కరీంనగర్ కార్పొరేషన్: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం కొండగట్టులో బుధవారం మహా గిరి ప్రదక్షిణ చేపడుతున్నట్లు డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. సకల జనుల సంక్షేమానికి చేపట్టిన ఈ గిరి ప్రదక్షిణకు మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో మాట్లాడుతూ.. వర్షాలు సమృద్ధిగా కురవాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని గురుపౌర్ణమి రోజున ఉదయం 5 గంటలకు ఈ గిరి ప్రదక్షిణ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇది రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమమని, అన్ని పార్టీలవారు పాల్గొనవచ్చన్నారు. నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించేందుకు తాను ప్రయత్నించినట్లు తెలిపారు. నారాయణపూర్ రిజర్వాయర్ పనులు 90శాతం పూర్తయ్యాయని, కొంతమంది ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్టు పూర్తయితే కాంగ్రెస్ పార్టీకి , ఎమ్మెల్యేకు గుర్తింపు వస్తుందని అడ్డుకొనేందుకు కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఎన్ని ఇండ్లు ముంపునకు గురయ్య అవకాశం ఉంటే అన్ని ఇళ్లకు పరిహారం అందిస్తామని స్పష్టం చేశారు. నాయకులు కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి, పులి ఆంజనేయిలుగౌడ్, కృష్ణారెడ్డి, ఇప్ప శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.


