పేరుకే ఫ్రీక్వెన్సీ! తప్పని నిరీక్షణ

Unfortunate Wait For Passangers During Peak Hours In Metro Stations - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: నగరంలో రద్దీ వేళల్లో మెట్రో రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. ప్రతి నాలుగైదు నిమిషాలకోసారి మెట్రో రైలు నడుపుతామన్న అధికారుల మాటలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయని ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. కొన్ని సందర్భాల్లో 8 నుంచి 10 నిమిషాల పాటు నిరీక్షణ తప్పడంలేదని చెబుతున్నారు. కొన్నిసార్లు ఉద్యోగులు, విద్యార్థులు, వివిధ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం మూడు మెట్రో కారిడార్ల పరిధిలోని 54 మెట్రో మెట్రో స్టేషన్లకు చేరుతున్న ప్రయాణికులు ప్లాట్‌ఫారాలపై కిక్కిరిసిపోతున్నారు.

రైలులోకి ప్రవేశించే సమయంలోనూ తోపులాట తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక బోగీల్లోనూ బయటి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఏసీని పెంచడం లేదా తగ్గించడం చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కానీ.. మధ్యాహ్నం వేళల్లో బోగీల్లో ఉక్కపోతతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు విలవిల్లాడుతున్నారు. మెట్రో అధికారుల పర్యవేక్షణ లోపంతోనే తరచూ ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని ప్రయాణికులు అంటున్నారు.  

క్రమంగా పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్య..  
కోవిడ్‌ అనంతర పరిస్థితుల నేపథ్యంలో నగరంలో మెట్రో రైళ్లలో రద్దీ క్రమంగా పెరుగుతోందని మెట్రో వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం సాధారణ రోజుల్లో మూడు కారిడార్లతో కలిపి రద్దీ 3 నుంచి 3.5 లక్షలుకాగా.. సెలవు రోజుల్లో రద్దీ నాలుగు లక్షలకు చేరువవుతోందని పేర్కొన్నాయి. సాధారణ రోజుల్లో అత్యధికంగా ఎల్బీనగర్‌– మియాపూర్‌ రూట్లో నిత్యం సరాసరిన సుమారు 1.75 లక్షల మంది జర్నీ చేస్తున్నారని.. ఆతర్వాత నాగోల్‌– రాయదుర్గం మార్గంలో 1.5 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారని.. ఇక జేబీఎస్‌– ఎంజీబీఎస్‌ రూట్లో రద్దీ 25 వేలుగా ఉంటుందని తెలిపాయి.

నగరంలో అన్ని మెట్రో స్టేషన్ల వద్ద ప్రయాణికులు తమ ద్విచక్ర వాహనాలు, కార్లను పార్కింగ్‌ చేసుకునే అవకాశం లేకపోవడం, పార్కింగ్‌ ఉన్న చోట చార్జీల బాదుడు షరామామూలే. సమీప కాలనీలు, బస్తీలకు చేరుకునేందుకు ఆటోలు, క్యాబ్‌లను ఆశ్రయించి జేబులు గుల్ల చేసుకోవాల్సి వస్తోందని ప్రయాణికులు అంటున్నారు. ఇటీవలి కాలంలో పలు మెట్రో స్టేషన్లలో మధ్యభాగం (కాన్‌కోర్స్‌)వద్ద చిరు వ్యాపారాలు ఏర్పాటు చేసుకునేందుకు నిర్మాణ సంస్థ అవకాశం ఇచి్చంది. ఈ ప్రాంతంలో నిత్యావసరాల దుకాణాలు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. దీంతో రైలు దిగిన వెంటనే సిటీజన్లు వస్తువులను  కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.  

(చదవండి: మహ్మద్‌ ప్రవక్తపై రాజాసింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు.. పాతబస్తీలో హైటెన్షన్‌)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top