ముగ్గురు మృతిచెందిన ఘటనలో ట్విస్ట్, ఇంటికి భోజనానికి పిలిచి.. | Three People Passed Away After Being Given Poison Incident Khammam District | Sakshi
Sakshi News home page

ముగ్గురు మృతిచెందిన ఘటనలో ట్విస్ట్, ఇంటికి భోజనానికి పిలిచి..

Aug 16 2021 4:29 AM | Updated on Aug 19 2021 10:34 AM

Three People Passed Away After Being Given Poison Incident Khammam District - Sakshi

తిరుమలాయపాలెం: భూతగాదా నేపథ్యంలో వింధుభోజనానికి ఆహ్వానించి మద్యంలో విషం కలిపి ముగ్గురిని దారుణంగా హత్య చేశారంటూ మృతుల బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు... ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం చంద్రుతండాకు చెందిన బలరాం, రాములు, టాక్రియా, లక్ష్మా అన్నదమ్ములు. చాలా ఏళ్ల నుంచి బలరాం, టాక్రియా కుటుంబాల మధ్య భూవివాదం ఉంది. బలరాం కుమారుడు భిక్షంకు అర్జున్, చిన్నా అనే ఇద్దరు కొడుకులున్నారు.

11 రోజుల క్రితం అర్జున్‌ అనారోగ్యంతో మృతిచెందాడు. వివాదాలతో చిన్నా వారిపై కక్ష పెంచుకున్నాడు. శనివారం అర్జున్‌ దశదిన కర్మ సందర్భంగా పెద్దనాన్న టాక్రియా కుమారులైన బోడా హరిదాసు, శంకర్, లక్ష్మా కుమారుడు బోడా మల్సూర్, భద్రులను కూడా పిలిచాడు. వారు రాత్రి భిక్షం ఇంటికి వెళ్లారు. హరిదాసు, భద్రు, మల్సూర్, శంకర్‌కు చిన్నా గ్లాసుల్లో మద్యాన్ని పోసి ఇచ్చాడు. అది తాగిన హరిదాసు, భద్రు నిమిషాల వ్యవధిలోనే సృహ కోల్పోయి కిందపడిపోయారు. ఆస్పత్రికి తరలిస్తుండగా హరిదాసు, భద్రు, మల్సూర్‌ ప్రాణాలొదిలారు. శంకర్‌ మద్యం తాగకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనతో చిన్నా, అతని తండ్రి భిక్షం పరారయ్యారు. మల్సూర్‌ కుమారుడు వెంకన్న ఫిర్యాదు మేరకు కూసుమంచి పోలీసులు బోడ చిన్నా, అతని తండ్రిపై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. 

పథకం ప్రకారమే హత్య 
నా భర్త హరిదాసు గొర్రెలు కాస్తుండేవాడు. ఎవరి జోలికీ వెళ్లేవాడు కాదు. నేను మా కూతురి ఇంటికి వెళ్లి వచ్చే సరికే నా భర్తకు చిన్నా విషం ఇచ్చి చంపాడు. భోజనానికి వెళ్లకపోయినా ఇంటిచుట్టూ తిరిగి మరీ తీసుకెళ్లి మట్టుబెట్టాడు.
– సుశీల, హరిదాసు భార్య  

ఇద్దరు పిల్లలతో నేనెలా బతకాలి 
కాయకష్టం చేసుకుని బతుకుతున్నాం. చిన్న పిల్లలు ఉన్నారు. అమాయకుడైన నా భర్తను పొట్టనపెట్టుకున్నారు. ఇప్పుడు నేను, నా పిల్లలు ఎలా బతకాలి. చిన్నా, భిక్షంను కఠినంగా శిక్షించి మాకు న్యాయం చేయాలి. 
– విజయ, భద్రు భార్య 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement