
ఏ వేదికను, అవకాశాన్ని వదలకుండా..
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నాటికి ఆ పార్టీ నేతలను ఇరుకున పెట్టేలా, ప్రజల్లో నిలదీసేలా ప్రత్యేక కార్యాచరణకు టీఆర్‌ఎస్ సిద్ధమైంది. ఏ వేదికనూ, అవకాశాన్నీ వదలకుండా బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాలని నిర్ణయించింది.
► బీజేపీ భేటీకి ముందు లేదా, తర్వాత సీఎం కేసీఆర్ స్వయంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ తీరుపై విమర్శనాస్త్రాలు సంధించనున్నారు.
► విభజన హామీలు, తెలంగాణపై కేంద్రం చూపుతున్న వివక్ష, కేంద్ర వైఫల్యాలు తదితర అంశాలపై రాష్ట్ర మంత్రులు కేంద్రానికి లేఖలు రాయనున్నారు. గతంలో పలు అంశాలతో రాసిన లేఖలపై స్పందన లేకపోవడాన్ని తాజా లేఖల్లో ఎత్తి చూపనున్నారు.
► బీజేపీ భేటీలో రాష్ట్ర అభివృద్ధి, విభజన హామీలకు సంబంధించి నిర్దిష్ట ప్రకటనలు చేయాలంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ప్రతి కార్యక్రమంలో డిమాండ్ చేయనున్నారు.
► ఇటీవల ప్రధాని పర్యటన సందర్భంగా పలు ప్రశ్నలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిట్టుగానే.. బీజేపీ వైఫల్యాలు, రాష్ట్రం పట్ల చూపుతున్న వివక్షపై ఊరూరా ఫ్లెక్సీలు పెట్టి ప్రచారం చేయనున్నారు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బలం పెంచుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు, త్వరలో హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, బహిరంగసభ నిర్వహించనున్న నేపథ్యంలో.. టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రతి వ్యూహానికి పదును పెడుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా జాతీయ స్థాయిలో పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న కేసీఆర్.. బీజేపీ విధానాలను ఎండగట్టేందుకు ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలే అనువైన సమయమని భావిస్తున్నారు.
కార్యవర్గ భేటీ కోసం ఇప్పటికే బీజేపీ హడావుడి మొదలుపెట్టడం, ప్రధాని మోదీ రెండు రోజుల పాటు రాష్ట్రంలో మకాం వేయనుండటంతో.. ఆ సమావేశాల కన్నా ముందే బీజేపీపై ఒత్తిడి పెంచేందుకు టీఆర్‌ఎస్ వ్యూహాన్ని రూపొందించింది. రాష్ట్రంపై కేంద్రం వివక్ష, విభజన హామీలు, నిధులు తదితర అంశాలను లేవనెత్తుతూ బీజేపీని ఇరకాటంలో పెట్టాలని భావిస్తోంది.
విభజన హామీలు, ఆర్థిక ఆంక్షలపై నిరసన
రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్న టీఆర్‌ఎస్.. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఈ అంశాలపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేయనుంది. కర్ణాటకలో అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి.. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా నిరాకరించడాన్ని ఎత్తి చూపాలని నిర్ణయించింది.
ఇక విభజన చట్టంలో పేర్కొన్న బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, కాజీపేటలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, జిల్లాకో నవోదయ స్కూల్ ఏర్పాటు, ఉన్నత విద్యా సంస్థల ఏర్పాటులో వివక్ష వంటి అంశాలపై బీజేపీని నిలదీసేందుకు సన్నద్ధమవుతోంది. ఓవైపు ఆర్థిక ఆంక్షల చట్రంలో ఇరికించి రాష్ట్రాన్ని ఆర్థికంగా బలహీనపర్చే కుట్రను అమలుచేస్తూ.. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా అస్థిరమైందనే విష ప్రచారానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంటోందని టీఆర్‌ఎస్ విమర్శిస్తోంది.
ఇంకోవైపు రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పన్నుల వాటా, గ్రాంట్ల విడుదలలో చూపుతున్న వివక్షనూ నిలదీస్తోంది. బీజేపీ కార్యవర్గ భేటీ నేపథ్యంలో ఈ అంశాన్నింటినీ జనంలోకి తీసుకెళ్లాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. వీటితోపాటు కేంద్ర ప్రభుత్వ అవినీతి, ప్రభుత్వ రంగ సంస్థల విక్రయం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల వంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపాలని కేసీఆర్ భావిస్తున్నారు.
త్వరలో మార్గనిర్దేశం చేయనున్న కేసీఆర్..
జాతీయ పార్టీ ఏర్పాటు సన్నాహాలను వివరించడంతోపాటు బీజేపీ విమర్శలకు దీటుగా స్పందించాల్సిన తీరుపై మార్గనిర్దేశం చేసేందుకు ఈ నెలాఖరులోగా సీఎం కేసీఆర్ పార్టీ పార్లమెంటరీ, శాసనసభాపక్షం, టీఆర్‌ఎస్ కార్యవర్గాల ఉమ్మడి సమావేశం నిర్వహించే అవకాశం ఉందని సమాచారం.
ఇక బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ముందుగానీ, తర్వాతగానీ సీఎం కేసీఆర్ స్వయంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తనదైన శైలిలో కేంద్రం, బీజేపీల తీరుపై విమర్శలు గుప్పించే అవకాశం ఉందని టీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి.
కార్యవర్గ భేటీలో, బయటా బీజేపీ నేతలు కేవలం రాజకీయ ప్రసంగాలకు పరిమితం కాకుండా.. రాష్ట్రానికి ఏమిస్తారన్న దానిపై నిర్దిష్ట ప్రకటనలు చేసేలా ఒత్తిడి తేనున్నట్టు తెలిపాయి. దీనిపై మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనే రోజూవారీ సభలు, సమావేశాల్లో ఈ డిమాండ్‌ను వినిపించనున్నట్టు వెల్లడించాయి.