20లోగా ఇంటర్‌ ఫలితాలు.. నెలాఖరుకు టెన్త్‌ ఫలితాలు కూడా..!

Telangana Inter Results Will Release By June 20 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో టెన్త్, ఇంటర్‌ జవాబు పత్రాల మూల్యాంకనం వేగంగా సాగుతోంది. ఇంటర్‌ స్పాట్‌ వ్యాల్యుయేషన్‌ దాదాపు పూర్తయినట్టేనని అధికార వర్గాలు అంటున్నాయి. దీంతో ఈ నెల 20లోగా ఇంటర్‌ ఫలితాలు వెల్లడించాలని ఇంటర్‌ బోర్డ్‌ కృత నిశ్చయంతో ఉంది. ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జూలై మొదటి వారంలో నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. మరోవైపు ఈ నెల 11 నాటికి టెన్త్‌ మూల్యాంకన ప్రక్రియ పూర్తవుతుందని తెలిసింది. ఈ నేపథ్యంలో టెన్త్‌ ఫలితాలను ఈ నెల 30లోగా వెల్లడిస్తామని ఎస్సెస్సీ బోర్డ్‌ అధికారులు స్పష్టం చేశారు. కరోనాతో గత రెండేళ్లుగా విద్యా సంవత్సరంలో ఒడిదొడుకులు చోటుచేసుకున్నాయి.

టెన్త్, ఇంటర్‌ పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్‌ చేశారు. రెండేళ్ల తర్వాత టెన్త్‌ పరీక్షలు జరగడంతో ఈసారి 11 ప్రశ్నపత్రాలకు బదులు 6 మాత్రమే ఇచ్చారు. పరీక్షల సమయాన్ని పెంచారు. ఇంటర్, టెన్త్‌కు 70 శాతం సిలబస్‌ మాత్రమే ఇచ్చారు. దీంతో ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కరోనా వ్యాప్తి తగ్గడంతో ఈసారి విద్యాసంవత్సరం సాధారణ సమయాల్లోనే చేపట్టాలని భావిస్తున్నారు.    
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top