బీజేపీ వాళ్లది పచ్చి మోసం: కేటీఆర్‌

TRS Protests Over Paddy Procurement And KTR Slams On BJP - Sakshi

రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ శ్రేణుల దీక్షలు 

కేంద్రం యాసంగి వరి కొనాల్సిందేనని డిమాండ్‌ 

నేడు నల్ల జెండాలతో ఆందోళనలు

సాక్షి నెట్‌వర్క్‌: కేంద్రంపై ‘వరి పోరు’లో భాగంగా టీఆర్‌ఎస్‌ శ్రేణులు గురువారం రాష్ట్రవ్యాప్తంగా దీక్షలు, నిరసనలు చేపట్టాయి. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పిలుపుమేరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులంతా జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించారు. కేంద్రం తీరును తప్పుపడుతూ ఆందోళనలు చేశారు. తెలంగాణలో పండే యాసంగి ధాన్యాన్ని కేంద్రం కొనాల్సిందేనని డిమాండ్‌ చేశారు.

ఆదిలాబాద్‌ కలెక్టరేట్‌ ఎదుట నిరసనలో ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్‌ బాపురావు మోకాళ్లపై కూర్చుని వడ్లు దోసిట్లో పట్టుకుని ఆందోళన చేశారు. కేంద్రం తీరు దున్నపోతుపై వానపడినట్టుగా ఉందంటూ కరీంనగర్‌ కలెక్టరేట్‌ ఎదుట ‘ధర్నా’లో దున్నపోతుపై నీళ్లు చల్లుతూ నిరసన తెలిపారు. వరి పోరులో భాగంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నల్లజెండాలతో నిరసన తెలపాలని టీఆర్‌ఎస్‌ నిర్ణయించింది.  

బీజేపీ వాళ్లది పచ్చి మోసం: కేటీఆర్‌ 
కేంద్ర వైఖరిని ముందే గుర్తించిన సీఎం కేసీఆర్‌.. వరి వద్దని, ప్రత్యామ్నాయ పంటలు వేయాలని రైతులకు సూచించారు. కానీ బీజేపీ రాష్ట్ర నేతలు కేంద్రం కొంటుందని చెప్పి, రెచ్చగొట్టి మరీ వరి వేయించారు. ఇప్పుడు ధాన్యం కొనాలని కోరితే.. తెలంగాణను అవమానించేలా కేంద్ర మంత్రులు మాట్లాడుతున్నారు. బీజేపీది పచ్చి మోసం. వారికి ఎంత బలుపు.. నూకలు తినుమన్నోళ్ల తోకలు కత్తిరిస్తం.

కేంద్రం ఉప్పుడు బియ్యం ఎగుమతి చేస్తూ.. చేయడం లేదని సిగ్గు లేకుండా మాట్లాడుతోంది. కేంద్ర వైఖరికి నిరసనగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ ఇంటిపై నల్ల జెండాలను ఎగురవేసి నిరసన తెలియజేస్తాం. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను తగలబెట్టి.. రైతు వ్యతిరేక విధానాలపై నిరసన తెలుపుతాం. పట్టణాల్లో యువకులు బైక్‌ర్యాలీలు నిర్వహించాలి. ఈనెల 11న ఢిల్లీలో మోదీ ఇంటికి కూతవేటు దూరంలో ధర్నా చేస్తాం. – సిరిసిల్ల నిరసనల్లో మంత్రి కేటీఆర్‌ 

మోదీ అంటే మోదుడు.. బీజేపీ అంటే బాదుడు: హరీశ్‌ 
నాడు రాష్ట్రం కోసం పోరాడి సాధించుకున్నాం. నేడు తెలంగాణ రైతుల కోసం మళ్లీ రోడ్డెక్కాం. లక్ష్యాన్ని సాధిస్తాం. కేంద్రం లాభనష్టాలు బేరీజు వేసుకుని ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలా పనిచేస్తోంది. బడా కార్పొరేట్లకు లక్షల కోట్లరుణాలు మాఫీ చేశారు. రైతుల పంటను కొనాలంటే నష్టం వస్తుందంటున్నారు. తెలంగాణలో పండిన ప్రతి గింజనూ కొనాల్సిందే. ప్రధాని మోదీ మన్‌ కీ బాత్‌ కాదు.. ముందు తెలంగాణ రైతుల బాధలు వినాలి.

సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిరసన దీక్షలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌ రావు 

ఆయన అచ్చే దిన్‌ అని అధికారంలో వచ్చారు. కానీ ఇప్పుడు జనం సచ్చే దిన్‌ తీసుకొచ్చారు. మోదీ అంటే మోదుడు.. బీజేపీ అంటే బాదుడు అన్నట్టు తయారైంది. రోజురోజుకు పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరుగుతున్నాయి. కేంద్రంలో 16 లక్షలకుపైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ చేయకుండా నిరుద్యోగుల ఉసురుపోసుకుంటున్నారు. – సిద్దిపేట దీక్షలో మంత్రి హరీశ్‌రావు 

మంత్రులు ఎవరేమన్నారంటే.. 
ఖమ్మం: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బదనాం చేసేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధాన్యం కొనడం లేదు. – మంత్రి పువ్వాడ అజయ్‌

ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగిన ధర్నాలో వరి కంకులతో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్యే వెంకటవీరయ్య 

వనపర్తి: వరి కొనకుండా ఇబ్బందిపెడ్తున్న కేంద్రంపై రైతులు పెడుతున్న శాపం ఊరికే పోదు. కేంద్ర ప్రభుత్వానికి నూకలు చెల్లినట్టే. ఇప్పటికైనా ధాన్యం కొనుగోలు చేయాలి.
– మంత్రి నిరంజన్‌రెడ్డి 

సంగారెడ్డి: పంజాబ్‌ మాదిరిగా తెలంగాణలో పండిన యాసంగి వడ్లను కేంద్రంతో కొనుగోలు చేయించలేని రాష్ట్ర బీజేపీ నాయకులు దద్దమ్మలు – మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ 

వరంగల్‌: వడ్లు కొనకుండా రైతులను మోసం చేసేందుకు కేంద్రం కంకణం కట్టుకుంది. ఈ వైఖరిని తిప్పికొట్టాలి. – మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు 

ములుగు, మహబూబాబాద్‌: యాసంగిలో రైతులు పండించిన ప్రతి గింజను కేంద్రం కొనాల్సిందే. అప్పటి వరకు పోరాటం ఆపేది లేదు. – మంత్రి సత్యవతి రాథోడ్‌ 

నిర్మల్‌: ధాన్యం కొనుగోలు చేసేదాకా కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటాం. – మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి 

కరీంనగర్‌: వరి కొనుగోళ్లపై కేంద్రానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా దున్నపోతుపై వానపడినట్టే వ్యవహరిస్తోంది. – మంత్రి గంగుల కమలాకర్‌ 

వికారాబాద్‌: రాష్ట్రంలో ధాన్యం బాగా పండితే కేంద్ర పెద్దలు ఓర్వలేకపోతున్నారు. – మంత్రి సబితారెడ్డి 

పెద్దపల్లి: కేంద్ర ప్రభుత్వం యాసంగి ధాన్యం కొనేదాకా కొట్లాడుతాం. – మంత్రి కొప్పుల ఈశ్వర్‌ 

నిజామాబాద్, కామారెడ్డి: తెలంగాణ పచ్చగా ఉండటాన్ని బీజేపీ జీర్ణించుకోలేకపోతోంది. ప్రజలకు నూకల బియ్యం అలవాటు చేయాలంటూ కేంద్రమంత్రి పీయూష్‌ మాట్లాడటం దారుణం. – మంత్రి ప్రశాంత్‌రెడ్డి 

మహబూబ్‌నగర్‌: కేంద్రం ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులపై కక్ష సాధిస్తోంది. ప్రతి గింజను కేంద్రం కొనేదాకా పోరాటం చేస్తాం.  – మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ 

నల్లగొండ: దేశంలో ఆహార పంటలపై ఆంక్షలు విధించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. రైతుల పక్షాన సీఎం కేసీఆర్‌ పోరాటం చేస్తున్నారు. కేంద్రం మెడలు వంచుతారు. – మహమూద్‌ అలీ, జగదీశ్‌రెడ్డి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top