ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో ఎంఓయూ కుదుర్చుకున్న కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అనలాగ్ ఏఐ వ్యవస్థాపకుడు, సీఈఓ అలెక్స్ కిప్‌మాన్, మేఘా ఇంజనీరింగ్ ఎండీ పి.కృష్ణారెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి జూపల్లి కృష్ణారావు
హైదరాబాద్‌లో పైలట్ ప్రాజెక్టు అమలు
సీఎం సమక్షంలో అనలాగ్ ఏఐ, మేఘా ఇంజనీరింగ్ మధ్య ఎంఓయూ
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే తొలిసారిగా కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత ఫిజికల్ ఇంటెలిజెన్స్‌ను వినియోగించేందుకు వీలుగా హైదరాబాద్‌కు చెందిన మేఘా ఇంజనీరింగ్, దుబాయ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే అనలాగ్ ఏఐ వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. పైలట్ ప్రాజెక్టు కింద హైదరాబాద్‌లో ఫిజికల్ ఇంటెలిజెన్స్ ద్వారా ట్రాఫిక్ నిర్వహణ చేపట్టేందుకు బుధవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) చేసుకున్నాయి. ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలోని బోధి పెవిలియన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో అనలాగ్ ఏఐ వ్యవస్థాపకుడు, సీఈఓ అలెక్స్ కిప్‌మాన్, మేఘా ఇంజనీరింగ్ ఎండీ పి.కృష్ణారెడ్డి పాల్గొన్నారు. భాగ్యనగరంలో ట్రాఫిక్ సిగ్నళ్లను ఏఐ సాంకేతికతతో అనుసంధానించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఈ సందర్భంగా సూచించారు. ట్రాఫిక్ రద్దీకి, వాతావరణ మార్పులకు అనుగుణంగా సిగ్నళ్లు పనిచేసే విధానాన్ని తీసుకురావాలని కోరారు. భవిష్యత్తు తరాలకు అవసరమైన మేధోపరమైన మౌలిక సదుపాయాలు,ఫిజికల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పరిష్కారాల అభివృద్ధికి అనలాగ్ ఏఐ, మేఘా ఇంజనీరింగ్ భాగస్వామ్యంలో చేస్తున్న ప్రయత్నాలను ఈ సమావేశంలో కృష్ణారెడ్డి, కిప్‌మాన్ సీఎంకు వివరించారు.
ట్రాఫిక్ రద్దీని గుర్తించి తదనుగుణంగా నియంత్రణకు చర్యలు తీసుకోవడం, నీటి లీకేజీని గుర్తించి పైపులైన్ల మరమ్మతుల నిర్వహణకు ముందస్తు సూచనలు చేయడం, అవసరానికి అనుగుణంగా విద్యుత్ వాడకం, అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌లు, అగ్నిమాపక వాహనాలకు దారి ఇవ్వడం వంటి కాగ్నిటివ్ సిటీ సదుపాయాల అభివృద్ధికి ఉన్న అవకాశాలను అనలాగ్ ఐఏ సీఈఓ కిప్‌మాన్ రేవంత్‌రెడ్డికి వివరించారు. నగర సమస్యల సత్వర పరిష్కారానికి దోహదపడే సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై చర్చించారు. నగరంలో అడ్వాన్స్‌డ్ ఫిజికల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫార్మ్ వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేశారు.
సెన్సార్లు, రొబోటిక్స్ వంటి ఫిజికల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీ పరికరాల వినియోగంతో సురక్షితమైన, సమర్థవంతమైన, వేగంగా స్పందించే నగర రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయవచ్చని తెలిపారు. వేగంగా విస్తరిస్తున్న పట్టణాల అవసరాలకు తగ్గట్లు ప్రభుత్వాల పనితీరు సామర్థ్యం పెంపు, పౌర సేవల మెరుగుదల, డేటా ఆధారిత మౌలిక సదుపాయాల ప్రణాళిక తయారీకి అభివృద్ధి చెందుతున్న సాంకేతికత ఎలా దోహదపడుతుందో ఇరు సంస్థల ప్రతినిధులు సీఎంకు వివరించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు ఎం.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు, ప్రభుత్వ సలహాదారు కె.రామకృష్ణారావు, ఇన్వెస్ట్ సీఈఓ బి.అజిత్‌రెడ్డి పాల్గొన్నారు.


