లీగల్ సర్వీసెస్ అథారిటీ సేవలు వినియోగించుకోవాలి
బాధితులు.. ఆశ్రయించడం ఇప్పుడు చాలా సులభతరం
న్యాయసాయమే కాదు.. పరిహారం పంపిణీ సేవలు కూడా
లోక్ అదాలత్‌ల నిర్వహణలో నంబర్‌వన్‌గా టీఎస్‌ఎల్‌ఎస్‌ఏ
బంధాలు తెగిపోకుండా మధ్యవర్తిత్వంతో సమస్య పరిష్కారం
నేడు లీగల్ సర్వీసెస్ అథారిటీ డే
సాక్షి, హైదరాబాద్: ఉచితంగా న్యాయసాయం పొందడం అనేది ప్రజల రాజ్యాంగ బద్ధమైన హక్కు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఇదే చెబుతోంది. కోర్టు పేరు చెబితే చదువుకున్నవారు, ఆర్థికంగా కొద్దోగొప్పో ఉన్నా హడలిపోతారు. కోర్టుల్లో పోరాటం అంటే ఖరీదైన వ్యవహారమే. మరి నిరుపేదలు, నిస్సహాయులు, అభాగ్యులు, అనాథలు ఏం చేయాలి. ఎలా న్యాయం పొందాలి. దీని కోసం ఉద్భవించినవే లీగల్ సర్వీసెస్ అథారిటీలు.
వివక్ష లేకుండా న్యాయం అందరికీ సమానంగా అందాలనేది దీని మూల సూత్రం. న్యాయ వ్యవస్థను ఉపయోగించుకోవడానికి ఆర్థిక స్తోమత లేని వారికి అథారిటీ సాయమందిస్తుంది. పేదలకు ఉచిత న్యాయ సలహానే కాదు, న్యాయవాదిని అందిస్తుంది. అంతే కాదు పలు పథకాలు అందజేస్తుంది. నవంబర్ 9న లీగల్ సర్వీసెస్ అథారిటీ డే (న్యాయ సేవల దినోత్సవం) సందర్భంగా ఆ వివరాలు తెలుసుకుందాం.
నేషనల్ అథారిటీ
చట్టాలపైన అవగాహన లేమితో అణగారిన, బలహీన వర్గాలకు సరైన న్యాయం అందడం లేదని సుప్రీంకోర్టు భావించింది. ఉచిత న్యాయ సేవలను అందించడానికి, వివాదాల సామరస్య పూర్వక పరిష్కారానికి లోక్ అదాలత్‌ల నిర్వహణ కోసం 1987లో లీగల్ సర్వీసెస్ అథారిటీ చట్టం ప్రకారం.. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) ఏర్పాటు చేసింది. నల్సా ప్రాటన్ ఇన్ చీఫ్‌గా భారత ప్రధాన న్యాయమూర్తి, ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా సుప్రీంకోర్టులో రెండో సీనియర్ న్యాయమూర్తి వ్యవహరిస్తారు.
రాష్ట్ర అథారిటీ
ప్రతి రాష్ట్రంలో నల్సా విధానాలు, ఆదేశాలను అమలు చేయడానికి, ప్రజలకు ఉచిత న్యాయ సేవలు అందించడానికి లోక్ అదాలత్‌లను నిర్వహించడానికి రాష్ట్ర న్యాయ సేవల అథారిటీని ఏర్పాటు చేశారు. రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీకి ప్రాటన్ ఇన్ చీఫ్‌గా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా హైకోర్టులో రెండో సీనియర్ న్యాయమూర్తి వ్యవహరిస్తారు. జిల్లా న్యాయ సేవల అథారిటీకి జిల్లా న్యాయమూర్తి అధ్యక్షత వహిస్తారు.
ఉచిత సేవలు ఎవరికి ?
ఎస్సీ, ఎస్టీలు, మానవ అక్రమ రవాణా బాధితులు, మహిళ లేదా చిన్నారులు, మానసిక రోగులు, దివ్యాంగులు, ప్రకృతి విపత్తులు, జాతి హింస, కుల హింస, వరదలు, కరువు, భూకంపాలు, పారిశ్రామిక విపత్తులు లాంటి వాటిలో అనుకోని పరిస్థితుల్లో బాధితులు, పరిశ్రమల్లో కార్మికులు, బాల నేరస్తులు, మానవ అక్రమరవాణా బాధితులుగా పోలీసు కస్టడీలో ఉన్నవారు.
అథారిటీ ఏం చేస్తుంది
ఉచిత న్యాయ సాయం, లోక్ అదాలత్‌ల నిర్వహణ, నల్సా పథకాల అమలు, బాధితులకు పరిహారం అందజేత, మీడియేషన్, ఉచితంగా న్యాయవాది ఏర్పాటు.
నల్సా కార్యాలయ అడ్రస్
» నల్సా, భారత సుప్రీంకోర్టు, తిలక్‌మార్గ్, న్యూఢిల్లీ – 110001
» హెల్ప్‌లైన్ నంబర్ 15100
» సిటిజన్ల కోసం నల్సా కేంద్రం
» జైసల్మేర్ హౌస్, 26 మాన్‌సింగ్ రోడ్, న్యూఢిల్లీ – 110011 (మరిన్ని వివరాలకు ‘టీఎస్‌ఎల్‌ఎస్‌ఏ.తెలంగాణ. జీవోవీ.ఇన్’ సంప్రదించవచ్చు)
రాష్ట్ర అథారిటీ పరిధిలోని మొత్తం ప్యానల్ లాయర్లు: 252
వీరిలో పురుషులు: 177, మహిళలు: 75
(వీరి కాల పరిమితి మూడేళ్లు)
2025, జనవరి నుంచి ఆగస్టు వరకు...
న్యాయసాయం పొందిన వారు: 1,027
ప్రజాసేవకే ‘అథారిటీ’
కక్షిదారులకు ఉచిత న్యాయసాయం, న్యాయ సలహాలతోపాటు మధ్యవర్తిత్వం ద్వారా అథారిటీ పరిష్కారం చూపిస్తుంది. నల్సా ద్వారా టీజీఎల్‌ఎస్‌ఏ అందించే ఈ–సేవలు, పథకాలను అర్హులైన ప్రజలందరూ సది్వనియోగం చేసుకోవాలి.
ప్రజల చెంతకే పలు పథకాలు చేరేలా వలంటీర్లు మీ వద్దకే వస్తున్నారు. మధ్యవర్తిత్వంతో న్యాయం సత్వరం దక్కుతుంది. ఆన్‌లైన్‌లోగానీ, ఆఫ్‌లైన్‌లోగానీ సేవలను తెలుసుకొని సాయం పొందొచ్చు. మీ కోసమే ‘అథారిటీ’అన్నది గుర్తుంచుకోండి. – టీజీఎల్‌ఎస్‌ఏ సభ్య కార్యదర్శి సీహెచ్. పంచాక్షరి


