ఎస్సారెస్పీలో పారాల్సింది నీరా.. నెత్తురా? ఈ సమయంలో గుజరాత్‌ గజదొంగలు వచ్చి..

Telangana: Kcr Fires Bjp Ruling On Meeting In Peddapalli - Sakshi

మతోన్మాదుల మాటలు విని మోసపోతే గోసపడతాం.. 

ఆత్మగౌరవంతో ఉందాం.. ఢిల్లీ ఏజెంట్లకు గులాములం కావొద్దు 

గుజరాత్‌ గజదొంగలు వస్తున్నారు..

సంక్షేమ పథకాలు, రైతులకు ఉచిత విద్యుత్‌ బంద్‌ పెడతారు.. సింగరేణి గనులను కూడా మోదీ దోస్తులకు కట్టబెట్టే కుట్ర 

రాష్ట్రంలో గుజరాత్‌ దోపిడీగాళ్ల బూట్లు మోసే సన్నాసులు కనబడుతున్నారు 

తాను జాతీయ రాజకీయాల్లోకి రావాలని దేశ రైతులు కోరుతున్నారని వెల్లడి

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: ‘‘మోసపోతే.. గోసపడతాం. మనం బాగుపడే సమయంలో గుజరాత్‌ గజదొంగలు వచ్చి మతం పేరు మీద కొట్లాడాలని రెచ్చగొడుతున్నారు. శ్రీరాంసాగర్‌ కాలువల్లో స్వచ్ఛమైన నీరు పారాలా? మతకలహాల మంటలు చెలరేగి నెత్తురు పారాలా? ఆత్మగౌరవంతో ఉందాం. ఢిల్లీ ఏజెంట్లకు గులాములం కావొద్దు..’’ అని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. సోమవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గౌరెడ్డిపేటలో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని, పెద్దకల్వలలో నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని ఆయన ప్రారంభించారు. తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్‌ ప్రసంగిస్తూ.. బీజేపీ, కేంద్రం తీరుపై నిప్పులు చెరిగారు. ప్రసంగంలోని కీలక అంశాలు ఆయన మాటల్లోనే.. 

కేంద్రం ప్రజల ఉసురుపోసుకుంటోంది 
‘‘గుజరాత్‌ మోడల్‌ అని చెప్పి దేశప్రజలను దగా చేసి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఈ రోజు ఏం చేస్తోంది? అడ్డగోలుగా ధరలు పెంచడం, గ్యాస్, డీజిల్, పెట్రోల్‌ ధరలు పెంచడం, శ్మశానాల మీద పన్ను, శవాల దహనాలకు పన్ను, పాల మీద, చేనేత ఉత్పత్తుల మీద జీఎస్టీ విధిస్తూ పేద ప్రజల ఉసురు పోసుకుంటోంది. ఎన్‌పీఏల పేరిట లక్షల కోట్ల ప్రజాధనాన్ని కుంభకోణాల రూపంలో మేస్తున్న బీజేపీ అవినీతి గద్దలు దేశాన్ని మోసం చేస్తున్నాయి. గాంధీ పుట్టిన రాష్ట్రమైన గుజరాత్‌లో మద్యపాన నిషేధం చేశామని ప్రధాని గొప్పలు చెప్పుకునే చోట కల్తీ మద్యం ఏరులై పారుతోంది.

అది తాగి దాదాపు 75 మంది మరణించారు. దీనికి మోదీ సమాధానం చెప్పాలి. తెలంగాణలో ఉన్న మంచి పథకాల్లో ఒక్కటి కూడా ప్రధాని రాష్ట్రమైన గుజరాత్‌లో లేదు. 24 గంటల కరెంటు, రూ.2,000 పింఛన్, పేదలకు ఆరోగ్యశ్రీ వంటి పథకాలేమీ లేవు. కానీ అక్కడి నుంచి వచ్చే గులాంగాళ్లు, దేశాన్ని దోచే దోపిడీ దొంగలు.. ఆ దొంగల బూట్లు మోసే సన్నాసులు మనకు కనబడుతున్నారు. 60 ఏళ్లు కొట్లాడి సాధించిన తెలంగాణలో ఆత్మగౌరవంతో ఉందామా? లేక ఢిల్లీ నుంచి వచ్చే ఏజెంట్లకు గులాములం అవుదామా? ప్రజలు ఆలోచించుకోవాలి. 

తెలివి తక్కువ ప్రధాని.. 
ప్రధానికి తెలివితేటల్లేవు. ధాన్యం కొనుగోలు చేయాలంటే ఎక్కడ పెట్టుకోవాలంటూ మాట్లాడుతారు. ఈ రోజు అంతర్జాతీయ మార్కెట్లో బియ్యం, నూకలు, గోధుమలకు కొరత ఉంది. కానీ తెలివితక్కువ కేంద్ర ప్రభుత్వం కారణంగా గోధుమలు, బియ్యం కూడా దిగుమతి చేసుకునే దుస్థితి ఏర్పడింది. ముందుచూపు లేక, పాలన చేతగాక, పిచ్చిపిచ్చి విధానాలతో ఆర్థిక స్థితి దిగజార్చి, రూపాయి విలువ పతనం చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో దేశప్రతిష్టను దిగజార్చి, పేద కడగండ్లను కళ్లజూస్తున్న ఈ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోందో ఆలోచించాలి. 

