టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీక్‌.. నిందితుల రిమాండ్‌ రిపోర్టులో కీలక అంశాలు

TSPSC Paper Leak Case: Key Facts On Accused Remand Report - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసు నిందితుల రిమాండ్‌ రిపోర్టు సాక్షి టీవీ చేతికి అందింది. ఈ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటి వరకు 12 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు సిట్‌ అధికారులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.  తొమ్మిది మంది నిందితులతోపాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

రిమాండ్‌ రిపోర్టు ప్రకారం.. అరెస్టయిన వారిలో నలుగురు టీఎస్‌పీఎస్‌సీ ఉద్యోగులు.. A1 ప్రవీణ్ TSPSC సెక్రెటరీ పీఏ, A2 నెట్వర్క్ అడ్మిన్ రాజశేఖర్, A10  ASO షమీమ్,  A12 డాటా ఎంట్రీ ఆపరేటర్ రాజశేఖర్ ఉన్నారు. నిందితుల్లో మరో నలుగురు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. 19 మంది సాక్షులను విచారించాం. టీఎస్‌పీఎస్‌సీ ఉద్యోగి శంకరలక్ష్మి ప్రధాన సాక్షి. ఫిర్యాదుదారుడు అసిస్టెంట్ సెక్రటరీ సత్యనారాయణ, టీఎస్‌పీఎస్‌సీ, తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీస్ ఉద్యోగులు, కర్మన్ ఘాట్‌లోని ఒక హోటల్‌లోని యాజమని, ఉద్యోగిని సాక్షి. 

ఈ నెల 4వ తేదీన ఆర్ స్క్వేర్ హోటల్‌లో  నీలేష్, గోపాల్‌తో పాటు డాక్యా బస చేశారు. హోటల్‌లో రెండు గదులు (107,108) అద్దెకు తీసుకుని.. అక్కడే  ప్రశ్నాపత్రం చూసి ప్రిపేర్ అయ్యారు. తర్వాత నీలేష్, గోపాల్ నేరుగా పరీక్షా కేంద్రానికి వెళ్లారు. హోటల్‌లోని సీసీటీవి ఫుటేజీలో పేపర్‌ ఎక్స్‌చేంజ్‌ వ్యవహారం నిక్షిప్తమైంది. ప్రవీణ్, రాజశేఖర్ ఇచ్చిన సమాచారం మేరకు షమీమ్, రమేష్, సురేష్‌లను అరెస్ట్‌ చేశాం. ముగ్గురు నిందితుల నుంచి ఒక ల్యాప్‌టాప్‌, మూడు మొబైల్ ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ముగ్గురు నిందితులను కస్టడి కోరిన సిట్
మరోవైపు పేపర్‌లీక్‌ కేసులో ఇటీవల అరెస్ట్‌ చేసిన ముగ్గురు నిందితులను సిట్‌ ఏడు రోజులపాటు కస్టడీకి కోరింది. షమీం, రమేష్, సురేష్‌లను సిట్‌ గురువారం అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top