మట్టి కొట్టుకుపోతున్న రాజమహళ్లు, గడీలు | Sakshi
Sakshi News home page

మట్టి కొట్టుకుపోతున్న రాజమహళ్లు, గడీలు

Published Fri, Jul 29 2022 7:53 PM

Wanaparthy Ranga Mahal, Sirnapally Gadi, Indaram Gadi to Be Restored - Sakshi

సాక్షి నెట్‌వర్క్‌: దర్పానికి, రాజసానికి దర్పణంగా నిలిచిన చారిత్రక కట్టడాలు నిర్లక్ష్యంతో శిథిలమై నిశీథిలోకి జారుకుంటున్నాయి. అబ్బుర పర్చే నిర్మాణ శైలికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచి ఇప్పుడు నిర్వహణాలోపానికి తలవంచి మట్టికొట్టుకుపోతున్నాయి. రెండొందల ఏళ్ల సంస్థానాధీశుల పాలనలో అనేక ప్రత్యేకతలతో నిర్మాణమైన రాజమహళ్లు, గడీలుశిథిల వైభవానికి చిరునామాలవుతున్నాయి. 1948లో సంస్థానాల పాలన అంతమైన అనంతరం రాష్ట్రంలోని పలుచోట్ల సంస్థానాధీశులు ఆ భవనాలను ప్రజోపయోగ పనుల కోసం ప్రభుత్వానికి అప్పగించారు. వీటిల్లో గత యాభై ఏళ్లు సజావుగా కార్యకలాపాలు నిర్వహించారు. కానీ, కొంతకాలంగా వీటిలో కనీస నిర్వహణ కరువైంది.

ఈ భవనాలు శిథిలమవుతున్న తీరుపై సంస్థానాధీశుల వారసు లతోపాటు చరిత్ర­కారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ భవనాల పరిరక్షణతో పర్యాటకం పెరగటమేకాక ఈ తరానికి ఆర్కిటెక్చర్‌కు సంబంధించి కొత్తపాఠాలు చెప్పినట్లు అవుతుందని వారు అంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించి ఈ భవనాల వైభవాన్ని ముందు తరాలకు అందించేవిధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు.


కళ చెదిరిన.. రంగ్‌ మహల్‌

వనపర్తిలో నూటాఏభై ఎనిమిది ఏళ్ల క్రితం సరికొత్త నిర్మాణశైలితో సంస్థానాధీశుని కోసం నిర్మితమైన ‘రంగుమహల్‌’ ఇప్పుడు కళ తప్పింది. హైదరాబాద్‌ స్టేట్‌లో సొంత కరెన్సీ– అరబ్బులుసహా భారీ సైనిక బల గాలతో 152 గ్రామాల్లో 605 చద రపు మైళ్లు కలిగిన అతిపెద్ద సంస్థానం వన పర్తి. ఎత్తైన గోపురాలతో విదేశీ శిల్పుల ఆధ్వర్యంలో 1849లో ప్రారంభమైన ఈ భవననిర్మాణం 1864లో పూర్తయింది. ఇండియాలో విలీనమైన అనంతరం చివరి సంస్థానాధీశుడు రాజారామేశ్వర రావు దీన్ని ప్రభుత్వానికి అప్పగించారు. దీనిలో 1958లో అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ చేతుల మీదుగా రాష్ట్రంలోనే తొలి పాలిటెక్నిక్‌ కళాశాలను ప్రారంభించారు.

అయితే భవనం నిర్వహణ లోపాలతో ఈ మధ్య పెచ్చులూడిపోతుండటంతో క్లాసులను వేరే చోటికి తరలించి ప్రస్తుతం పరిపాలన, గ్రంథాలయం కోసం వినియో గిస్తున్నారు. కళాత్మకమైన ఆర్చీలు ఇప్పటికీ చెదరలేదు. అయితే నిర్వహణ లోపాలతో గడీ మొదటి అంతస్తు మొత్తం శిథిలావస్థకు చేరుకుంది. తక్షణ మరమ్మతుల కోసం రూ.4.20 కోట్ల అంచనా వ్యయంతో ఫైలు ప్రభుత్వానికి పంపినా ఇప్పటివరకు ఆమోదం పొందలేదు. వనపర్తి సంస్థాన వారసురాలు నందినీరావు హైదరాబాద్‌లో విద్యాసంస్థలను నిర్వహిస్తున్నారు.


