4 నెలలు.. రూ.900 కోట్ల నష్టం

Telangana RTC: 900 Crores Loss In 4 Months - Sakshi

తీవ్ర సంక్షోభంలో ఆర్టీసీ ∙కోవిడ్, పెరిగిన డీజిల్‌ ధరలతో కుదేలు

బయోడీజిల్‌ సరఫరా లేక చమురు ఖర్చులో ఆదా కూడా మాయం.. 

సాక్షి, హైదరాబాద్‌: కేవలం 4 నెలలు.. ఏకంగా రూ.900 కోట్ల నష్టాలు.. ఆర్టీసీ మరింత ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. రెండేళ్ల కింద కిలోమీటర్‌కు 20 పైసలు చొప్పున టికెట్‌ ధరలను ప్రభుత్వం పెంచటంతో ఒక్క సారిగా ఆర్టీసీ ఆదాయం పెరిగింది. రోజు వారీ ఆదాయం రూ.14 కోట్లకు చేరుకోవటంతో తక్కువ సమయంలోనే బ్రేక్‌ ఈవెన్‌కు చేరుకునే బాట పట్టింది. సరిగ్గా ఇదే సమయంలో కోవిడ్‌ దెబ్బ తీసింది. కోవిడ్‌తో దాదాపు ఏడాదిన్నరగా తీవ్ర ఒడిదుడుకుల్లో నడుస్తున్న ఆర్టీసీని పట్టపగ్గా ల్లేకుండా పెరుగుతూ వచ్చిన చమురు ధరలు మరింత దెబ్బకొట్టాయి. ఫలితంగా ఆర్టీసీ చరి త్రలో ఎన్నడూ లేనంతగా నష్టాలొచ్చాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి జూలై వరకు ఆర్టీసీకి రూ.900 కోట్లమేర నష్టాలు వచ్చినట్లు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సగటున నెలకు రూ.225 కోట్ల చొప్పున నష్టం వస్తోంది. గతంలో 2015–16లో రూ.1,150 కోట్లు, 2019–20లో రూ.1,002 కోట్ల నష్టం వాటిల్లగా, ఈసారి వాటికి రెట్టింపు మొత్తంలో నష్టం వచ్చే దిశగా ఆర్టీసీ సాగుతోంది. పరిస్థితి ఇలాగే ఉంటే ఆర్టీసీని నిర్వహించడం కూడా కష్టం కానుంది. వీలైనంత తొందరలో టికెట్‌ ధరలను పెంచి కొంతలో కొంతైనా ఆదుకోవాలని ఆర్టీసీ.. ప్రభుత్వాన్ని కోరుతోంది. 

డీజిల్‌ భారం రోజుకు రూ.2 కోట్లు..
దాదాపు ఏడాది క్రితంతో పోలిస్తే ఇప్పుడు డీజిల్‌పై రోజుకు రూ.2 కోట్ల అదనపు భారం పడుతోంది. వరసగా పెరుగుతూ వచ్చిన చమురు ధరలు ఆర్టీసీని కోలుకోనీయకుండా చేస్తున్నాయి. మూడునాలుగు నెలల క్రితం కిలోమీటరుకు రూ.14 చొప్పున చమురు ఖర్చు ఉండేది. ఇప్పుడది దాదాపు రూ.18కి చేరింది. ఇప్పట్లో చమురు ధరలు తగ్గే అవకాశం కనిపించకపోవటంతో ఆర్టీసీ సతమతమవుతోంది. చమురు భారం నుంచి బయటపడే మార్గం లేకపోవటంతో ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహిస్తూ కొంత ఖర్చును తగ్గించుకోవాల్సి ఉంది. గతంలో ఇదే ఉద్దేశంతో బయో డీజిల్‌ను ఆర్టీసీ వినియోగంలోకి తెచ్చింది. 10 శాతం మేర బయో డీజిల్‌ను కలిపి వాడేది. ఇది సాధారణ డీజిల్‌తో పోలిస్తే లీటరుకు రూ.5 నుంచి రూ.6 వరకు తక్కువ. అంతమేర ఖర్చు ఆదాయ అయ్యేది. అయితే బయో డీజిల్‌ సరఫరా చేసే సంస్థ దాన్ని సరిగా అందించడం లేదన్న ఉద్దేశంతో కొద్ది రోజుల క్రితమే ఆ ఒప్పందాన్ని ఆర్టీసీ రద్దు చేసుకుంది. ఫలితంగా ప్రత్యామ్నాయ ఇంధన వినియోగం రూపంలో వచ్చే ఆదా కూడా లేకుండా పోయింది. బయోడీజిల్‌ స్థానంలో ఇథెనాల్‌ను కూడా వినియోగించే అవకాశం ఉంది. అయిదే దీని వినియోగంపై ఆర్టీసీ ఇప్పటివరకు దృష్టి పెట్టలేదు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top