రెవెన్యూ విభాగం అధికారులకు స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement