
సాక్షి,హైదరాబాద్: వారిద్దరూ పోలీసులు ఉన్నతాధికారులు. 1990 బ్యాచ్‌కు చెందిన వీరిద్దరూ ఐపీఎస్ అధికారులు. ఎస్‌వీపీ ఎన్‌పీఏలోనే శిక్షణ పొందారు. అప్పటి నుంచి వీరి స్నేహం కొనసాగుతోంది. కాగా.. ఎన్‌పీఏ నుంచి బయటకు వచ్చిన ఐదేళ్లకు బ్యాచ్ రీయూనియన్‌లో ఈ ద్వయం కలుసుకున్నారు. ఆపై సమాచార మార్పిడి, ఫోన్ ద్వారా సంభాషణలు జరుగుతున్నా ప్రత్యక్షంగా కలుసుకునే అవకాశం వీరికి రాలేదు. అయితే అలాంటి అరుదైన కలయికకు వేదికైంది నగరంలోని శివరాంపల్లిలో ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడెమీ. (ఎస్‌వీపీ ఎన్‌పీఏ)లో శుక్రవారం ఆ అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. అదే అకాడెమీలో 35 ఏళ్ల క్రితం శిక్షణ పొందిన ఈ ఇద్దరు అత్యున్నత అధికారులు 30 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. వీరిలో ఒకరు తెలంగాణ మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (డీజీపీ), ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ అంజనీ కుమార్ అయితే... రెండో వారు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) డైరెక్టర్ జనరల్ దల్జిత్ సింగ్ చౌదరి.
30 ఏళ్ల తర్వాత..
శిక్షణ నుంచి బయటకు వచి్చన తర్వాత అంజనీ కుమార్ ఆంధ్రప్రదేశ్, దల్జీత్ సింగ్ ఉత్తరప్రదేశ్ క్యాడర్లకు వెళ్లారు. అప్పటి నుంచి వీరి స్నేహం కొనసాగుతోంది. 30 ఏళ్ల తర్వాత శుక్రవారం మళ్లీ ఆ అవకాశం వచి్చంది. ఎస్‌వీపీ ఎన్‌పీఏలో జరిగిన 77వ బ్యాచ్ ఐపీఎస్ అధికారుల పాసింగ్ ఔట్ పరేడ్‌కు దల్జీత్ సింగ్ చౌదరిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ విషయం తెలుసుకున్న అంజనీకుమార్ సైతం ఎస్‌వీపీ ఎన్‌పీఏకు వెళ్లారు. అక్కడ వీరిద్దరూ ఇతర పోలీసు అధికారులకు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యారు.