‘కొడుకా.. ఎంత పనాయె.. నీ పిల్లలకు దిక్కెవరు బిడ్డా’

Three Die Of Family In Road Accident Ramagundam - Sakshi

రోడ్డు ప్రమాదంలో నిరుపేద కుటుంబం బలి

బూడిద టిప్పర్‌ రూపంలో వెంటాడిన మృత్యువు

అనాథలైన అన్నాచెల్లెలు

కంటతడి పెట్టిన కాలనీవాసులు

సాక్షి,రామగుండం( కరీంనగర్‌): ‘కొడుకా.. ఎంత పనాయె.. ప్రమాదంలో నేను చనిపోయినా బాగుండేది.. ఇప్పుడు నీ పిల్లలకు దిక్కెవరు బిడ్డా.. ’ అంటూ వృద్ధాప్యంలో ఉన్న తండ్రి రోదన. అన్నా.. రోజు ఇద్దరం కలిసే పనికివెళ్లేవాళ్లం.. ఇప్పుడు నాకు తోడెవరు వస్తారు..’ అంటూ తమ్ముడి ఏడుపులు. ‘బిడ్డా.. అందరం సంతోషంగా ఉంటామని అనుకున్నం. ఇప్పుడు లోకాన్ని విడిచి వెళ్లావు.. ఇద్దరి పిల్లల బాగోగులు చూసుకునేదెవరు..’ అంటూ మృతురాలి తల్లిదండ్రులు కంటతడి. ఇది సోమవారం రాత్రి గంగానగర్‌ బ్రిడ్జి వద్ద బూడిద లారీ ఆటోపై బోల్తాపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోయిన వారి ఇంటి వద్ద పరిస్థితి.

ఏం జరిగిందో తెలియక.. కాలు ఎముక విరిగి మంచంపైనే బిక్కుబిక్కుమంటూ రోదిస్తున్న రెండేళ్ల చిన్నారి షాదియాను ఎలా ఓదార్చాలో అక్కడున్న వారితరం కాలేదు. బిక్కముఖంతో ఒకరు.. అతడి ఒడిలో కూర్చుని ఉన్న నాలుగేళ్ల షేక్‌ షాకీర్‌.. ఈ హృదయ విదారక ఘటన ముబారక్‌నగర్‌లో తీవ్ర విషాదాన్ని నింపింది. ముబారక్‌నగర్‌కు చెందిన షేక్‌ హుస్సేన్‌కు ముగ్గురు కుమారులు. రెండో కుమారుడు షేక్‌ షకీల్‌ రామగుండం రైల్వేస్టేషన్‌ ఏరియాలో ఓ వెల్డింగ్‌ షాపులో పనిచేస్తుండేవాడు. షకీల్‌కు భార్య రేష్మ, కుమారుడు షేక్‌ షాకీర్, కూతుళ్లు షాదియా, తరున్నుం ఫాతిమా సంతానం.

హుస్సేన్‌ సోదరి కూతురుకు వివాహం కాగా.. మంచిర్యాల జిల్లా ఇందారంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో రిసెప్షన్‌ జరుగుతోంది. ఆ కార్యక్రమానికి షేక్‌ షకీల్‌ భార్యాపిల్లలతోపాటు తండ్రి హుస్సేన్, సోదరుడు షేక్‌ తాజ్‌తో కలిసి ఆటోలో సోమవారం రాత్రి బయల్దేరారు. వీరి ఆటో గంగానగర్‌ వద్ద గల బ్రిడ్జి వద్దకు చేరుకోగానే.. బొగ్గు లోడ్‌తో వెళ్తున్న ఓ లారీని.. బూడిద లోడ్‌తో వస్తున్న మరో లారీ ఢీకొంది. అనంతరం బూడిద లోడ్‌తో వస్తున్న లారీ వీరి ఆటోపై పడింది. ఈ ఘటనలో షేక్‌ షకీల్‌ (28), ఆయన భార్య రేష్మ (22), కూతురు తరున్నుమ్‌ ఫాతిమా (ఏడు నెలలు) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.

షకీల్‌ తండ్రి షేక్‌ హుస్సేన్, సోదరుడు తాజ్, కుమారుడు షాకీర్, కూతురు సాదియా, ఆటో డ్రైవర్‌ రహీంబేగ్‌ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. మృతదేహాలను అదేరాత్రి గోదావరిఖనిలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. మంగళవారం ఉదయం పోస్టుమార్టం పూర్తిచేసి వారి బంధువులకు అప్పగించారు. మృతదేహాలను ఇంటికి తీసుకురావడంతో బంధువులు, కాలనీవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. షకీల్‌ మంచితనాన్ని తలచుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. కుటుంబానికి అన్నీతానై చూసుకుంటున్నాడని, ఇప్పుడు ఆ కుటుంబానికి దిక్కెవరని బంధువులు రోదించారు. 

ఆనందంగా బయల్దేరి.. 
వెల్డింగ్‌ పనిచేసే షకీల్‌ శుభకార్యానికి వెళ్లాలని సోమవారం మధ్యాహ్నం వరకు సంతోషంగా ఉ న్నాడని తోటికార్మికులు గుర్తు చేశారు. విధులు ముగించుకుని ఇంటికి చేరిన ఆయన.. సాయంత్రం తన ఇద్దరు పిల్లలకు హెయిర్‌ సెలూన్‌లో కటింగ్‌ చేయించాడని స్థానికులు తెలిపారు. ఎంతో ఆనందంగా కుటుంబసమేతంగా వివాహానికి బయలుదేరిన గంటలోపే మృత్యువాత పడడం ఆ కుటుంబానికి తీరని శోకం మిగిల్చింది. షకీల్‌ మంచితనం, ఓపిక, మర్యాదను గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. 

అనాథలైన చిన్నారులు
ప్రమాదంలో భార్యాభర్తలు షేక్‌ షకీల్, రేష్మ చనిపోవడంతో వారి కుమారుడు షాకీర్, కూతురు షాదియా అనాథలుగా మారారు. వారిని చూసిన ప్రతిఒక్కరూ కన్నీరు పెట్టుకున్నారు. దహనసంస్కారానికి ముబారక్‌నగర్‌కాలనీ వాసులు వందలాదిగా తరలివచ్చారు.

పరిహారం కోసం రాస్తారోకో
గోదావరిఖని: సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబానికి పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ వారి బంధువులు రాజీవ్‌రహదారిపై మృతదేహాలతో రాస్తారోకో చేశారు. ప్రమాదానికి కారణమైన లారీ యజమాని స్పందించకపోవడంతో మంచిర్యాలలో ఉంటున్న అతడి ఇంటికి వెళ్లేందుకు బయల్దేరారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో గంగానగర్‌ ఫ్లైౖఓవర్‌వద్ద ధర్నా చేపట్టారు. అయినా లారీ యజమాని అందుబాటులోకి రాలేదు. ఆందోళన తీవ్రం చేయడంతో రూ.2.5లక్షలు ఇచ్చేందుకు యజమానికి అంగీకరించడంతో శాంతించారు. పెద్దపల్లి డీసీపీ రవీందర్, గోదావరిఖని ఏసీపీ గిరిప్రసాద్, వన్‌టౌన్‌ సీఐ రమేష్‌బాబు, టూటౌన్‌ సీఐ శ్రీనివాస్‌రావు బందోబస్తు చేపట్టారు.

చదవండి: Covid Vaccine: వద్దన్నా వినలేదు.. బలవంతంగా వ్యాక్సిన్‌ వేశారు.. గంట తర్వాత..

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top