తెలంగాణ 10 రోజులు లాక్‌డౌన్‌.. మినహాయింపు వాటికే!

Telangana Lockdown From Today: Whats Open, Whats Not List Here - Sakshi

ఉదయం 6–10 గంటల వరకు అన్నింటికీ అనుమతి 

ఉదయం10 నుంచి మరుసటి రోజు ఉ. 6 వరకు లాక్‌డౌన్‌

మంత్రి కేటీఆర్‌ అధ్యక్షతన రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్స్‌

వ్యాక్సిన్‌ కొనుగోలు కోసం గ్లోబల్‌ టెండర్లు

వైద్యం, విద్యుత్, పారిశుధ్యం, నీటిసరఫరా, పెట్రోల్‌బంకులకు మినహాయింపు.. రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టుల ఏర్పాటు 

సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన కేబినెట్‌ సమావేశం

20న సమీక్షించి... లాక్‌డౌన్‌ కొనసాగింపుపై నిర్ణయం

పెళ్లిళ్లకు 40, అంత్యక్రియలకు 20 మందికి అనుమతి

ప్రభుత్వ ఆఫీసుల్లో 33% సిబ్బందితో పనిచేయడానికి అనుమతి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా ఉధృతి దృష్ట్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహమ్మారిని కట్టడి చేసేందుకు బుధవారం నుంచి 10 రోజులపాటు (మే 12 నుంచి 21 వరకు) లాక్‌డౌన్‌ విధించాలని నిర్ణయించింది. మంగళ వారం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ప్రగతిభవన్‌లో జరిగిన మంత్రిమండలి సమావేశం ఈమేరకు పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. లాక్‌డౌన్‌ సమయంలో ప్రజాజీవనం స్తంభించకుండా ఉదయం 6 నుంచి 10 గంటల వరకు అంటే నాలుగు గంటలపాటు కార్యకలాపాలకు అనుమతినిచ్చింది. ఈ సమయంలో నిత్యావసరాల కొనుగోలు, ఇతర వస్తువుల కొనుగోలు చేసేందుకు వెసులుబాటు కల్పించింది. ప్రతీరోజు 20 గంటలపాటు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని, అందుకోసం అన్ని ఏర్పాట్లు తక్షణమే చేయాలని సంబంధిత అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది.

కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించిన మంత్రివర్గం మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అధ్యక్షతన టాస్క్‌ఫోర్స్‌ కమిటీని నియమించింది. రాష్ట్రంలో కోవిడ్‌ కట్టడికి అవసరమైన మందులు, ఆక్సిజన్, రెమిడిసివర్, వ్యాక్సిన్‌లు సమకూర్చుకోవడంపై టాస్క్‌ఫోర్స్‌ దృష్టి పెట్టాలంది. సమావేశం ప్రారంభం కాగానే.. సీఎం కేసీఆర్‌ కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు, లాక్‌డౌన్‌ విధింపు అంశాన్ని ప్రస్తావించగానే కేబినెట్‌ ఆమోదించింది. ప్రజా జీవనం పూర్తిగా స్తంభించకుండా ఉండేందుకు మంత్రివర్గం పలు రంగాలకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపులు కూడా ఇచ్చింది.

ఈనెల 20న మళ్లీ భేటీ: లాక్‌డౌన్‌ ఈనెల 21వ తేదీ వరకు కొనసాగునున్న నేపథ్యంలో.. మంత్రివర్గం ఈనెల 20న మరోసారి సమావేశమై లాక్‌డౌన్‌ అనంతర పరిస్థితిని సమీక్షించి అవసరమైతే పొడిగింపు లేదా ఎత్తివేయాలా అన్న అంశంపై నిర్ణయం తీసుకోనుంది. కరోనా కేసులు పెరుగుతుండటం, పొరుగు రాష్ట్రాల నుంచి కోవిడ్‌ పేషెంట్లు వైద్యం కోసం రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో.. రాజధాని నగరంలో బెడ్స్‌కు కొరత ఏర్పడుతున్న వేళ లాక్‌డౌన్‌ అమలు చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. కోవిడ్‌ నిబంధనలను అనుసరించి కఠినంగా అమలుపరిచేలా చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది. రెమిడెసివర్‌ ఉత్పత్తిదారులతో కేబినెట్‌ సమావేశం నుంచే ముఖ్యమంత్రి ఫోన్లో మాట్లాడి రాష్ట్రానికి తగినన్ని మందులు సరఫరా చేయాలని కోరారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 15 నుంచి లాక్‌డౌన్‌ అమలు చేయాలని మొదట్లో భావించినా బుధవారం నుంచే అమల్లోకి తేవడం గమనార్హం. 

