సోమేశ్‌ కుమార్‌ భూముల వ్యవహారం.. రేవంత్‌ సర్కార్‌ ప్లానేంటి? | Sakshi
Sakshi News home page

హాట్‌టాపిక్‌గా సోమేశ్‌ కుమార్‌ భూముల వ్యవహారం.. రేవంత్‌ సర్కార్‌ ప్లానేంటి?

Published Fri, Feb 2 2024 12:15 PM

TS Govt Big Plan On Former CS Somesh Kumar Land Issue - Sakshi

తెలంగాణ మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్  భూ ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఎలా ఉండబోతోంది?. ఫార్మా సిటీ వస్తుందని తెలిసి ముందుగానే భూములు కొనుగోలు చేశారా?. ఆయనతో పాటు భూములు కొనుగోలు చేసిన ఇతర అధికారుల వివరాలను ప్రభుత్వం ఆరా తీస్తోందా? అక్కడ భూములు అమ్ముకున్న రైతులు ఏమనుకుంటున్నారు? ఫార్మా సిటీ భూసేకరణ లోపభూయిష్టంగా జరిగిందా?. రేవంత్ రెడ్డి సర్కార్ ఫార్మా సిటీపై ఎలాంటి అడుగులు వేయబోతున్నారు..
 
హైదరాబాద్ మహానగర శివారులో రంగారెడ్డి జిల్లాలో ఫార్మాసిటీ ఏర్పాటుకు 2017లో శ్రీకారం చుట్టారు. యాచారం, కందుకూరు, కడ్తల్, ఆమనగల్లు మండలాల్లో 20వేల ఎకరాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు దాదాపుగా 12వేల ఎకరాలకు పైగా భూసేకరణ పూర్తి చేశారు. దాదాపుగా 500కు పైగా విదేశీ ఫార్మా కంపెనీలు ఇక్కడ తమ ప్రొడక్ట్స్ తయారీకి ముందుకొచ్చాయి. అయితే, దీనికి దగ్గరలోనే అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ 25ఎకరాల భూమి కొనుగోలు చేశారు. ఫార్మాసిటీ నుంచి కేవలం కిలోమీటర్ దూరంలో యాచారం మండలం కొత్తపల్లి రెవెన్యూ పరిధిలో 25ఎకరాల 19గుంటల భూమి తీసుకున్నారు. 

ఇక్కడ ప్రస్తుతం మార్కెట్ విలువ ఎకరాకు మూడు కోట్లకు పైగానే ఉంది. ధరణి పోర్టల్‌లో ఖాతా నెంబర్ 5237 ద్వారా సర్వే నెంబర్ 249/అ1లో 8 ఎకరాల భూమి, 249/ఆ2లో 10 ఎకరాల భూమి, 260/అ/1/1లో 7.19 ఎకరాల భూమి మొత్తం 25ఎకరాల 19 గుంటల భూమిని సోమేశ్ కుమార్ తన భార్య జ్ఞానముద్ర పేరుతో కొనుగోలు చేశారు. కొత్తపల్లి గ్రామానికి చెందిన నారాయణ రెడ్డి నుంచి సెల్ డీడ్ ద్వారా భూమిని జ్ఞానముద్ర కొన్నట్లు రెవెన్యూ అధికారులు స్పష్టం చేస్తున్నారు.  

2018లో తన సతీమణి జ్ఞానముద్ర పేరుతో నిబంధనల మేరకే  కొనుగోలు చేసినట్లు అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సాక్షి టీవీకి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రశాసన్ నగర్‌లో కేటాయించిన నివాసస్థలంలోని ఇంటిని విక్రయించి.. కొత్తపల్లిలో ఆరు సంవత్సరాల క్రితమే భూమిని కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. భూమి కొనుగోలుపై ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నట్లు సోమేశ్ కుమార్ వివరించారు. ఫార్మా సిటీ సమాచారం ముందుగానే తెలుసుకుని ఈ భూములు తక్కువ ధరకే కొనుగోలు చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

మరోవైపు సాగుకు పనికిరాకుండా ఉన్న ఈ భూమికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సహాయం రైతు బంధు పథకం కింద ఇప్పటి వరకు 14 లక్షల రూపాయలకు పైగా సోమేశ్ కుమార్ లబ్ధిపొందారు. ఈ భూమి కొనుగోలు చేసిన విధానంపై ఈడీ, విజిలెన్స్ విభాగాలకు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రభుత్వంలో పనిచేసిన సోమేశ్ కుమార్ అక్రమాస్తులు కూడకట్టుకున్నారని, ఆయనపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

మొత్తానికి సోమేశ్ కుమార్‌పై వస్తున్న భూ ఆరోపణలు.. ఎటువైపు టర్న్ తీసుకుంటాయనేది ఆసక్తికరంగా మారాయి. ఇక్కడ భూములు కొన్న అధికారుల్లో టెన్షన్ పుట్టిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మాసిటీ  చుట్టూ భూ కొనుగోళ్లపై విచారణ చేయిస్తే తమ పరిస్థితి ఏంటనే దానిపై అధికారుల్లో ఆందోళన మొదలైంది. ఓ ఐపీఎస్ అధికారి ఫార్మా సిటీ దగ్గర్లో మూడు వందల ఎకరాల భూమి కొనుగోలు చేసినట్లు ఆరోపణలున్నాయి. యాచారం మండలం కొత్తపల్లి, నక్కర్తిమేడిపల్లి గ్రామాల రైతులను భయాందోళనకు గురి చేశారట. అడ్డగోలు ధరకే రైతుల నుంచి భూములు తీసుకున్నట్లు విమర్శలున్నాయి. 

►సదరు ఐపీఎస్ అధికారి తమపై అక్రమంగా కేసులు పెట్టించి కోర్టు చుట్టు తిప్పుతున్నారని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ, పోలీసు అధికారులు తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని కంటతడి పెట్టుకుంటున్నారు అన్నదాతలు. తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూములను లాక్కోవాలని కొందరు చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. 

►ఫార్మా సిటీ భూ సేకరణ లోపభూయిష్టంగా ఉందని మండిపడుతున్నారు తాడిపర్తి గ్రామస్తులు, భూదాన్ ట్రస్టులో ఉన్న భూమిని కొందరు రియాల్టర్లు ఫార్మా సిటీకి అమ్ముకుని వెళ్లిపోయారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే భూమి కోసం చాలా ఏళ్లుగా ఆ ఊరి ప్రజలంతా న్యాయపోరాటం చేస్తున్నారని ప్రజలు చెబుతున్నారు.  

►ఫార్మాసిటీలో భూ సేకరణ వ్యవహారంలో ఓ వైపు గందరగోళం నెలకొనగా.. మరోవైపు ఉన్నతస్థాయి అధికారులు ముందుగానే సమాచారం తెలుసుకుని రైతుల నుంచి అడ్డగోలుగా భూములు కొనుగోలు చేశారు. మొత్తంగా ఫార్మాసిటీ చుట్టూ భూములు కొన్నవాళ్ల వివరాలు సేకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఎటువంటి చర్యలు చేపడుతుందనేది ఆసక్తికరంగా మారింది.

Advertisement
 
Advertisement
 
Advertisement