మోసపోతే.. గోసపడతాం.. 
మనం ఒకసారి దెబ్బతింటే వెనుకపడతాం. మీ బిడ్డగా నేను ఒకటే వేడుకుంటున్నా. కూలగొట్టుడు చాలా సులువైన పని. కట్టడం చాలా కష్టమైన పని. ఇవాళ మనం బాగుపడే సమయంలో ఈ దుర్మార్గులు, గజదొంగలు, లంచగొండులు వచ్చి.. మతం పేరు మీద కొట్లాడాలని ఎలా చెబుతారు? శ్రీరాంసాగర్‌ కాలువల్లో స్వచ్ఛమైన నీరు పారాలా? మత కలహాల మంటలు చెలరేగి నెత్తురు పారాలా? ప్రజల మధ్య విద్వేషాన్ని పెంచే ఈ పిశాచులకు ఎక్కడిక్కకడ బుద్ధి చెప్పాలి. ఈ దొంగల మాటలు నమ్మితే చాలా ప్రమాదం ఉంటుంది. 

కేంద్రంలో రాబోయేది రైతు సర్కారే.. 
రాష్ట్రంలో రైతులకు మేలు చేస్తుంటే.. రైతు కూలీలకు పింఛన్‌ ఇస్తుంటే.. కేంద్రం ఉచితాలని బంద్‌ పెట్టాలని అంటోంది. రైతులకు ఉచిత కరెంటు ఇస్తుంటే.. మీటర్లు పెట్టాలంటోంది. ఎందుకు పెట్టాలి మీటర్లు? గోల్‌మాల్‌ ప్రధాన మంత్రి, కేంద్రం చెప్పేవన్నీ అబద్ధాలే. దేశంలోని రైతులు, ఇరిగేషన్‌ ప్రాజెక్టులు అన్నీ కలిపి వ్యవసాయానికి వినియోగించే విద్యుత్తు 20.8 శాతమే. దాని ఖర్చు రూ.1.45 లక్షల కోట్లే. ఒక కార్పొరేట్‌ దొంగకు దోచిపెట్టినంత కాదు కదా! ఈ విషయంలో ఎందుకు రైతుల ఉసురు పోసుకోవాలి? మీటర్లు లేని విద్యుత్తు కోసం పోరాడాలని రైతులంతా నన్ను ఆహ్వానించారు. రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలన్న నరేంద్ర మోదీకే మనమంతా మీటర్లు పెట్టాలి. అలా చేస్తే పీడ పోతుంది. మోదీ శ్రీలంకకు పోయి తన దోస్తులు, షావుకార్లకు బిజినెస్‌ ఇప్పించాడు. దీంతో అక్కడి ప్రజలు నరేంద్ర మోదీ గోబ్యాక్, ఇండియా పీఎం గోబ్యాక్‌ అని నినదించారు. ‘తలాపున పారుతోంది గోదారి.. నా చేను, నా చెలక ఎడారి’ అని కవి సదాశివ పాట రాసిన చైతన్యమున్న గడ్డ పెద్దపల్లి జిల్లా. కానీ ఇప్పుడు కేంద్రం ఇక్కడి సింగరేణి గనులను కూడా షావుకార్లకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోంది’’ అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. 
 
జాతీయ రాజకీయాల్లోకి వెళ్దామా..? 
‘‘నన్ను కలిసేందుకు 26 రాష్ట్రాల నుంచి దాదాపు 100 మంది రైతు నాయకులు వచ్చారు. ఇక్కడ అమలవుతున్న పథకాలు తమ వద్ద లేవని చెప్పారను. నన్ను జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించారు. మరి పోదామా జాతీయ రాజకీయాల్లోకి?..’’ అని సభికులను ఉద్దేశించి కేసీఆర్‌ ప్రశ్నించగా..‘వెళదాం.. వెళదాం’ అంటూ ప్రజల నుంచి స్పందన వ్యక్తమైంది. 
 
మున్సిపాలిటీలకు రూ.కోటి.. గ్రామాలకు రూ.10లక్షలు 
రాష్ట్రంలో మహిళలు, రైతులు, పేదలు కలలో కూడా ఊహించని అనేక మంచి కార్యక్రమాలతో ముందుకు పోతున్నామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. పెద్దపల్లి జిల్లాలోని రామగుండం కార్పొరేషన్‌తోపాటు మున్సిపాలిటీలకు రూ.కోటి చొప్పున.. గ్రామాలకు రూ.10 లక్షల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. కేసీఆర్‌ ప్రసంగం ప్రారంభమైన కాసేపటికి వాన మొదలవడంతో త్వరగా ముగించారు. కాగా.. సభలో తనకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ రాలేదంటూ ఇల్లందకుంటకు చెందిన పెరుమాండ్ల రమేశ్‌ అనే వ్యక్తి కిరోసిన్‌ పోసుకోగా.. పోలీసులు నిలువరించి రక్షించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top