
సాక్షి, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంజనీరింగ్‌లో మరో రెండు కొత్త కోర్సులు రాబో తున్నాయి. ఐఐటీ మద్రాస్ వీటిని అందుబాటులోకి తెస్తోంది. 2025–26 విద్యా సంవత్సరంలో జరిగే జోసా (జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ) కౌన్సెలింగ్‌లో ఇవి ఉంటాయని మద్రాస్ ఐఐటీ తెలిపింది. మద్రాస్ ఐఐటీలోని అప్లైడ్ మెకానిక్స్, బయో మెడికల్ విభాగాలు ఈ కోర్సును డిజైన్ చేశాయి. ఒక్కో విభాగంలో 40 సీట్లు ఉంటాయని ఐఐటీ అధికారులు తెలిపారు. ప్రస్తుత ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని దృష్టిలో ఉంచుకుని కోర్సులను రూపొందించామని ప్రొఫెసర్ వి కామకోటి తెలిపారు.
ఇవీ కోర్సులు
⇒ నాలుగేళ్ల కాలపరిమితితో ఉండే ఈ రెండు కోర్సుల ప్రత్యేకతలను ఐఐటీ మద్రాస్ వెల్లడించింది. కంప్యుటేషనల్ ఇంజనీరింగ్ అండ్ మెకానిక్స్ (సీఈఎం) కోర్సు ఏఐ టెక్నాలజీ ఆధారితంగా ఉంటుంది. సాధారణ ఇంజనీరింగ్ విద్య కు భిన్నంగా ఉండే ఈ కోర్సు వల్ల విద్యార్థి సరికొత్త మెకానికల్ టూల్స్‌పై పట్టు సాధిస్తాడు. సాలిడ్ అండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్ మెటీరియల్ సైన్స్, డైనమిక్స్‌లో అత్యాధునిక సాంకేతికతను అనుసంధానం చేశారు.
⇒ బయోమెడికల్ ఇంజనీరింగ్‌ను మరింత బలోపేతం చేసేందుకు ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ బయో మెడికల్ ఇంజనీరింగ్ (ఐబీఎంఈ) ఉపయోగపడుతుంది. ఐవోటీ, ఏఐ, వెబ్ ఎనేబుల్డ్ మెడికల్ టెక్నాలజీని ఈ కోర్సు ద్వారా అందిస్తారు. మారుతున్న వైద్య రంగంలో మంచి ఉపాధికి ఇది తోడ్పడుతుందని చెబుతున్నారు.