మెడికో ప్రీతిని సైఫ్ టార్గెట్ చేసి అవమానించాడు: సీపీ రంగనాథ్‌

Warangal Cp Ranganath Medical Student Preethi Suicide Attempt case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వరంగల్‌ పీజీ మెడికల్‌ విద్యార్థిని ప్రీతిని సీనియర్‌ వేధించినట్లు పోలీసులు నిర్ధారించారు. సైఫ్‌ వేధించినట్లుగా ఆధారాలు లభించాయని వరంగల్‌ సీపీ రంగనాథ్‌ వెల్లడించారు. ఈమేరకు వైద్యవిద్యార్థిని ఆత్మహత్యాయత్నం ఘటనపై సీపీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రీతిని టార్గెట్‌ చేసి సైఫ్‌ వేధించాడని తెలిపారు. నాలుగు నెలలుగా వేధిస్తున్నట్లు వెల్లడైందన్నారు.

ప్రీతి చాలా తెలివి, ధైర్యం ఉన్న అమ్మాయని.. అలాగే సున్నిత మసన్తత్వం కలిగినదని సీపీ చెప్పారు. వాట్సాప్‌ గ్రూపులో ప్రీతిని అవమానించేలా సీనియర్‌ విద్యార్థి సైఫ్‌ మెసెజ్‌లు పెట్టాడని పేర్కొన్నారు. సైఫ్‌ తన ఇతర మిత్రులతో చేసిన చాటింగ్‌లో ప్రీతిని టార్గెట్‌ చేసినట్లు తెలిసిందన్నారు. ఆమెకు సహకరించవద్దని సైఫ్‌ తన ఫ్రెండ్స్‌కు చెప్పాడని, బ్రెయిన్‌ లేదంటూ హేళన చేస్తున్నట్లు చాటింగ్‌ ద్వారా వెల్లడైందన్నారు.

‘దీనిపై ఈనెల 18న వాట్సాప్‌ గ్రూపులో అతడు పెట్టిన మెసేజ్‌పై ప్రీతి ప్రశ్నించింది. తనను ఉద్దేశించి గ్రూప్‌లో చాట్‌ చేయడం సరికాదని.. ఏదైనా ఉంటే హెచ్‌వోడీల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పింది. ప్రీతి ప్రశ్నించడాన్ని సైఫ్‌ తీసుకోలేకపోయాడు. వేధింపుల గురించి ప్రీతి వాళ్ల తల్లిదండ్రులకు తెలియజేసింది. మొదట్నుంచీ సైఫ్‌ వల్ల ప్రీతి ఇబ్బందిగా భావించింది.

వాట్సాప్‌ గ్రూప్‌లో మెసెజ్‌ల ద్వారా అవమానించడం కూడా ర్యాగింగ్‌ కిందకే వస్తుంది. 21వ తేదీనే ప్రీతి, సైఫ్‌ను పిలిచి కాలేజీ యాజమాన్యం విచారించింది. పాయిజన్‌ ఇంజెక్షన్‌ ఏముంది అన్నదానిపై ప్రీతి గూగుల్‌లో సెర్చ్‌ చేసింది. విద్యార్థిని వేధించినందుకు ర్యాగింగ్‌ కేసుతోపాటు నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశాం. సైఫ్‌ను కోర్టులో హాజరుపరచనున్నాం. ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవు, కేసును పక్కదారి పట్టిస్తున్నారని ప్రచారం చేయడం సరికాదు. ఇలాంటి తప్పుడు ప్రచారం వల్ల దీని వల్ల విచారణపై ప్రభావం పడుతుంది.’ అని సీపీ పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top