హోమ్ స్టే అందుబాటులోకి తెచ్చేందుకు పర్యాటక శాఖ చర్యలు
యజమానులు ఇళ్లలో అదనపు భాగాన్ని బసగా మార్చుకోవచ్చు
ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేస్తే అనుమతి
పర్యాటకుల నుంచి రోజువారీ అద్దెలు వసూలు చేసుకునే వెసులుబాటు
గోవా, కేరళ, ఈశాన్య రాష్ట్రాల్లో విస్తృతంగా ఉన్న హోమ్ స్టే విధానం
సాక్షి, హైదరాబాద్: పర్యాటకులు, ఇతర పనులపై రా ష్ట్రానికి వచ్చే వారికి ‘హోమ్ స్టే(homestays)’అందుబాటులో ఉండేలా పర్యాటక శాఖ చర్యలు ప్రారంభించింది. హోటళ్లలో ఉండటం ఖర్చుపరంగా భారంగా భావించేవారికి ఈ హోమ్ స్టే వెసులుబాటుగా ఉంటుంది. ప్రైవేట్ వ్యక్తులు తాము నివాసముండే ఇంటి ప్రాంగణంలోనే కొన్ని గదులను ఈ హోమ్ స్టే కోసం కేటాయించే విధానమే ఇది. పర్యాటకులకు ఆ గదులను కేటాయించటంతోపాటు, వారికి భోజన వసతి కల్పించటం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు. దీని వల్ల పర్యాటకులకు కూడా తక్కువ ధరకే నివాస వసతి అందుబాటులో ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వం ఇలాంటి హోమ్ స్టే కోసం ప్రత్యేకంగా కొన్ని పథకాలనే ఏర్పాటు చేసింది. కానీ, తెలంగాణలో ఈ పద్ధతి గతంలో ప్రతిపాదించినా, పెద్దగా స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో మరోసారి స్టే హోమ్స్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు పర్యాటక శాఖ ఏర్పాట్లు చేస్తోంది. స్టే హోమ్స్ కోసం గదులు అద్దెకివ్వాలనుకునేవారి నుంచి దరఖాస్తులు ఆహ్వనిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈశాన్య రాష్ట్రాలు, గోవా..వీటికే ఆదరణ ఎక్కువ
ఈశాన్య రాష్ట్రాలతోపాటు పర్యాటకులు అధికంగా వచ్చే గోవా, కేరళ లాంటి రాష్ట్రాల్లో స్టే హోమ్స్ విరివిగా అందుబాటులో ఉన్నాయి. పర్యాటకులు నాలుగైదు రోజులపాటు విడిది చేసి ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తుంటారు. అన్ని రోజులు హోటల్ గదుల్లో ఉండాలంటే భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. దీంతో స్టే హోమ్స్‌లో ఉండేందుకు ఆసక్తి చూపుతుంటారు. దీంతో స్థానికులు తమ ఇంటిలో అదనపు భాగాన్ని స్టే హోమ్స్‌గా మార్చి వారికి అద్దెకిస్తూ ఆదాయాన్ని పొందుతున్నారు. వెబ్‌సైట్‌లలో ఈ స్టే హోమ్స్ వివరాలు ఉంటాయి. దీంతో పర్యాటకులు సులభంగా వాటిని బుక్ చేసుకుంటున్నారు. పెద్ద నగరాల్లో హోటళ్లు విరివిగా ఉంటున్నా, చిన్నచిన్న పర్యాటక ప్రాంతాల్లో హోటళ్లు అంతగా అందుబాటులో ఉండటం లేదు. దీంతో ఆ ఊళ్లలోని చాలామంది గదులను స్టే హోమ్స్‌గా మార్చి అద్దెకిస్తున్నారు.
2016 మన దగ్గరా నోటిఫికేషన్ ఇచ్చినా...
