వరంగల్‌, హన్మకొండ జిల్లాలు: ఏ ప్రాంతాలు ఎందులోకి?

TS Govt Issues Notification To Rename Warangal Districts, Here Is Ful Details - Sakshi

అర్బన్, రూరల్‌ జిల్లాల పేర్లతోపాటు మండలాలు మారుస్తూ ప్రాథమిక నోటిఫికేషన్‌

మారిన జిల్లాల స్వరూపం.. 

వరంగల్‌ జిల్లాలోకి వరంగల్, ఖిలా వరంగల్‌

హన్మకొండలోకి పరకాల, నడికుడ, దామెర

గత నెల 21న సీఎం కేసీఆర్‌ హామీ... 

అమలు చేస్తూ సీఎస్‌ ఉత్తర్వులు..

నెల రోజులపాటు అభ్యంతరాలు, వినతుల స్వీకరణ

సాక్షి, వరంగల్‌ : వరంగల్‌ అర్బన్, వరంగల్‌ రూరల్‌ జిల్లాలను హన్మకొండ, వరంగల్‌ జిల్లాలుగా మార్చేందుకు ప్రభుత్వం సోమవారం ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసింది. జిల్లాల పేర్ల మార్పుపై అభ్యంతరాలు, వినతుల స్వీకరణకు నెల రోజుల సమయం ఇచ్చింది. ఈ రెండు జిల్లాల పేర్లు మారుస్తున్నట్లు జూన్‌ 21న వరంగల్‌ మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సమయంలో సీఎం కేసీఆర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

హన్మకొండ, పరకాల రెవెన్యూ డివిజన్లతో కలిపి హన్మకొండ జిల్లా ఏర్పాటు చేయనుండగా, మొత్తం 12 మండలాలు, 139 రెవెన్యూ గ్రామాలు ఈ జిల్లా పరిధిలోకి వస్తాయి. ఇక వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గం కేంద్రంగా హన్మకొండ జిల్లా కేంద్రం కొనసాగుతుంది. వరంగల్, నర్సంపేట రెవెన్యూ డివిజన్లతో వరంగల్‌ జిల్లా ఏర్పడనుండగా, మొత్తం 15 మండలాలు, 217 రెవెన్యూ గ్రామాలు ఈ జిల్లా కిందికి వస్తాయి. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని వరంగల్, ఖిలా వరంగల్‌ మండలాలు వరంగల్‌లో కలవగా, వరంగల్‌ రూరల్‌లోని పరకాల, నడికుడ, దామెర మండలాలు హన్మకొండ జిల్లాలో కలిశాయి. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

ఎటువంటి గందరగోళం లేకుండా ఉండేందుకు..
ప్రజాభిప్రాయం మేరకు ఎటువంటి గందరగోళం లేకుండా ఉండేందుకు జిల్లా పేర్ల మార్పు జరుగుతోందని గతంలో సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్‌ ఇప్పటికే ప్రారంభం కాగా.. వరంగల్‌ కలెక్టర్‌ కార్యాలయం.. ఆజంజాహిæ మిల్లు మైదానం, ఆటోనగర్‌ ఏదో ఒక ప్రాంతంలో నిర్మాణానికి యోచిస్తున్నట్లు తెలిపారు.

ప్రభుత్వం నుంచి జీఓ వెలువడిన నేపథ్యంలో నెల రోజులపాటు అభ్యంతరాలు, వినతులు స్వీకరించనున్నారు. గెజిట్‌ రాగానే.. అర్బన్, రూరల్‌ జిల్లాల స్థానంలో.. హన్మకొండ, వరంగల్‌ జిల్లాలుగా అధికారికంగా కార్యకలాపాలు సాగుతాయి. ఇదిలా ఉంటే హన్మకొండ, వరంగల్‌ రెండు జిల్లాలైనప్పటికీ.. గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌ 66 డివిజన్లు, రెండు జిల్లాల పరిధిలోనే ఉంటాయి. అయితే కార్పొరేషన్‌ సర్కిళ్లు పెరిగే అవకాశాలున్నాయి.

హన్మకొండ జిల్లాలో..
వరంగల్‌ అర్బన్, వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గం పూర్తిగా హన్మకొండలోనే ఉంటుంది. పరకాల, హుస్నాబాద్, హుజూరాబాద్, స్టేషన్‌ఘన్‌పూర్, వర్ధ్దన్నపేట నియోజకవర్గాలకు చెందిన మండలాలు కూడా ఈ జిల్లాలోకి వస్తాయి. 

వరంగల్‌ జిల్లాలో
తూర్పు, నర్సంపేట నియోజకవర్గాలు పూర్తిగా ఈ జిల్లాలోకే రానుండగా, పాలకుర్తి, పరకాల, వర్ధ్దన్నపేట తదితర నియోజకవర్గాల మండలాలు కూడా వస్తాయి.  

నాలుగు రెవెన్యూ డివిజన్లు.. 27 మండలాలు...
జిల్లాల పునర్విభజన తర్వాత ఈ రెండు జిల్లాల్లో 27 మండలాలు ఉంటాయి. హన్మకొండ జిల్లాలో హన్మకొండ రెవెన్యూ డివిజన్‌ కింద 8, పరకాల డివిజన్‌ పరిధిలోని నాలుగు మండలాలు ఉండేలా చేశారు. 

►హన్మకొండ డివిజన్‌లో హన్మకొండ, కాజీపేట, ఐనవోలు, హసన్‌పర్తి, వేలేరు, ధర్మసాగర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లిలు
 ►పరకాల డివిజన్‌లో కమలాపూర్, పరకాల, నడికుడ, దామెర మండలాలు వస్తాయి. 
►వరంగల్‌ జిల్లాలో వరంగల్‌ రెవెన్యూ డివిజన్‌లో 9, నర్సంపేట డివిజన్‌లో 6 మండలాలు వస్తాయి. 
►వరంగల్‌ పరిధిలో వరంగల్, ఖిలా వరంగల్, గీసుకొండ, ఆత్మకూరు, శాయంపేట, వర్దన్నపేట, రాయపర్తి, పర్వతగిరి, సంగెంలు ఉంటాయి.
 ►నర్సంపేట డివిజన్‌లో నర్సంపేట, చెన్నారావుపేట, నల్లబెల్లి, దుగ్గొండి, ఖానాపురం, నెక్కొండ మండలాలు ఉంటాయి.  

సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు 
వరంగల్‌ అర్బన్, రూరల్‌ జిల్లాల స్థానంలో హన్మకొండ, వరంగల్‌ జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసినందుకు సీఎం కేసీఆర్‌కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఒక ప్రకటనలో కృతజ్ఞతలు  తెలిపారు. గత నెల 21న వరంగల్‌ నగర పర్యటన సందర్భంగా ప్రజాప్రతినిధులు, ప్రజల వినతి మేరకు సీఎం కేసీఆర్‌ సానుకూలంగా స్పందించారని తెలిపారు. ప్రజల సౌకర్యార్థం సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. దీని ద్వారా పరిపాలన ప్రజలకు మరింత సౌకర్యంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం వెంటనే ఆదేశాలు జారీ చేయడం సంతోషకరమని తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top