
2034–35 నాటికి 31,808 మెగావాట్లకు డిమాండ్
అందుకు తగినట్లుగా ఉత్పత్తికి ప్రణాళికలు వేయండి
క్లీన్ ఎనర్జీ, పంప్డ్ స్టోరేజీ, ఫ్లోటింగ్ సోలార్‌పై దృష్టి పెట్టాలి
ఓఆర్‌ఆర్ పొడవునా సోలార్ లైటింగ్ ఏర్పాటు చేయండి
సచివాలయం, నెక్లెస్‌రోడ్, కేబీఆర్ పార్క్‌లో స్మార్ట్ పోల్స్
విద్యుత్ శాఖపై సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఐటీ, పారిశ్రామిక అభివృద్ధితోపాటు గృహ, వ్యవసాయ విద్యుత్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో విద్యుత్‌కు ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టాలని ఇంధన శాఖ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్రానికి పెట్టుబడులు భారీగా తరలి వస్తున్నాయని, భవిష్యత్‌లో పారిశ్రామిక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు తయారు చేసుకోవాలని దిశా నిర్దేశం చేశారు. సీఎం శుక్రవారం తన నివాసంలో ఇంధన శాఖపై డిప్యూటీ సీఎం భట్టితో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, డేటా సెంటర్లు, ప్రజా రవాణా (మెట్రో, ఎలక్ట్రికల్ వెహికిల్స్) పెరుగుదలను దృష్టిలో పెట్టుకొని పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి పెంపుపై దృష్టి పెట్టాలని సూచించారు.
9.8 శాతం పెరిగిన విద్యుత్ డిమాండ్..
గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 9.8 శాతం పెరిగిందని సీఎం తెలిపారు. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో వినియోగం పెరగలేదని, అయినా అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్‌ను అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం
⇒ ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. ఈ ఏడాది అత్యధిక విద్యుత్ డిమాండ్ 17,162 మెగావాట్లకు చేరిందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరినాటికి అది 18,138 మెగావాట్లకు, 2034–35 నాటికి 31,808 మెగావాట్లకు పెరుగుతుందని అధికారులు సీఎంకు వివరించారు. దీంతో డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తిని పెంచుకోవాలని సీఎం సూచించారు. ప్రధానంగా క్లీన్ ఎనర్జీ, పంప్డ్ స్టోరేజీపై దృష్టి సారించాలని ఆదేశించారు. ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అన్ని అవకాశాలను
⇒ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కొత్తగా అమల్లోకి తెచి్చన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీపై దృష్టి సారించాలని చెప్పారు. విద్యుత్ ఉత్పత్తిలో దిగ్గజ సంస్థలకు రాష్ట్రంలో అవకాశం ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలో నిర్మించే నీటిపారుదల ప్రాజెక్టుల విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలని.. మెట్రో విస్తరణ, రైల్వే లైన్లు, ఇతర మాస్ ట్రాన్స్‌పోర్ట్‌లకు విద్యుత్ అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు ఇతర కార్పొరేషన్లు, కొత్తగా ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్లు, పారిశ్రామిక వాడలకు విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు.
హెచ్‌ఎండీఏతో సమన్వయం..
ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) నుంచి రీజనల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) వరకు రేడియల్ రోడ్లు, శాటిలైట్ టౌన్ షిప్‌లకు విద్యుత్ అవసరాలపై హెచ్‌ఎండీఏతో సమన్వయం చేసుకోవాలని విద్యుత్తు శాఖ అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. క్షేత్రస్థాయిలో డిమాండ్‌కు అనుగుణంగా సబ్ స్టేషన్లను అప్ గ్రేడ్ చేసుకోవాలని, విద్యుత్ లైన్ల ఆధునీకరణపై దృష్టి సారించాలని ఆదేశించారు. ఫ్యూచర్ సిటీలో పూర్తి భూగర్భ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలని కోరారు.
ఫ్యూచర్ సిటీలో విద్యుత్ టవర్లు, పోల్స్, లైన్లు బహిరంగంగా కనిపించడానికి వీల్లేదని, హై టెన్షన్ లైన్లను కూడా అక్కడి నుంచి తరలించాలని ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్మార్ట్ పోల్స్‌ను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయాలని సూచించారు. సచివాలయం, నెక్లెస్ రోడ్, కేబీఆర్ పార్కు వంటి ప్రాంతాల్లో ముందుగా వీటిని ఏర్పాటుచేయాలని ఆదేశించారు. 160 కిలోమీటర్ల ఓఆర్‌ఆర్ పొడవునా సోలార్ విద్యుత్ లైటింగ్‌ను ఏర్పాటుచేయాలని ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని పుట్‌పాత్‌లు, నాలాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు.