
ఇన్‌చార్జ్ కలెక్టర్‌కు భూమి ఆధార పత్రాలు చూపిస్తున్న శివ
పురుగు మందు డబ్బాతో ఇన్‌చార్జ్ కలెక్టర్ ఎదుట హల్‌చల్
మరో ఘటనలో ఇల్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కాళ్లపైపడ్డ వ్యక్తి
గార్ల: అధికారులు ప్రభుత్వ భూమి అని ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని మధ్యలో నిలిపివేశారని, పూర్తిగా కట్టనివ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటానని ఓ బాధితుడు ఇన్‌చార్జ్ కలెక్టర్ ఎదుట పురుగు మందు డబ్బాతో హల్‌చల్ చేశాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గార్లలో సోమవారం జరిగింది. సోమవారం ఇన్‌చార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో గార్ల తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. విషయం తెలుసుకున్న మండలంలోని మర్రిగూడెం గ్రామ పంచాయతీకి చెందిన భూక్య శివ పురుగు మందు డబ్బా, భూమి హక్కు పత్రాలతో అక్కడికి వచ్చాడు.
తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని, అధికారులు ప్రభుత్వ భూమి అని నిర్మాణాన్ని మధ్యలో నిలిపివేశారని, ఇల్లు పూర్తిగా కట్టుకోనివ్వకపోతే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని కలెక్టర్ ఎదుట వాపోయాడు. ఈ క్రమంలో కలెక్టర్ భూమి పత్రాలు పరిశీలించి పక్కనే ఉన్న తహసీల్దార్ శారదను వివరాలు అడుగగా, ప్రభుత్వ భూమిలో నిర్మిస్తున్నాడని, అందుకే నిలిపివేశామని ఆమె వివరించారు. కాగా, తన నాన్న భూక్య కిషన్ పేరుమీద 24 గుంటల భూమి పట్టాదారు పాసు పుస్తకం ఉందని బాధితుడు ఇన్‌చార్జ్ కలెక్టర్‌కు పత్రాలను చూపించాడు. పూర్తి విచారణ జరిపిన అనంతరం సమస్య పరిష్కరిస్తామని కలెక్టర్ బాధితుడికి హామీ ఇచ్చారు.

ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కాళ్లపై పడిన అన్నెపర్తి గోపాల్
సార్, నీకాళ్లు మొక్కుతా...
గుండాల: నిరుపేద కుటుంబానికి చెందిన తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రానికి చెందిన అన్నెపర్తి గోపాల్.. ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కాళ్లపైపడి వేడుకున్నాడు. ‘సార్ నీ కాళ్లు మొక్కుతా, నాకు ముగ్గురు కుమారులు, నాలుగు కుటుంబాలు కలిసి ఒకే ఇంట్లో నివసిస్తున్నాం. మాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదు’అని విలపిస్తూ ఎమ్మెల్యే కాళ్లపై పడ్డాడు. ఉన్న చిన్న ఇంట్లో అందరం కలిసి ఉండలేక పోతున్నామని, వెంటనే ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేయాలని ఆయన కోరాడు.