దేశాన్ని విచ్ఛిన్నం చేసే రాజకీయ శక్తులను అడ్డుకోవాలి

telangana pcc chief revanth reddy independence day - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బ్రిటిష్‌ పాలకులను తరిమికొట్టి ప్రజలకు స్వాతంత్య్రాన్ని సాధించి స్వేచ్ఛా వాయువులు అందించిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదేనని అయితే కొన్ని మతతత్వ శక్తులు దేశంలో చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు చూస్తున్నాయని, ఎన్నో త్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులను ప్రతీ ఒక్కరూ ప్రతిఘటించాలని టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్‌గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వాతంత్రోద్యమంలో వేలాదిమంది ప్రాణ త్యాగాలు చేశారని, లక్షలాదిమంది జైలు పాలయ్యారని, వారి త్యాగాల ఫలితంగానే నేడు స్వాతంత్య్రం సిద్ధించిందని వ్యాఖ్యానించారు.

స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా సోమవారం తన నివాసంలో జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. కరోనా కారణంగా గాంధీభవన్‌కు వెళ్లని ఆయన జూబ్లీహిల్స్‌లోని తన ఇంట్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడుతున్న వీడియోను విడుదల చేశారు. మతకల్లోలాలు, దేశ విభజన నేపథ్యంలో దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తొలి ప్రధానమంత్రి నెహ్రూ దూర దృష్టితో పనిచేశారని, అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగంతోనే 75 ఏళ్ల నుంచి దేశ ప్రజలు హక్కులు, బాధ్యతలతో స్వేచ్ఛగా జీవిస్తున్నారన్నారు. సోనియా, రాహుల్‌గాంధీల నాయకత్వంలో పటిష్టమైన పోరాటాలతో పనిచేయాలని, ప్రజాస్వామ్య, పార్లమెంటరీ వ్యవస్థల పతనాన్ని సంఘటితంగా అడ్డుకోవాలని కోరారు. 
చదవండి: ప్రశ్నిస్తే దాడులు చేయిస్తారా? నిరంకుశ పాలనను అంతం చేస్తాం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top