కాళ్లు మొక్కుతా.. మద్దతు ఇవ్వండి

Turmeric Farmer Protest On MP Arvind Kumar Program - Sakshi

అసంపూర్తిగా ముగిసిన చర్చలు 

రెండు అంశాలపైనే రైతుల పట్టు 

పసుపుబోర్డు ఏర్పాటు, మద్దతు ధర కావాలని డిమాండ్‌ 

‘మద్దతు’ కేంద్ర పరిధిలోకి రాదన్న ఎంపీ 

పోరాటానికి సిద్ధమవుతున్న అన్నదాతలు 

‘మీ కాళ్లు మొక్కుతా సారు. పసుపు పంటకు మద్దతు ధర ఇప్పించుండ్రి. పసుపు పండించి ఏటా నష్టపోతున్నాం. చేసిన కష్టానికి ఫలితం కాదు కదా, పెట్టిన పెట్టుబడి కూడా అత్తలేదు. పసుపు పండించమంటేనే భయమైతుంది. రైతులు దయనీయ స్థితిలో ఉన్నారు. మా పరిస్థితిని దయచేసి అర్థం చేసుకోండి సారు.. రూ.15 వేలు కాకపోయినా కనీసం రూ.10 వేల మద్దతు ధర వచ్చేలా చూడుండ్రి’  రైతులతో ఎంపీ ముఖాముఖి కార్యక్రమంలో మోతెకు చెందిన రైతు సంజీవ్‌ ఆవేదన ఇది. సమావేశంలో ఆయన అందరి ముందు సాష్టాంగ నమస్కారం చేసి, తన గోడు వెల్లబోసుకున్నాడు. రైతుల దయనీయ స్థితిని వివరిస్తూ పసుపు పంటకు మద్దతు ధర ఇప్పించాలని వేడుకున్నాడు.  

మోర్తాడ్‌(బాల్కొండ): చర్చలు ఫలించలేదు.. రైతుల ఆశలు తీరలేదు.. పసుపుబోర్డు ఏర్పాటు, గిట్టుబాటు ధర ప్రధాన ఎజెండాగా సాగిన రైతు అభ్యర్థులతో ఎంపీ అర్వింద్‌ ముఖాముఖి కార్యక్రమం రసాభాసగా మారింది. ఎటూ తేల్చకుండానే ఈ కార్యక్రమం అసంపూర్తిగా ముగిసింది. అయితే, రైతుల ఆవేదన వెల్లబోసుకునేందుకు ‘ముఖాముఖి’ వేదికైంది. పంట సాగుకు పెడుతున్న పెట్టుబడులు, తాము పడుతున్న కష్టాలు, తమకు వస్తున్న నష్టాలను కళ్ల కు కట్టినట్లు కర్షకులు వివరించారు. కాళ్లు మొక్కుతామని, తమ కష్టాలు తీర్చాలని ప్రాధేయపడ్డా రు. అయితే, పసుపు పంటకు మద్దతు ధర అంశం కేంద్రం పరిధిలో ఉండదన్న ఎంపీ.. రాష్ట్ర ప్రభు త్వం ప్రతిపాదనలు పంపిస్తే న్యాయం చేస్తామని తెలిపారు. అయితే, గతంలో ఇచ్చిన హామీ మేరకు పది రోజుల్లో పసుపుబోర్డు తేవాలని, లేకుంటే పదవికి రాజీనామా చేయాలని రైతులు డిమాండ్‌ చేశా రు. ఈ క్రమంలో వాడివేడీగా వాదనలు సాగాయి. ఎటూ తేల్చకుండానే చర్చలు ముగిశాయి.

ముఖాముఖి కార్యక్రమంలో ఎంపీ అర్వింద్‌తో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల వాగ్వాదం

తరలి వచ్చిన రైతు అభ్యర్థులు.. 
పసుపుబోర్డు ఏర్పాటుతో పాటు మద్దతు ధర కోసం ఏళ్లుగా పోరాడుతున్న రైతులు.. 2019 లోక్‌సభ ఎన్నికలను వేదికగా చేసుకున్నారు. నిజామాబాద్‌ స్థానం నుంచి 178 మంది రైతులు పోటీలో నిలిచి దేశ వ్యాప్త చర్చకు అవకాశమిచ్చా రు. అయితే, ఎన్నికలు ముగిసి ఏడాదిన్నర కా వొస్తున్నా పసుపుబోర్డు ఏర్పాటు కాకపోవడం, మ ద్దతు ధర లభించక పోవడంతో రైతులు మరోమా రు ఉద్యమాన్ని లేవదీశారు. ఈ నేపథ్యంలో స్పందించిన నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన రైతు అభ్యర్థులు, రైతు సంఘాల ప్రతినిధులతో కమ్మర్‌పల్లి మండలం చౌట్‌పల్లిలోని ఓ ఫంక్షన్‌లో హాల్‌లో శనివారం సమావేశమయ్యారు. మన జిల్లాతో పాటు జగిత్యాల జిల్లాకు చెందిన ఎంపీ అభ్యర్థులు, రైతు సంఘాల ప్రతినిధులు తరలి వచ్చారు. 

బోర్డు, మద్దతు ధర కావాలి.. 
రాజకీయ పార్టీలకతీతంగా నిర్వహించిన ఈ ముఖాముఖిలో ఎంపీ అభ్యర్థులు.. పసుపుబోర్డు ఏర్పాటు, మద్దతు ధర అంశాన్నే ప్రధానంగా లేవనెత్తారు. ఎట్టి పరిస్థితుల్లో పసుపుబోర్డు ఏర్పాటు చేయాల్సిందేనని, రూ.15 వేలు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన అర్వింద్‌ పసుపుబోర్డు ఏర్పాటుపై బాండ్‌ పేపర్‌ రాసి ఇచ్చిన విషయాన్ని రైతులు పదే పదే గుర్తు చేశారు. 

హామీకి కట్టుబడి ఉన్నానన్న ఎంపీ.. 
అయితే, తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నానని ఎంపీ అర్వింద్‌ తెలిపారు. తాను ఎన్నికైన వెంటనే పసుపుబోర్డుకు మించి సేవలందించే స్పైసిస్‌బోర్డు, ఇతర పథకాలను అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించానని వివరించారు. 2019 మే చివరి వారంలో బీజేపీ రెండోసారి అధికారం చేపట్టగా, జూన్‌ నెలలోనే తన పని తాను మొదలు పెట్టానని తెలిపారు. కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్‌ గోయెల్, హోం మంత్రి అమిత్‌షాలను సంప్రదించి స్పైసిస్‌బోర్డు రీజినల్‌ కార్యాలయాన్ని సాధించామని వివరించారు. పసుపు ధర పెరగాలంటే దళారీ వ్యవస్థ ఉండకూడదని, ఇందుకోసం నూతన వ్యవసాయ చట్టాలు తెచ్చామని చెప్పారు. ప్రాంతీయ పంటలకు మద్దతు ధర కోసం రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, ఈ మేరకు కేంద్రానికి లేఖ రాస్తే అవసరమైన కార్యాచరణ అమలు చేయడానికి తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 

అంగీకరించని రైతులు.. 
అయితే, ఎంపీ చెప్పిన అంశాలను రైతు సంఘాల ప్రతినిధులు అంగీకరించలేదు. పసుపుబోర్డు ఏర్పాటు, మద్దతు ధర ప్రకటన రెండే అంశాలను ఎజెండాగా తాము చర్చలకు వచ్చామని, వీటిపై స్పష్టత ఇవ్వకుండా ఇతర అంశాలను చర్చించడం కుదరదని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో ఎంపీకి, రైతు అభ్యర్థుల మధ్య మాటల యుద్ధం జరిగింది. పలు సందర్భాల్లో రైతులు జై జవాన్‌.. జై కిసాన్‌ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఎంపీ అర్వింద్‌ సమావేశం నుంచి వెళ్లి పోయారు. చర్చలు విఫలమయ్యాయని, పసుపుబోర్డు, మద్దతు ధరపై స్పష్టత రాలేదని రైతు సంఘాల ప్రతినిధులు తెలిపారు. త్వరలోనే సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top