ఎమ్మెల్యే రసమయి తిట్ల దండకం!

TRS MLA Rasamayi Balakishan Verbal War With Villager Goes Viral - Sakshi

సాక్షి, కరీంనగర్‌: అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ ఓ గ్రామస్తుడిపై నోరు పారేసుకున్నారు. తనను విమర్శించాడనే కోపంతో పరుష పదజాలంతో ఆయనపై విరుచుకుపడ్డారు. అయితే సదరు గ్రామస్తుడు సైతం.. ఎమ్మెల్యే తిట్ల దండకానికి అంతే దీటుగా బదులివ్వడంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. వివరాలు.. కరీంనగర్‌ జిల్లా మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ తమ గ్రామంలో పర్యటించలేదంటూ బెజ్జంకి మండలం బేగంపేటకు చెందిన కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు పోతిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఆయన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు గ్రామ సమస్యలను ప్రస్తావిస్తూ ఎమ్మెల్యేపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టినట్లు తెలుస్తోంది. (చదవండి: టీఆర్‌ఎస్‌లో రచ్చ.. తన్నుకున్న నాయకులు)

ఈ విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రసమయి, నేరుగా రాజశేఖర్‌రెడ్డికి ఫోన్‌ చేసి అసభ్య పదజాలంతో దూషించారు. హఠాత్పరిణామంతో కంగుతిన్న రాజశేఖర్‌రెడ్డి.. తాను సైతం ఎమ్మెల్యేపై తిట్ల దండకం అందుకుని గట్టిగానే బదులిచ్చారు. వీరిద్దరి మధ్య నడిచిన తిట్ల పురాణం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశమైంది. రసమయి వ్యవహారశైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాప్రతినిధి ఈ విధంగా మాట్లాడటం సరికాదంటూ కొంతమంది అభిప్రాయపడుతుండగా.. మరికొంత మంది మాత్రం ఎదుటి వాళ్లు రెచ్చగొట్టే రీతిలో వ్యవహరించినందు వల్లే ఆయన ఇలా చేశారంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top