
బేగంపేట వైట్‌హౌస్ సమీపంలో రోడ్డు ప్రమాదం
లారీ ఢీకొని యువ వైద్యుడు, ర్యాపిడ్ డ్రైవర్ దుర్మరణం
పంజగుట్ట(హైదరాబాద్): లారీ రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. యువ వైద్యుడితో పాటు ర్యాపిడో డ్రైవర్‌ను బలి తీసుకుంది. ఆదివారం తెల్లవారు జామున బేగంపేట వైట్‌హౌస్ సమీపంలో లారీ ఢీకొన్న దుర్ఘటనలో ర్యాపిడో డ్రైవర్, బైక్ వెనక కూర్చున్న యువ వైద్యుడు మృతి చెందారు. పంజగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా హవేలీ రూరల్‌కు చెందిన ముద్దంగల్ నవీన్ (30) నగరంలో జేఎన్‌టీయూ సమీపంలో నివసిస్తూ ర్యాపిడో బైక్ నడుపుతున్నాడు.
కరీంనగర్ జిల్లా ధర్మపురికి చెందిన డాక్టర్ కస్తూరి జగదీష్ చంద్ర (35) బేగంపేట కిమ్స్– సన్‌షైన్ ఆస్పత్రిలో జనరల్ ఫిజీషియన్ చేస్తూ.. బేగంపేటలోని కుందన్‌బాగ్‌లో నివాసం ఉంటాడు. ఆదివారం తెల్లవారు జామున విధులు ముగించుకున్న జగదీష్ చంద్ర ఇంటికి వెళ్లేందుకు ర్యాపిడో బైక్ బుక్ చేసుకున్నాడు. నవీన్ తన యాక్టివా బైక్‌పై బేగంపేట ఫ్లైఓవర్ దిగి క్యాంపు కార్యాలయం ముందు నుంచి యూటర్న్ చేసుకుని గ్రీన్‌ల్యాండ్స్ వైపు వెళ్తున్నాడు.
ఇదే సమయంలో యూసుఫ్‌గూడ బస్తీ నుంచి భద్రాచలం వెళ్తున్న ఇసుక లారీ బేగంపేట బ్రిడ్జి పైకి వస్తోది. గ్రీన్‌ల్యాండ్స్ సిగ్నల్ దాటగానే లారీ వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో బైక్ నడుపుతున్న నవీన్ అక్కడికక్కడే మృతి చెందాడు. కొన ఊపిరితో ఉన్న డాక్టర్ జగదీష్ చంద్రను ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకోట్టపల్లికి చెందిన లారీ డ్రైవర్ శంకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.