గ్రామస్తులు నిలబెట్టుకున్న సిర్నాపల్లి

1910–13లలో నిజామాబాద్‌ జిల్లా సిర్నాపల్లిలో ఇండో– యూరోపియన్‌ నిర్మాణశైలితో గడీ నిర్మితమైంది. సిమెంట్, స్టీల్, కాంక్రీట్‌ వాడకుండా ఈ గడీని నిర్మించడం విశేషం. గడీకి ముందు భాగంలో ఇరువైపులా ఎత్తైన గోపురాలు, మధ్యలో రాజసం ఉట్టిపడేలా గంభీరంగా చూస్తూ నిలుచున్న రెండు సింహాలు ఉంటాయి. ఈ గడీ నిర్మాణంలో పూర్తిగా మట్టి, ఇటుకలు, రాళ్లు, డంగుసున్నం, పొడవాటి ఇనుప స్తంభాలు ఉపయోగించారు. గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరించేందుకు వీలుగా ముఖద్వారం ఉత్తరం వైపు ఉండేలా నిర్మాణం చేపట్టారు. నిర్మాణ శైలి, వాడిన పదార్థాల మూలంగా ఈ గడిలో ఉష్ణోగ్రతలు సమతూకంగా ఉంటాయి. చలికాలం వెచ్చగా, వేసవికాలం చల్లగా ఉంటుంది. 

1921లో జానకీబాయి మరణానంతరం బందిపోట్లు, రజాకార్ల దాడుల్లో ఇతర బంగ్లాలు ధ్వంసమైనప్పటికీ గడీ మాత్రం పటిష్టంగానే ఉంది. తదనంతర కాలంలో ఇది దాదాపు మూడు దశాబ్దాలకుపైగా ప్రభుత్వ పాఠశాలగా సేవలు అందించింది. దీనిని శీలం జానకీబాయి వారసులు గ్రామస్తుల విరాళాలతో కాపాడుకుంటూ వస్తున్నారు. గ్రామస్తులు రూ.20 వేల విరాళాలు, జానకీబాయి వారసురాలు అనురాధారెడ్డి రూ.60 వేలు అందించారు. గ్రామ పంచాయతీ నుంచి మరో రూ.5 లక్షలు ఖర్చు పెట్టి మరమ్మతులు చేయించి పెయింటింగ్‌ వేయించారు. ఉపాధిహామీ కింద దీనికి ఒక వాచ్‌మన్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ గడీని పోటీ పరీక్షలకు సిద్ధపడే విద్యార్థుల కోసం గ్రంథాలయంగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. జానకీబాయి వారసురాలు అనురాధారెడ్డి హైదరాబాద్‌లో నివసిస్తున్నారు.


దొంగల పాలైన..  ఇందారం 

మంచిర్యాల జిల్లా జైపూర్‌ మండలం ఇందారం గడీ దొంగల పాలైంది. దేశ, విదేశాల నుంచి తెచ్చిన విలువైన సామగ్రి, కలపను ఎత్తుకుపోయారు. నిజాంరాజుకు నమ్మినబంటు అయినా గోనె వెంకట ముత్యంరావు ఆధ్వర్యంలో ఈ గడీని 1927లో హైదరాబాద్‌ స్టేట్‌లోనే ఓ ప్రత్యేకత శైలితో నిర్మించారు. ఈ గడీ కేంద్రంగా సిరోంచ, గడ్చిరోలి, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని 300 గ్రామాల పాలన సాగేది. 1948లో నిజాం లొంగుబాటు తర్వాత గోనె వెంకట ముత్యంరావు కుటుంబం హైదరాబాద్‌కు తరలివెళ్లింది. (క్లిక్: తెలంగాణకే తలమానికం! ట్విన్‌ టవర్స్‌)


టూరిజం సర్క్యూట్‌గా ఏర్పాటు చేయాలి

‘200 ఏళ్ల క్రితమే హైదరాబాద్‌ స్టేట్‌లో అత్యున్నత శైలిలో భవనాలు నిర్మించారు. అన్ని ప్రాంతాల్లోని సంస్థాన భవనాలపై ప్రభుత్వం తక్షణ శ్రద్ధ చూపి టూరిజం సర్క్యూట్‌గా ప్రమోట్‌ చేయాలి. దీనివల్ల ఆయా ప్రాంతాల ప్రాచుర్యంతోపాటు అనేకమందికి ఉపాధి కేంద్రాలుగా మారుతాయి’
–అనురాధారెడ్డి, కన్వీనర్, ఇంటాక్‌

Advertisement
 
Advertisement
 
Advertisement