
నల్లగొండ జిల్లా: గ్రామానికి కీడు వచ్చిందని.. అందుకే వర్షాలు కురుస్తలేవని ప్రజలంతా ఊరు విడిచి వనవాసం వెళ్లిన సంఘటన నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని తక్కెళ్లపహాడ్ గ్రామంలో ఆదివారం జరిగింది. గ్రామంలో రెండు నెలల్లో ఎనిమిది మంది వివి« ద కారణాలతో మృతి చెందారు. గ్రామంలో ఒకరు మృతి చెందగా, అతడి దశదినకర్మ పూర్తికాక ముందే మరొకరు మృతి చెందడం రెండు నెలలుగా జరుగుతోంది. దీనికి తోడు వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో గ్రామ రైతులు పత్తితోపాటు ఇతర మెట్ట, వరి పంటలను సాగుచేశారు.
వర్షాలు కురవకపోవడంతో పత్తి విత్తనాలు మొలకెత్తక రెండు, మూడుసార్లు పత్తి గింజలను విత్తారు. బోరుబావుల్లో సరిపడా నీళ్లు అందక భూములు తడవక పోవడంతో వరినార్లు ముదిరిపోతున్నాయి. గ్రామంలో వరుస మరణాలు జరగడం.. వర్షాలు కురవకపోవడానికి కీడే కారణమని భావించిన గ్రామస్తులు ఒక్కరోజు ఊరు విడిచిపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకోసం శనివా రం రాత్రి గ్రామంలో దండోరా వేయించారు. అందరూ ఊరు విడిచి వెళ్లాలని, గ్రామంలో ఒక్కరు కూడా ఇంట్లో పొయ్యి వెలిగించొద్దని, కిరాణ, మద్యం బెల్టు దుకాణాలు తెరవొద్దని, కోళ్లు, మేకలను కోయొద్దని దండోరా వేయించారు.
ఊరు విడిచి వెళ్లకున్నా, దుకాణాలు తెరిచినా రూ.5 వేలు, గ్రామంలో కోళ్లు, మేకలు కోసి మాంసం విక్రయిస్తే రూ.10 వేలు జరిమానా విధిస్తామని దండోరా వేయించారు. దీంతో గ్రామస్తులంతా ఆదివారం ఉదయం 6 గంటలకే గ్రామాన్ని విడిచి చెట్లకిందకు వనవాసం వెళ్లి అక్కడే వంటలు చేసుకొని ఆరగించి సాయంత్రం 6 గంటలకు ఇళ్లకు చేరుకున్నారు. ఇదిలా ఉండగా గ్రామంలో ఓ సామాజిక వర్గానికి చెందిన వారు గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద చెక్క కర్రలతో ఏర్పాటు చేసిన మంట నుంచి ప్రజలు నిప్పు కొనుగోలు చేసి తమ ఇళ్లలోకి తీసుకెళ్లిన తర్వాతే ఇంట్లో పొయ్యి వెలిగించుకొని వంట చేసుకోవాలని హుకుం జారీ చేయడంతో ప్రజలు తప్పని పరిస్థితుల్లో పాటించక తప్పలేదు.