ఒత్తిడి భరించలేక ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
కొత్తగూడ: ఒత్తిడి తట్టుకోలేక ఓ విద్యార్థిని ‘నేను చదువుకోలేను. చెల్లిని బాగా చదివించండి’.. అంటూ లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పొగుళ్లపల్లిలో గురువారం జరిగింది. ఎస్‌ఐ రాజ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పెండ్లి రాజేందర్–దేవకి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. దంపతులిద్దరూ జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్‌లో ఉంటూ పనులు చేసుకుంటున్నారు.
పెద్ద కుమార్తె పెండ్లి చందన (16)ను వరంగల్ జిల్లా నర్సంపేట లోని అమ్మమ్మ గారింట్లో ఉంచారు. చందన ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. ఈ క్రమంలో గురువారం చందన పొగుళ్లపల్లిలోని ఇంటికి వచ్చి చున్నీతో ఉరేసుకుంది. ‘చదువు ఒత్తిడి తట్టుకోలేను.. తాను చదువు మానేస్తానని తల్లిదండ్రులకు చెప్పగా, చదువు మానేస్తే పెళ్లి చేసుకోవలసి వస్తుందన్నారని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ రాసుకుంది.
చెల్లిని బాగా చదివించి డాక్టర్‌ను చేయాలని, అమ్మా.. నాన్న గొడవ పడకుండా ఉండాలని కోరుకుంటున్నట్లు ఆ లేఖలో పేర్కొంది. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ రాజ్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించి సూసైడ్ నోట్‌ను స్వా«దీనం చేసుకున్నారు.