మంత్రివర్గం తీసుకున్న కీలక నిర్ణయాలు
–రాష్ట్రంలో టీకా కొరత నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన టీకా కొనుగోలు కోసం గ్లోబల్‌ టెండర్లు పిలవాలి.
–ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు ప్రైవేట్‌లోనూ రెమిడిసివిర్‌ ఇంజెక్షన్లు, ఆక్సిజన్, ఇతర కరోనా మందులను అందుబాటులోకి తేవాలని, వీటి కొరత రాకుండా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌కు ఆదేశం. 
–అన్ని జిల్లాల్లో మంత్రుల అధ్యక్షతన కలెక్టర్, డీఎంహెచ్‌ఓ, జిల్లా కేంద్రంలోని దవాఖానా సూపరింటెండెంట్, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లతో కమిటీ వేయాలి. 
–ప్రతిరోజూ ఆయా జిల్లాల మంత్రులు వారి వారి జిల్లా కేంద్రాల్లో కరోనాపై సమీక్ష చేయాలి.
–రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నిఘాపెట్టాలి.

కేటీఆర్‌ అధ్యక్షతన టాస్క్‌ఫోర్స్‌ కమిటీ
–మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అధ్యక్షతన రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్స్‌ కమిటీని మంత్రివర్గం ఏర్పాటు చేసింది. ఈ టాస్క్‌ఫోర్స్‌ ఏ రోజుకారోజు మందులు, టీకాలను త్వరితగతిన సమకూర్చి, సరఫరా చేయడంపై దృష్టిపెడుతుంది. ఈ టాస్క్‌ఫోర్స్‌లో పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్, జీఏడీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ వికాస్‌ రాజ్, పంచాయతీరాజ్‌ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, సీఎంఓ నుండి సీఎం కార్యదర్శి, కోవిడ్‌ ప్రత్యేకాధికారి రాజశేఖర్‌ రెడ్డి సభ్యులుగా ఉంటారు. 

లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఉన్నవి:
–అత్యవసర వైద్యం కోసం వెళ్తున్న బాధితులు, వైద్యరంగంలో పనిచేసే వారి వాహనాలకు అనుమతి.
–నిత్యావసర వస్తువుల పాలు, కూరగాయలు, ఆహార సామగ్రి, డెయిరీ ప్రొడక్ట్స్‌ రవాణాకు అనుమతి.
–రాష్ట్ర సరిహద్దుల వద్ద ప్రయాణికుల వాహనాలు క్రమబద్ధీకరిస్తారు. నిత్యావసర వస్తువులవాహనాలకు ఎలాంటి అంక్షలు ఉండవు.
–వైద్య రంగంలో ఫార్మాసూటికల్‌ కంపెనీలు, వైద్య పరికరాల తయారీ కంపెనీలు, మెడికల్‌ డిస్ట్రిబ్యూటర్లు, మెడికల్‌ షాపులు, అన్నిరకాల వైద్య సేవలు, ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలు, వాటి సిబ్బందికి ప్రత్యేక పాసులిచ్చి, వారి వాహనాలకు అనుమతిస్తారు.
–తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసం యథావిధిగా కొనసాగనున్న ధాన్యం కొనుగోళ్లు.
–వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించిన పనులు, అనుబంధ రంగాలు, సాగుయంత్రాల పనులు, రైస్‌ మిల్లుల నిర్వహణ, సంబంధిత రవాణా, ఎఫ్‌సీఐకి ధాన్యం పంపడం, ఫెర్టిలైజర్, సీడ్‌ షాపులు, విత్తన తయారీ కర్మాగారాలు.
–గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ యథావిధిగా సాగుతుంది. 
–విద్యుదుత్పత్తి, పంపిణీ వ్యవస్థలు, వాటి అనుబంధ కార్యకలాపాలు పనిచేస్తాయి. 
–జాతీయ రహదారులపై రవాణా యథావిధిగా కొనసాగుతుంది. జాతీయ రహదారులపై పెట్రోల్, డీజిల్‌ పంపులు నిరంతరం తెరిచే ఉంటాయి. 
–కోల్డ్‌ స్టోరేజీ, వేర్‌ హౌసింగ్‌ కార్యకలాపాలు
–ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా
–ఉపాధిహామీ పనులు
–ప్రభుత్వ కార్యాలయాలు 33శాతం సిబ్బందితో పనిచేస్తాయి.
–గత లాక్‌డౌన్‌లో మాదిరిగానే బ్యాంకులు, ఏటీఎంలు యథావిధిగా పనిచేస్తాయి. 
–వంట గ్యాస్‌ సరఫరా యథావిధిగా కొనసాగుతుంది. 
–ముందస్తు అనుమతులతో జరిపే పెళ్లిళ్లకు గరిష్టంగా 40 మందికి మాత్రమే అనుమతి. మాస్క్‌లు, భౌతికదూరం పాటించాలి. 
–అంత్యక్రియలకు గరిష్టంగా 20 మందికి మాత్రమే అనుమతి.
–ఉదయం 6 నుంచి 10 గంటల వరకు అన్నిరకాల మెట్రో, ఆర్టీసీ ప్రజా రవాణా అందుబాటులో ఉంటుంది. 
–ఉదయం 6 నుంచి 10 గంటల వరకు రేషన్‌ షాపులు తెరిచే ఉంటాయి. 
–సెక్యూరిటీ సర్వీసెస్‌.. ప్రైవేట్‌ రంగంలోని వారికి కూడా..
–ఈ కామర్స్‌ సంస్థల తినుబండారాలు, ఫార్మాస్యూటికల్స్, మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌ పంపిణీకి అనుమతి.
–ఐటీ, ఐటీయేతర సర్వీసులు, టెలికాం, పోస్టల్, ఇంటర్నెట్‌ సర్వీసెస్‌కు అనుమతి. అయితే ఈ రంగాల్లో పనిచేసే వారికి వర్క్‌ ఫ్రం హోం సౌకర్యం కల్పించడం మంచిది.
–అన్ని రకాల నిర్మాణాలు, ప్రాజెక్టు కార్యకలాపాల్లో పనిచేసే ప్రాంతంలోనే లేబర్స్‌ రక్షిత ప్రాంతాల్లో ఉంటూ పనులు చేసుకోవడానికి అనుమతి.

వీటికి మినహాయింపు లేదు..
–సినిమాహాళ్లు, క్లబ్బులు, జిమ్‌లు, స్విమ్మింగ్‌ పూల్స్, అమ్యూజ్‌మెంట్‌ పార్కులు, క్రీడా మైదానాలు
–అన్ని మతపరమైన ప్రార్థనా కేంద్రాలు, మందిరాలు, మత పరమైన కార్యక్రమాల జన సమూహాలను నిషేధం.
–అంతరాష్ట్ర బస్సులు, ప్రైవేట్‌ వాహనాలను అనుమతించరు.

అవీ.. ఇవీ..
–హోం ఐసోలేషన్‌లో ఉండాల్సిన బాధితులు బయట తిరగరాదు. ఒకవేళ బయటకు వేస్తే..వారిపై చర్య తీసుకోవడంతోపాటు, ప్రభుత్వ ఐసోలేషన్‌ కేంద్రానికి తరలిస్తారు.
–ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల్లో పనిచేసే పర్మినెంట్, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు పూర్తిస్థాయి వేతనాలు చెల్లించాలి. ఉల్లంఘిస్తే.. సంబంధిత చట్టాల ప్రకారం చర్య తీసుకుంటారు.
–అన్ని అంగన్‌వాడీ కేంద్రాలు పూర్తిగా మూసివేత. పౌష్టికాహారం తీసుకుంటున్న తల్లులు, గర్భిణీలు, పిల్లలకు ఇంటికి రేషన్‌ను తీసుకెళ్లాలి.
–ఈ లాక్‌డౌన్‌ సమయంలో ప్రసవించడానికి  ఉన్న గర్భిణీల లిస్టు రూపొందించి, పర్యవేక్షించడం, ఆసుపప్రతుల్లో ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకుంటారు. 

ప్రభుత్వ సంస్థలు/ఆఫీసులు
వైద్యారోగ్య కుటుంబ సంక్షేమం, పోలీసు, స్థానిక సంస్థలు, అగ్నిమాపక విభాగం, విద్యుత్, నీటి సరఫరా, పన్నులు వసూలు చేసే ప్రభుత్వ కార్యాలయాలు, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, రవాణా, వ్యవసాయం, ఉద్యానవన అనుబంధ విభాగాలు, పౌరసరఫరాల శాఖ, కోవిడ్‌ కోసం నియమితులైన సిబ్బందితోపాటు ఇతర ప్రభుత్వ విభాగాల్లో 33 శాతం ఉద్యోగుల హాజరుతో రోస్టర్‌ విధానంలో విధులకు హాజరు కావాలి.

వ్యవసాయ శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో కమిటీ
నిత్యావసర వస్తువుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటానికి వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి అధికారులతో కమిటీ ఏర్పాటుచేశారు. ఇందులో పౌరసరఫరాల కమిషనర్, కమిషనర్‌ ట్రాన్స్‌పోర్టు, వరంగల్, హైదరాబాద్‌ రీజియన్‌ల పోలీసు ఐజీలు, డ్రగ్‌ కంట్రోల్‌ డైరెక్టర్, ఉద్యానవన విభాగం డైరెక్టర్, మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్, డెయిరీ డెవలప్‌మెంట్‌ కోఆపరేషన్‌ ఫెడరేషన్‌ ఎండీ, లీగల్‌ మెట్రాలజీ కంట్రోలర్‌ సభ్యులుగా ఉంటారు. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top