2016లో ఈ విధానాన్ని తెలంగాణలో కూడా ప్రారంభిస్తూ నాటి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. కానీ, ప్రజల్లో దానిపై అవగాహన తెచ్చే కార్యక్రమాలు నిర్వహించలేదు. దీంతో కేవలం 12 మంది మాత్రమే దరఖాస్తు చేసుకొని స్టే హోమ్స్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం మళ్లీ ఆ విషయాన్ని పట్టించుకోకపోవటంతో స్టే హోమ్స్ కాన్సెప్ట్ అటకెక్కింది. ప్రస్తుతం హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని కొన్ని పట్టణాలకు పర్యాటకుల రాక పెరిగింది. పర్యాటకులతోపాటు హైదరాబాద్‌లో వైద్యం కోసం విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తున్నారు. వైద్యం కోసం వచ్చేవారు కొన్ని సందర్భాల్లో నెలల తరబడి స్థానకంగా ఉండాల్సి వస్తోంది. అలాంటి వారికి స్టేహోమ్స్ ఉపయుక్తంగా ఉంటాయి. వాటి కోసం ఆన్‌లైన్‌లో వెతుకుతున్నా... రాష్ట్రంలో అవి నామమాత్రమే కావటంతో వారికి నిరాశే ఎదురవుతోంది. దీంతో ఎక్కువ మొత్తం చెల్లిస్తూ హోటళ్లలోనే ఉంటున్నారు.
దరఖాస్తు చేయండి... రేటింగ్ ఆధారంగా అనుమతి
తాము ఉంటున్న నివాస ప్రాంగణంలో కనీసం ఒక గది, గరిష్టంగా ఐదు గదులు చొప్పున స్టేహోమ్ వసతి ఉన్నవారు అందుకు దరఖాస్తు చేయాలని తెలంగాణ పర్యాటక శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు ఆయా ఇళ్లకు వెళ్లి స్టే హోమ్‌కు కేటాయించిన గదులను పరిశీలించి, అనువుగా ఉంటే వాటికి సిల్వర్, గోల్డ్ పేరుతో రేటింగ్ ఇస్తారు. గోల్డ్ రేటింగ్‌కు రూ.4 వేలు, సిల్వర్ రేటింగ్‌కు రూ.2 వేలు చొప్పున డీడీ రూపంలో పర్యాటక శాఖకు ఫీజు చెల్లించాలి. అనుమతి పొందిన స్టే హోమ్స్ వివరాలను పర్యాటక శాఖ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తుంది. వాటి ఆధారంగా పర్యాటకులు స్టేహోమ్స్‌ను బుక్ చేసుకునే వీలుంటుంది. ఆయా ప్రాంతాల్లో ఉండే అద్దెల ఆధారంగా ఇంటి యజమానులు ఆ గదులకు అద్దెలు వసూలు చేసుకోవచ్చు. ఈ స్టేహోమ్స్‌కు పోలీసు శాఖ నుంచి అనుమతి రావాల్సి ఉంటుంది. అంటే ఆయా గదుల వివరాలను పోలీసు భద్రత పర్యవేక్షణలో ఉంటాయన్న మాట.
పర్యాటకుల భద్రత యజమానిదే
⇒ కనీసం ఒక గది, గరిష్టంగా ఐదు గదులు స్టేహోమ్‌కు కేటాయించాలి.
⇒ ఇంటి యజమాని అదే ప్రాంగణంలో నివాసం ఉండాలి
⇒ గెస్టులకు అక్కడే భోజన వసతి కల్పించాలి
⇒ గదుల్లో ఫరి్నచర్, బాత్‌రూమ్, టాయిలెట్, ఫ్యాన్లు కచ్చితంగా ఉండాలి
⇒ బస చేసేవారి భద్రత బాధ్యత పూర్తిగా యజమానిదే
⇒ స్టే హోమ్స్‌లో ఎక్కడా పర్యాటక శాఖ పేరు, లోగోను వినియోగించరాదు.
⇒ పర్యాటక శాఖ రూపొందించిన విధివిధానాల ప్రకారం అన్ని ఏర్పాట్లు ఉండాలి


