ఎగిరిన రాళ్లు.. విరిగిన కర్రలు.. బండి సంజయ్‌ పాదయాత్రలో ఉద్రిక్తత | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌, బీజేపీ శ్రేణుల మధ్య చెలరేగిన ఘర్షణ.. నాలుగు గంటల పాటు ఉద్రిక్తత

Published Tue, Aug 16 2022 2:49 AM

clashes between trs and bjp workers jangaon - Sakshi

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ‘ప్రజాసంగ్రామ పాదయాత్ర’లో సోమవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాదయాత్ర జనగామ జిల్లా దేవరుప్పల మండల కేంద్రంలోకి ప్రవేశించడంతో స్థానిక బీజేపీ శ్రేణులు బాణసంచాలు కాలుస్తూ ఘనస్వాగతం పలికాయి. అక్కడ స్వరాజ్‌ ఫౌండేషన్‌ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో బండి సంజయ్‌ మాట్లాడారు. నాటి నిజాం సర్కారు, నేటి కేసీఆర్‌ పాలన తీరును ఎండగట్టారు. రెండువర్గాల వారు పరస్పరం తలపడ్డారు. కంకర రాళ్లు ఎగిరి పడగా, జెండా కర్రలు విరిగేలా కొట్టుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ దాడుల్లో టీఆర్‌ఎస్, బీజేపీలకు చెందిన వారితో పాటు సభకు వచ్చిన ఓ సాధారణ మహిళ సత్తెమ్మ.. మొత్తం తొమ్మిది మందికి గాయాలయ్యాయి. పోలీసులు వచ్చి లాఠీలకు పనిచెప్పారు.  ఈ సంఘటన దేవరుప్పుల చౌరస్తా వద్ద ఉద్రిక్తతకు దారితీసింది.  

డీజీపీకి సంజయ్‌ ఫోన్‌ 
ఈ సంఘటనపై బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలోనే ఫోన్‌ ద్వారా డీజీపీ మహేందర్‌రెడ్డితో మాట్లాడుతూ, వరంగల్‌ సీపీ.. మంత్రి దయాకర్‌రావుకు గుత్తేదారుగా తయారు కావడం వల్లే తమ యాత్రకు ఆటంకాలు ఏర్పడుతున్నా యని ఫిర్యాదు చేశారు.  

పోటాపోటీ ధర్నాలు 
అనంతరం బండి సంజయ్‌ యాత్ర దేవరుప్పుల నుంచి ధర్మాపురానికి బయలుదేరింది. యాత్ర వెళ్లాక తమ పార్టీ కార్యకర్తలను తీవ్రంగా గాయపర్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీఆర్‌ఎస్‌ శ్రేణులు పలువురు బీజేపీ నాయకుల కార్ల అద్దాలు పగులగొట్టారు. ఈ క్రమంలో బీజేపీ మహిళ మోర్చా మేడ్చల్‌ జిల్లా నాయకురాలు హైమారెడ్డి, సుధారాణి, సులోచనలు వాహనంలో వస్తుండగా టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అద్దాలు పగులగొట్టారు. దీనికి నిరసనగా సూర్యాపేట రహదారిపై నాలుగు గంటలపాటు ధర్నాకు దిగారు.  

500 మంది గూండాలతో యాత్ర: ఎర్రబెల్లి 
బండి సంజయ్‌ 500 మంది గూండాలతో యాత్ర చేస్తూ, ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా, రాళ్లు, కర్రలతో దాడి చేయిస్తున్నారని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మండిపడ్డారు. దేవరుప్పులలో గాయపడిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు జనగామ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా మంత్రి.. నాయకులతో కలిసి పరామర్శించారు.
చదవండి: సంక్షేమ తెలంగాణం.. ఎన్నో పథకాల్లో దేశానికే ఆదర్శం

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement