మిస్‌ ఇండియా యు.ఎస్‌.ఏ వైదేహీ డోంగ్రేకథక్‌ | Vaidehi Dongre From Michigan Crowned Miss India USA 2021 | Sakshi
Sakshi News home page

మిస్‌ ఇండియా యు.ఎస్‌.ఏ వైదేహీ డోంగ్రేకథక్‌

Published Wed, Jul 21 2021 12:02 AM | Last Updated on Wed, Jul 21 2021 12:11 AM

Vaidehi Dongre From Michigan Crowned Miss India USA 2021 - Sakshi

మొన్నటి ఆదివారం ఆమెరికాలో ‘మిస్‌ ఇండియా యుఎస్‌ఏ’ పోటీ జరిగింది. సౌందర్యం మాత్రమే కాదు ప్రతిభ కూడా తమ సొంతం అని నిరూపించారు మన అమ్మాయిలు. కిరీటాన్ని గెలుచుకున్న వైదేహీ డోంగ్రేకథక్‌ డాన్సర్,పెద్ద సంస్థకు బిజినెస్‌ డెవలపర్‌ కూడా.ఫస్ట్‌ రన్నర్‌ అప్‌గా నిలిచిన అర్షి లలానిబ్రైన్‌ ట్యూమర్‌తో పోరాడుతూఆ టైటిల్‌ సాధించింది. అంతేకాదు, ఆ టైటిల్‌కు చేరినమొదటి అమెరికన్‌ ఇండియన్‌ ముస్లిం కూడా. ఒకరు మిషిగన్‌ నుంచి ఒకరు జార్జియా నుంచి ఈ టైటిల్స్‌ సాధించారు.

న్యూజెర్సీలోని రాయల్‌ ఆల్బర్ట్స్‌ ప్యాలెస్‌ మొన్నటి వారాంతంలో భారతీయ అమెరికన్‌ కుటుంబాలతో కళకళలాడింది. అందుకు కారణం అక్కడ ‘మిస్‌ ఇండియా యు.ఎస్‌.ఏ’ అందాల పోటీ జరుగుతూ ఉండటమే. దాంతో పాటు ‘మిసెస్‌ ఇండియా యు.ఎస్‌.ఏ’, ‘టీన్‌ ఇండియా యు.ఎస్‌.ఏ’ పోటీలు కూడా జరిగాయి. గత 40 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా జరుగుతున్న ఈ వేడుకలో 2020–21 సంవత్సరానికిగాను మిషిగన్‌ రాష్ట్రానికి చెందిన వైదేహి డోంగ్రే విజేతగా నిలిచింది. జార్జియాకు చెందిన అర్షి లలాని ఫస్ట్‌ రన్నరప్‌గా నిలిచింది. ఇద్దరూ తమ తమ ప్రత్యేకతలతో ఈ టైటిల్స్‌ను సాధించారు.

ముంబై అమ్మాయి
‘20 ఏళ్ల క్రితం ముంబై నుంచి మా కుటుంబం అమెరికాకు వలస వచ్చింది. ముంబైలో నా బాల్యం గడిచింది. అమెరికాలో నా చదువు. రెండు సంస్కృతుల మధ్య నేను పెరిగాను. రెంటిలోని అందమైన విషయాలను గ్రహించాను’ అంటుంది వైదేహి డోంగ్రే. అమెరికాలోని 30 రాష్ట్రాల నుంచి 61 మంది భారతీయ యువతులు ఈ టైటిల్‌ కోసం పోటీ పడితే విజయం 25 ఏళ్ల వైదేహి డోంగ్రేను వరించింది. మిషిగన్‌ యూనివర్సిటీలో చదువుకున్న వైదేహి ప్రస్తుతం ఆర్థిక రంగంలో పని చేస్తోంది. ‘నేను అమెరికాలో ఉన్న భారతీయ సమాజంలో స్త్రీల ఆర్థిక స్వతంత్రం, విద్య గురించి చైతన్యం కలిగించే పని చేయాలుకుంటున్నాను’ అని చెప్పింది. కథక్‌ డాన్సర్‌ కావడం వల్ల అద్భుతమైన కథక్‌ నృత్యం ప్రదర్శించి ‘మిస్‌ టాలెంటెడ్‌’ అవార్డు కూడా గెలుచుకుంది.

‘మేము అమెరికా వచ్చినప్పుడు ఇక్కడ కథక్‌కు అంత ప్రాముఖ్యం లేదు. మా అమ్మ మనిషా కథక్‌ డాన్సర్, టీచర్‌. ఇక్కడ కథక్‌ డాన్స్‌ స్కూల్‌ను నిర్వహించడానికి ఆమె చాలా కృషి చేయాల్సి వచ్చింది. ఆమెతో చిన్నప్పుడు ఆ డాన్స్‌ స్కూల్‌కు వెళుతూ కథక్‌ మీద ఆసక్తి పెంచుకున్నాను. డాన్సర్‌ని అయ్యాను. ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాను. ఇవాళ మా అమ్మ వల్ల, నా వల్ల అమెరికాలో కథక్‌ డాన్స్‌ ప్రదర్శనలు కొనసాగుతున్నాయి’ అంటుంది వైదేహి. ఈ విద్యలే కాకుండా ఆమెకు పాడటం కూడా తెలుసు. చాలా హిందీ సినిమా పాటలు పాడుతూ సరదాగా వీడియోలు చేస్తుంటుంది. మిస్‌ యు.ఎస్‌.ఏ ఇండియా టైటిల్‌ ఆమె తన తల్లికి అంకితం చేసింది. ‘ఇది నా ఆయీకి’ అని సోషల్‌ మీడియాలో రాసిందామె.

హైదరాబాద్‌ అమ్మాయి
‘గత సంవత్సరమంతా మా ఇంట్లో ఎవరి ముఖాల్లోనూ నవ్వు లేదు. కారణం మీకు తెలుసు. బయట మహమ్మారి వాతావరణం. ఇవాళ నాకు వచ్చిన ఫస్ట్‌ రన్నర్‌ అప్‌ టైటిల్, అందుతున్న పుష్పగుచ్ఛాలు మా నాన్నను చాలా సంతోషపెట్టాయి’ అంది అర్షి లలాని. ‘మిస్‌ ఇండియా యు.ఎస్‌.ఏ’ వేదిక పై అర్షి లలాని తన ప్రెజెన్స్‌తో అందరి హృదయాలను గెలుచుకుంది. దానికి కారణం ఆమె బ్రైన్‌ ట్యూమర్‌తో పోరాడటం వల్ల కూడా. అలాంటి ఆరోగ్య సమస్యతో కూడా ర్యాంప్‌ మీద ఆమె ఉత్సాహంతో కనిపించి హర్షధ్వానాలు అందుకుంది. అర్షి లలాని తల్లిదండ్రులు అజీజ్, రోజీనాలది హైదరాబాద్‌. అర్షి హైదరాబాద్‌లోని ఆగాఖాన్‌ అకాడెమీలో చదువుకుంది కూడా. జార్జియాలో స్థిరపడిన ఈ కుటుంబం నుంచి అర్షి ఈ టైటిల్‌ను గెలుచుకుంది.

‘ఇది నా జీవితానికి సంబంధించి టర్నింగ్‌ పాయింట్‌ అనుకుంటున్నాను. మన వెనుక ఎందరు ఉన్నా, మద్దతు అందించినా వేదిక మీద మనం ఒక్కళ్లమే నడవాలి. అంటే మనల్ని మనమే గెలిపించుకోవాలి అని అర్థమైంది. నేను నా కుటుంబాన్ని గర్వపడేలా చేశాను. అమెరికాలో స్థిరపడిన ముస్లిం కుటుంబాల నుంచి ఇలాంటి టైటిల్‌ గెలుచుకునే స్థానానికి వచ్చినందుకు సంతోషిస్తున్నాను’ అందామె.న్యూయార్క్‌లో స్థిరపడిన భారతీయ వ్యాపారవేత్త ధర్మాత్మ శరణ్‌ 1980లో ఈ అందాల పోటీని ప్రారంభించారు. అమెరికాలో ఉన్న భారతీయుల కోసం ‘మిస్‌ ఇండియా యు.ఎస్‌.ఏ’ ఇతర ప్రపంచ దేశాలలో ఉన్న భారతీయుల కోసం ‘మిస్‌ ఇండియా వరల్డ్‌వైడ్‌’ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ పోటీలు ఈ అక్టోబర్‌లో ముంబైలో జరగనున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement