సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి..

The trial should be conducted with the sitting judge about paper leakage - Sakshi

పేపర్‌ లీకేజీ వ్యవహారంపై  సీఎం స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోంది 

నైతికబాధ్యత వహిస్తూ చైర్మన్, సీఎం కేసీఆర్‌ రాజీనామా చేయాలి 

అఖిలపక్ష సమావేశంలో అభిప్రాయపడ్డ వక్తలు 

పంజగుట్ట (హైదరాబాద్‌): టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేపట్టి దీని వెనుక ఎవరెవరున్నారో మొత్తం బయటకు తీయాలని పలువురు వక్తలు డిమాండ్‌ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎప్పుడూ ఏపీపీఎస్సీ పేపర్లు లీకేజీ కాలేదని, తొలిసారి తెలంగాణలో లీకేజీ కావడం రాష్ట్ర చరిత్రలోనే ఇదొక దుర్దినమని ఆగ్రహం వ్యక్తం చేశారు. లిక్కర్‌ కేసులో కవిత ఉందా లేదా అనేదానికన్నా ఇది చాలా పెద్ద కేసని దీన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోకపోవడం, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సైతం ఈ వ్యవహారంపై నోరువిప్పకపోవడం ఎన్నో అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు.

సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ నిరుద్యోగ జాక్‌ ఆధ్వర్యంలో టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీపై బుధవారం ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్‌ మాట్లాడారు. అత్యంత గోప్యంగా ఉండాల్సిన చోట ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రవీణ్‌ను టీఎస్‌పీఎస్సీలో పెట్టడం దారుణమన్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జీవన్‌ రెడ్డి మాట్లాడుతూ..తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి లీకేజీలు చూడలేదన్నారు.

ఓఎమ్‌ఆర్‌ షీట్‌ నింపలేని వాడికి 103 మార్కులు వచ్చాయంటే కచ్చితంగా లీకేజీ జరిగిందని అర్థమవుతుందన్నారు.  దీనికి నైతిక బాధ్యత వహిస్తూ అతడితోపాటు సీఎం కేసీఆర్‌ కూడా తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. టీఎస్‌పీఎస్సీ మాజీ సభ్యుడు విఠల్‌ మాట్లాడుతూ..ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే తాను మాజీ సభ్యుడినని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉందన్నారు. కనీసం సెక్రటరీకి కూడా చెప్పకుండా చైర్మన్‌ గోప్యతను పాటించాలని కానీ, ఒక సెక్షన్‌ ఆఫీసర్‌ చేతికే పేపర్లు వెళ్లిపోవడం దారుణమన్నారు.

పేపర్‌ లీకేజీ వ్యవహారంతో టీఎస్‌పీఎస్సీ విశ్వసనీయత, పేరు ప్రతిష్టలు దిగజారిపోయాయన్నారు. సమావేశంలో ఈడబ్ల్యూఎస్‌ జాతీయ అధ్యక్షుడు రవీందర్‌ రెడ్డి, సీపీఐ యువజన నేత ధర్మేంద్ర, బీజేపీ నాయకుడు కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్, కాంగ్రెస్‌ నాయకులు అద్దంకి దయాకర్, చెరుకు సుధాకర్, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళి, సీనియర్‌ జర్నలిస్టు విఠల్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు :

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top