ప్రశ్నిస్తే దాడులు చేయిస్తారా? నిరంకుశ పాలనను అంతం చేస్తాం | Sakshi
Sakshi News home page

సీఎం కేసీఆర్‌కు మందు మీద తప్ప మందిపై ప్రేమలేదు

Published Tue, Aug 16 2022 3:24 AM

bjp bandi sanjay fire telangana cm kcr - Sakshi

సాక్షిప్రతినిధి, వరంగల్‌: ‘ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పోగాలం దాపురించింది. విసునూరు దొర రామచంద్రారెడ్డి వారసుడిలా వ్యవహరిస్తున్నారు. ఆయన కొడుకు కేటీఆర్‌ ట్విట్టర్‌ టిల్లు లా ఉన్నారు. ప్రజాసమస్యలపై పట్టింపు లేదు. సమస్యలపై ప్రశ్నిస్తే రైతులకు బేడీలు వేసి, జైలుకు పంపిస్తున్నారు. నిరుద్యోగులపై కేసులు పెడుతున్నారు. హత్యలు చేయించేందుకు వెనుకాడటం లేదు. ఆడబిడ్డలపై అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. అందుకే కేసీఆర్‌ నిరంకుశ పాలనను బొందపెట్టటానికే ఈ ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నాం’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ధ్వజమెత్తారు.

ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా సోమవారం ఆయన జనగామ జిల్లా దేవరుప్పుల నుంచి పాలకుర్తి వరకు 15.7 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. అంతకుముందు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కామారెడ్డిగూడెం ప్రశాంతి విద్యానికేతన్‌ హైస్కూల్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆయా ప్రాంతాల్లో ప్రసంగించారు.  టీఆర్‌ఎస్‌ గూండాలు దాడిచేసినా.. పోలీసులు సరిగా వ్యవహరించలేదని బండి సంజయ్‌ ఈ సందర్భంగా ఆరోపించారు. ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు శాంతియుతంగా యాత్ర చేస్తుంటే అడ్డుకుంటారా? అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు.  ముఖ్యమంత్రి, మంత్రులు ప్రజల మధ్య తిరిగి సమస్యలు తెలుసుకుంటే.. మేము ఎండనకా, వాననకా పాదయాత్ర ఎందుకు చేస్తాం? సీఎంకు దమ్ముంటే పాదయాత్ర చేసి జనంలోకి వెళ్లమనండి. నేను వెంటనే పాదయాత్రను ఆపేస్తా’అని సవాల్‌ విసిరారు.

కేసీఆర్‌ అరాచక పాలన సాగిస్తున్నారన్నారని, ఆయనకు మందు మీదున్నంత ప్రేమ మంది మీదలేదని దుయ్యబట్టారు. కాగా, బండి సంజయ్‌కుమార్‌ చేపట్టిన పాదయాత్ర మంగళవారంతో వెయ్యి కి.మీ. మైలురాయిని చేరుకోనుంది. పాలకుర్తి నియోజకవర్గంలోని ధర్మతండా సమీపంలో ఈ ఘనతను సాధించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
చదవండి: టీఆర్‌ఎస్‌, బీజేపీ శ్రేణుల మధ్య చెలరేగిన ఘర్షణ

Advertisement
Advertisement