కరీంనగర్ క్రైం: కరీంనగర్ ట్రాఫిక్ పోలీసుస్టేషన్‌లో జరిగిన డ్రంకెన్ డ్రైవ్ కుంభకోణంలో విచారణ జరుగుతోందని సీపీ గౌస్ ఆలం స్పష్టం చేశారు. మొత్తం 14 కేసుల్లో రూ.34,700 మేర అవినీతి జరిగినట్లు తేలిందని, రూ.30 లక్షల అవినీతి జరిగిందనే వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని సీపీ స్పష్టం చేశారు. మే 19న పద్మనగర్‌కు చెందిన వ్యక్తి డ్రంకెన్ డ్రైవ్‌లో ఆర్‌ఎస్సై శ్రీకాంత్‌కు పట్టుపడగా.. సదరు వ్యక్తి కోర్టుకు హాజరుకాకుండానే కేసు డిస్పోజ్ అయినట్లు తేలిందన్నారు. ఇందుకు నిందితుడి నుంచి రూ.15వేల లంచం తీసుకున్న ఆర్‌ఎస్సై శనిగల శ్రీకాంత్, కోర్టు కానిస్టేబుల్ కె.సాయికృష్ణ, డీడీ డిస్పోజల్ స్టేషన్ కానిస్టేబుల్ ఎన్.కిరణ్ డూప్లికేట్ ఎస్టీసీ నంబర్‌ను పోలీస్ సైట్‌లో నమోదు చేసి కేసును అక్రమంగా డిస్పోజ్ చేసినట్లు ఆధారాలు లభించాయన్నారు. నివేదిక ఆధారంగా ముగ్గురిపై డీఐజీ సస్పెన్షన్ వేటు వేశారన్నారు. ట్రాఫిక్‌పోలీస్ స్టేషన్‌తో పాటు ఇతర స్టేషన్లలోనూ నమోదైన డ్రంకెన్‌డ్రైవ్ కేసుల్లో సమగ్ర విచారణ కొనసాగుతోందన్నారు. 2025 జనవరి నుంచి 2026 జూన్ 30వరకు ట్రాఫిక్ పోలీసుస్టేషన్‌లో 113 కేసుల్లో డూప్లికేట్, రిపీటడ్ ఎస్‌టీసీ నంబర్లను గుర్తించామన్నారు. మూడు కేసుల్లో రూ.6,000, రూ.3,000, రూ.1,000 చొప్పున జరిమానా చెల్లించినట్లు చూపించి కేసులను తప్పుగా డిస్పోజ్ చేశారన్నారు. 10 కేసుల్లో కోర్టు విధించిన జరిమానా కన్నా నిందితుల నుంచి రూ.9,700 అదనంగా వసూలు చేశారన్నారు. మిగిలిన 100 కేసుల్లో నిందితులు కోర్టులో హాజరై జరిమానా చెల్లించినప్పటికీ, కోర్టు రికార్డుల్లో రిపీటెడ్ ఎస్‌టీసీ కేటాయించినట్లు విచారణలో తేలిందన్నారు. మొత్తంగా 14 కేసుల్లో రూ.34,700 అవినీతి జరిగినట్లు గుర్తించామని వెల్లడించారు. డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన నిందితులను కోర్టులో హాజరు పరుస్తారని, జరిమానాను కోర్టు సిబ్బందికే చెల్లించాలని సీపీ స్పష్టం చేశారు. ఎవరైనా అదనపు డబ్బులు డిమాండ్ చేస్తే సీపీ కార్యాలయానికి లేదా ఏసీబీ కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని సూచించారు.


