77% నోటీసుల పంపిణీ | List of Telangana voters who received SIR notices | Sakshi
Sakshi News home page

77% నోటీసుల పంపిణీ

Sep 14 2026 6:03 AM | Updated on Sep 14 2026 6:03 AM

List of Telangana voters who received SIR notices

23,31,073 మంది ఓటర్ల విచారణ పూర్తి

ఇప్పటి వరకు 13,69,023 మంది అర్హులుగా నిర్ధారణ

ధ్రువీకరణ పత్రాలను పరిశీలించే బాధ్యతలు జిల్లా కలెక్టర్లకు

ఫేక్‌ ధ్రువీకరణ పత్రాలిస్తే అనర్హులుగా వేటు

సాక్షి, హైదరాబాద్‌: ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ(సర్‌)–2026లో భాగంగా ఆదివారం నాటికి 77 శాతం నోటీసుల పంపిణీ పూర్తికాగా, నోటీసులు అందుకున్న/అందుకోనున్న మొత్తం ఓటర్లలో 25శాతం మంది విచారణ ప్రక్రియ సైతం పూర్తయింది. సర్‌లో భాగంగా ఇటీవల 2,64,87,213 మంది ఓటర్ల పేర్లతో ఇప్పటికే ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించగా, వారిలో 92,88,164 మంది అన్‌మ్యాప్డ్, అనామలీస్‌ గల ఓటర్లకు నోటీసులు జారీ చేసి విచారించే ప్రక్రియ కొనసాగుతోంది. ‘సర్‌’లో సాధించిన పురోగతిపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) కార్యాలయం రూపొందించిన రోజువారీ నివేదిక ప్రకారం..ఆదివారం సాయంత్రం 4 గంటల నాటికి 100 శాతం నోటీసుల ప్రచురణ పూర్తయింది. 

ఇందులో 72,01,011 మంది (77.52%) ఓటర్లకు నోటీసుల పంపిణీ పూర్తి కాగా, మరో 20,87,153 మంది ఓటర్లకు నోటీసుల పంపిణీ చేయాల్సి ఉంది. నోటీసులు అందుకున్న వారిలో 23,31,073 (25%) మందివి ఓటర్ల విచారణ పూర్తి చేశారు. నోటీసుల మీద ముద్రించిన తేదీన ఓటర్లు విచారణకు హాజరు కావాల్సి ఉండగా, వివిధ కారణాలతో 47,57,427 మంది విచారణ తేదీల గడువు ముగిసిపోయింది. దీంతో వీరి విచారణ తేదీలను రీషెడ్యూల్‌ చేసి కొత్త తేదీలను ఇవ్వనున్నారు. ఇప్పటికే 50,526 మంది ఓటర్లకు కొత్త విచారణ తేదీలు ఇచ్చారు. 

కలెక్టర్లకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన బాధ్యత 
ఓటర్లు సమర్పించిన ధ్రువీకరణ పత్రాలు నిజమైనవా? కావా? అని నిర్ధారించడానికి వాటిని జిల్లా కలెక్టర్లకు పంపిస్తున్నారు. సర్‌ ప్రక్రియ ప్రస్తుత దశలో సంబంధిత నియోజకవర్గ ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి(ఈఆర్వో)దే అంతిమ నిర్ణయం. వారు ఆమోదించిన పేర్లను నవంబర్‌ 9న ప్రచురించే తుది ఓటర్ల జాబితాలో ఉంటాయి. వీరు అనర్హులుగా తేల్చిన ఓటర్ల పేర్లను అందుకు గల కారణాలతో తొలగించిన ఓటర్ల జాబితాలో ముద్రిస్తారు. 

తొలగించిన ఓటర్లు తదుపరి దశలో జిల్లా కలెక్టర్‌కు, అక్కడా తిరస్కరిస్తే ఆ తర్వాతి దశలో సీఈఓకు అప్పీల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, తొలి అప్పీల్‌ దశకు ముందే ధ్రువీకరణ పత్రాల పరిశీలన అధికారం కలెక్టర్లకు అప్పగించడం గమనార్హం. ఓటర్లు సమర్పిస్తున్న ధ్రువీకరణ పత్రాలను సాఫ్ట్‌వేర్‌లో అప్‌లోడ్‌ చేయగానే వాటిలో నిజమైనవా? కావా? ధ్రువీకరించాల్సిన అవసరం ఉన్న పత్రాలను ఈఆర్వోలు కలెక్టర్లకు పంపిస్తున్నారు. ఇప్పటి వరకు కలెక్టర్లు 2,66,718 ఓటర్ల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించగా, మరో 7,48,487 మంది ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తి చేయాల్సి ఉంది.

ఇప్పటి వరకు 1,524 మంది అనర్హులు 
సర్‌లో భాగంగా ఇప్పటి వరకు 23,31,073 మంది ఓటర్ల విచారణకు హాజరై తన వద్ద ఉన్న ధ్రువీకరణ పత్రాలను రుజువులుగా సమర్పించగా, వారిలో 13,69,023 మంది ఓటర్లు అర్హులని తేల్చారు. విచారణ అనంతరం రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 1,524 మంది ఓటర్లను అనర్హులుగా గుర్తించారు. మిగిలిన ఓటర్ల అర్హతలపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. పరిశీలనలో నకిలీ ధ్రువీకరణ పత్రాలు సమర్పించిన ఓటర్లను అనర్హులుగా తేల్చుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement