అవకతవకలకు తావు లేదు | TSLPRB Chairman VV Srinivasa Rao Exclusive Interview with Sakshi TSLPRB Chairman VV Srinivasa Rao Speaks to Sakshi | Sakshi
Sakshi News home page

అవకతవకలకు తావు లేదు

Sep 14 2026 6:13 AM | Updated on Sep 14 2026 6:13 AM

TSLPRB Chairman VV Srinivasa Rao Exclusive Interview with Sakshi TSLPRB Chairman VV Srinivasa Rao Speaks to Sakshi

గత రిక్రూట్‌మెంట్‌లకంటే మరింత పకడ్బందీగా జాగ్రత్తలు 

అవసరమైన చోట సాంకేతికత వినియోగం పెంచాం

తొలిసారి మహిళలకు ఫైర్, ఎస్పీఎఫ్‌లో 33 శాతం రిజర్వేషన్లు అమలు

సిలబస్, పీఎంఈ, పీఈటీ పరీక్షల్లో ఎలాంటి మార్పులు లేవు

దళారులను నమ్మి మోసపోవద్దు..మోసగాళ్లను 

పట్టిస్తే రూ.5 లక్షల నజరానా

‘సాక్షి’ ఇంటర్వ్యూలో టీఎస్‌ఎల్పీఆర్బీ చైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు

నాగోజు సత్యనారాయణ
పోలీస్, ఎస్పీఎఫ్, అగ్నిమాపక, జైళ్లశాఖల్లో పోస్టుల భర్తీ ప్రక్రియను అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా చేపడుతున్నట్టు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్‌ నియామక మండలి (టీఎస్‌ఎల్పీఆర్బీ) చైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా సాంకేతికతను వినియోగిస్తున్నట్టు పేర్కొన్నారు. ఎస్సీల్లో గ్రూపుల వారీగా రిజర్వేషన్లను మొట్టమొదటిసారిగా పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌లో అమలు చేస్తున్నట్టు వెల్లడించారు. పోలీస్‌ ఉద్యోగాలకు పోటీపడుతున్న దరఖాస్తుదారుల్లో ప్రతి నలుగురిలో ఒకరు మహిళా అభ్యర్థే అని తెలిపారు. 

మహిళా కోటాలోనూ పోటీ పెరిగిందన్నారు. ఇటీవల 7,437 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైన విషయం తెలిసిందే.దరఖాస్తులు స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. బోర్డు ఈ నెల 16 వరకు దరఖాస్తులకు గడువు పెంచింది. ఈ నేపథ్యంలో పోలీస్‌ నియామక ప్రక్రియ, సిలబస్, పరీక్ష విధానం, సాంకేతికత వినియోగం తదితర అంశాలపై ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వీవీ శ్రీనివాసరావు ఆ వివరాలు వెల్లడించారు. 

ఇటీవల ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలు జరుగుతున్న దృష్ట్యా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ?
పోలీస్‌ ఉద్యోగాల ఎంపికలో రెండు దశల్లో రాత పరీక్షలు ఉంటాయి. లీకేజీకి ఆస్కారం లేకుండా గత రిక్రూట్‌మెంట్‌ల కంటే మరింత పకడ్బందీగా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పారదర్శకత విషయంలో 40 ఏళ్లుగా పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డుకు ప్రత్యేక చరిత్ర ఉంది. ఇతర రాష్ట్రాల రిక్రూట్‌మెంట్‌ బోర్డులు సైతం మన విధానాలు అనుసరిస్తున్నాయి. పేపర్‌ లీకేజీని అరికట్టేందుకు ఏం చర్యలు తీసుకుంటామన్నది గోప్యత పాటించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ అంశంపై ఇంతకంటే లోతుగా వివరాలు చెప్పడం సరికాదు. 

ఈసారి సిలబస్‌లో ఏమైనా మార్పులు చేశారా?
మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా 2022 రిక్రూట్‌మెంట్‌లోనే సిలబస్‌లో మార్పులు చేశాం. ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి సిలబస్‌లో ఎలాంటి పెనుమార్పులు లేవు. 

ఈ నోటిఫికేషన్‌లో ఆధార్‌ అథెంటికేషన్‌ తీసుకోవడానికి కారణం ?
పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రిలిమ్స్, దేహదారుఢ్య పరీక్షలు, మెయిన్స్‌ ఎగ్జామ్‌. ఇలా మూడు అంచెల్లో చేయాల్సి ఉంది. ఒక అభ్యర్థి బదులు నకిలీ అభ్యర్థి రాకుండా నిరోధించేందుకు ఫేషియల్‌ రికగ్నైజేషన్‌ కోసం ఈసారి దేశంలోనే తొలిసారి తెలంగాణ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఆధార్‌ అథెంటికేషన్‌ను వాడబోతోంది. 

ఈసారి అన్ని పోస్టులకు కలిపి ఎంత మంది దరఖాస్తు చేసే అవకాశముంది? 
ఇటీవల చేసిన పోలీస్‌ టెరిటరీల పునర్విభజనపై ప్రెసిడెన్షియల్‌ ఆర్డర్‌ రాని కారణంగా హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్‌గిరి, యాదాద్రి భువనగిరి పరిధిలో ఖాళీలను ఈ నోటిఫికేషన్‌లో చేర్చలేదు. అందుకే గత రిక్రూట్‌మెంట్‌తో పోలిస్తే ఈసారి దాదాపు 40 నుంచి 50 శాతం పోస్టులు ఈ నియామక ప్రక్రియ పరిధిలోకి రాలేదు. గతంతో పోలిస్తే కొన్ని విభాగాలు సైతం తగ్గాయి. కాబట్టి ఈసారి సుమారు నాలుగు లక్షల మంది దరఖాస్తు చేయొచ్చని అంచనా వేస్తున్నాం. 

ఈ నోటిఫికేషన్‌లో కీలకమైన మార్పులేంటి?
అగ్నిమాపక శాఖ, స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌లో మొట్టమొదటిసారి అన్ని పోస్టుల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ అమలు చేస్తున్నాం. ఈ రెండు శాఖల్లో ఇప్పటి వరకు మహిళా ఉద్యోగులు లేరు. అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి పెంపు మరో కీలక అంశం. కానిస్టేబుల్‌కు 34 ఏళ్లు, ఎస్‌ఐకు 37 ఏళ్ల వరకు దరఖాస్తు అర్హత వచ్చింది. ప్రిలిమినరీ పరీక్షలో ఎస్సీ, ఎస్టీలకు క్వాలిఫై మార్కునే హోంగార్డులకు వర్తింపజేస్తూ మరో కీలక నిర్ణయం ఉంది. 

పోలీస్‌ ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసేవారి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ?
పోలీస్‌ నియామకాల్లో ఎలాంటి అక్రమాలకు తావులేదు. అభ్యర్థి వారీగా అన్ని దశల్లో వివరాలు వారికి పీడీఎఫ్‌ రూపంలో అందజేస్తాం. దళారులను నమ్మి మోసపోవద్దని అభ్యర్థులకు సూచిస్తున్నాం. పోలీస్‌ ఉద్యోగాలిస్తామని మోసగించే దళారులు, మోసగాళ్లను పట్టించినవారికి రూ.5 లక్షల నగదు బహుమతి బోర్డు తరఫున ఇస్తామని ప్రకటిస్తున్నాను.

గత రిక్రూట్‌మెంట్‌తో పోలిస్తే పీఎంఈ, పీఈటీ పరీక్షల్లో ఏమైనా మార్పులు చేశారా? 
ఫిజికల్‌ టెస్ట్‌లో పారదర్శకతకు సాంకేతిక పరిజ్ఞానం వాడుతున్నారా?
గత రిక్రూట్‌మెంట్‌తో పోలిస్తే శారీరక కొలతల పరీక్షలు (పీఎంటీ), శారీరక దారుఢ్య పరీక్షలు (పీఈటీ)ల్లో ఎలాంటి మార్పులు లేవు. దేహ దారుఢ్య పరీక్షల్లో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా మైదానంలోకి వెళ్లే ముందే అభ్యర్థుల చేతికి రిస్ట్‌ బ్యాండ్‌ వేస్తాం. ఆ అభ్యర్థి ఎక్కడ ఉన్నా, అతడి వివరాలు నమోదవుతాయి. ఒకరి బదులు మరొకరు ఈవెంట్స్‌లో పాల్గొనలేరు. పరుగుపందెంలో కచ్చితమైన సమయం గుర్తించేలా ఆర్‌ఎఫ్‌ఐడీ (రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌) సాంకేతికత, ఎత్తును కొలిచేందుకు డిజిటల్‌ మెజర్‌మెంట్‌తోపాటు టేప్‌ వాడడం. ఈ మొత్తం ప్రక్రియ నమోదుకు సీసీటీవీ కెమెరాల వినియోగం..ఇలా అవకాశమున్న అన్ని అంశాల్లో సాంకేతికత వినియోగం పెంచాం.

పరిగెట్టు.. జాబ్‌ కొట్టు..
పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్‌ వెలువడటంతో పాటు, వయో పరిమితి పెంచడంతో నల్లగొండ నాగార్జున కళాశాల మైదానంలో తెల్లవారు జామున రన్నింగ్, లాంగ్‌ జంప్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న అభ్యర్థులు
– సాక్షి స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్, నల్లగొండ  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement