బస్సులు పెంచుకుందాం.. ఆదాయం పంచుకుందాం! | TSRTC MD And APSRTC MD Conducts Meeting Over Bus Services | Sakshi
Sakshi News home page

బస్సులు పెంచుకుందాం.. ఆదాయం పంచుకుందాం!

Jul 26 2022 2:10 AM | Updated on Jul 26 2022 8:12 AM

TSRTC MD And APSRTC MD Conducts Meeting Over Bus Services - Sakshi

 సాక్షి, హైదరాబాద్‌: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచుకునే దిశగా మళ్లీ కదలిక మొదలైంది. ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమల రావు ఈడీలతో కలిసి హైదరాబాద్‌ బస్‌భవన్‌లో తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఈడీలతో సోమవారం భేటీ అయ్యారు. ప్రావిడెంట్‌ ఫండ్‌ ట్రస్టు, ఎస్‌బీటీ, ఎస్‌ఆర్‌బీఎస్‌ పథకాల విభజనే ప్రధాన ఎజెండాగా ఈ భేటీ జరిగినా అంతర్రాష్ట్ర సర్వీసులపై కూడా చర్చించారు.

రెండు రాష్ట్రాల మధ్య తిరిగే ప్రయాణికులు చాలినన్ని ఆర్టీసీ సర్వీసుల్లేక ప్రైవేటు బస్సుల్లో వెళ్తున్నారని, రెండు ఆర్టీసీలకు రావాల్సిన ఆదాయాన్ని ప్రైవేటు ఆపరేటర్లు కొట్టుకుపోతున్నందున ఆర్టీసీ సర్వీసుల సంఖ్య పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఏపీఎస్‌ ఆర్టీసీ అధికారులు ప్రతిపాదించారు. ప్రస్తుతం 1.52 లక్షల కి.మీ. చొప్పున మాత్రమే రెండు ఆర్టీసీల అంతర్రాష్ట్ర సర్వీసులు తిరుగుతున్నాయని, ఇప్పుడు కనీసం 2.05 లక్షల కి.మీ.కన్నా పెంచుకోవాలని ఏపీ అధికారులు పేర్కొన్నారు. అయితే తమ వద్ద బస్సుల సంఖ్య పరిమితంగా ఉందని, కొత్త బస్సులు కొన్న తర్వాత నిర్ణయం తీసుకుంటామని సజ్జనార్‌ పేర్కొన్నారు. త్వరలో టీఎస్‌ఆర్టీసీ 1,016 కొత్త బస్సులు కొననుంది. మరో 300 ఎలక్ట్రిక్‌ నాన్‌ ఏసీ బస్సులు సమకూర్చుకోనుంది.  

రెండేళ్ల కింద భారీగా కుదింపు.. 
రెండు ఆర్టీసీల మధ్య అంతర్రాష్ట్ర ఒప్పందం చేసుకునే క్రమంలో రెండేళ్ల కింద బస్సు సర్వీసుల సంఖ్యను భారీగా కుదించారు. 2020 ఆగస్టు నాటికి.. తెలంగాణ నుంచి ఏపీకి 746 బస్సులు తిరుగుతుండగా, ఏపీ నుంచి తెలంగాణకు 1,006 బస్సులు (లాక్‌డౌన్‌కు పూర్వం) నడిచేవి. తెలంగాణ బస్సులు ఏపీ పరిధిలో 1,52,344 కి.మీ. తిరుగుతుంటే, ఏపీ బస్సులు తెలంగాణలో 2,64,275 కి.మీ. తిరిగేవి. రెండూ సమంగా ఉండాలని, ఇందుకు లక్ష కి.మీ. పరిధిని, అంతమేర సర్వీసులను కుదించుకోవాలని తెలంగాణ ఆర్టీసీ అప్పుడు డిమాండ్‌ చేయగా ఏపీ తగ్గించుకుంది.  

పీఎఫ్‌ నిధి వాడుకోవటంతో చిక్కులు 
ఆర్టీసీ ఉమ్మడిగా ప్రత్యేకంగా పీఎఫ్‌ ట్రస్టును ఏర్పాటు చేసుకుని సొంతంగా పీఎఫ్‌ నిధిని నిర్వహిస్తోంది. ఆర్టీసీ విడిపోయినా ఆ ట్రస్టు ఉమ్మడిగానే ఉంది. తెలంగాణ ఆర్టీసీ రూ.1,300 కోట్ల పీఎఫ్‌ నిధిని వాడేసుకుని బకాయి పడింది. దీంతో పీఎఫ్‌ కమిషనరేట్‌ తీవ్రంగా స్పందించి షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. కానీ, ట్రస్టు చైర్మన్‌గా ఏపీ ఆర్టీసీ ఉన్నందున ఆ నోటీసులు ఏపీఎస్‌ ఆర్టీసీ పేరుతోనే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. తెలంగాణ ప్రత్యేక ట్రస్టు ఏర్పాటు, నిధుల విభజనపైనా అధికారులు చర్చించారు. స్టాఫ్‌ రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ స్కీం (ఎస్‌ఆర్‌బీఎస్‌), స్టాఫ్‌ బెన్వెలంట్‌ ట్రస్టు (ఎస్‌బీటీ)లు కూడా ఉమ్మడిగానే ఉన్నాయి. ఏపీఎస్‌ ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైన నేపథ్యంలో ఈ రెండు మనుగడలో లేవు. వాటిని కూడా విభజించుకునే అంశంపై చర్చించినా కొలిక్కి రాలేదు. దీంతో మరో నెలలో మరో సమావేశం ఏర్పాటు చేసుకుని వాటి విభజన ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement