
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీ జరిగింది. ఆరుగురు ఐఏఎస్, 23 మంది ఐపీఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్ బత్తుల శివధర్‌రెడ్డిని తెలంగాణ డీజీపీగా ఇప్పటికే నియమించిన సంగతి తెలిసిందే.
ఇక భారీ బదిలీల్లో భాగంగా.. ఆర్టీసీ ఎండీగా ఉన్న వీసీ సజ్జనార్‌ను హైదరాబాద్ నగర కమిషనర్‌గా నియమించింది. రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గత కొంతకాలంగా వివాదాల్లో చిక్కుకున్నారు. చట్టవిరుద్ధమైన చర్యలు, కోర్టు ఆదేశాల ఉల్లంఘన, వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం.. లాంటి అంశాలతో హైకోర్టు సైతం మొన్నీమధ్యే ఆయనపై ఆగ్రం వ్యక్తం చేసింది. దీంతో ప్రభుత్వం ఆయన్ని తప్పించింది. ఆ స్థానంలో హరితను కలెక్టర్‌గా నియమించింది. స్పెషల్ సెక్రటరీగా సందీపకుమార్ ఝాకు బాధ్యతలు అప్పగించింది.
హైదరాబాద్ సీపీగా ఉన్న సీవీ ఆనంద్‌ను.. హోంశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీగా నియమించింది. ఇంటలిజెన్స్ డీజీగా విజయ్‌కుమార్‌ను, ఆర్టీసీ ఎండీగా నాగిరెడ్డి, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌గా శిఖా గోయల్, ఫైర్ వింగ్ డీజీగా విక్రమ్ సింగ్ మాన్, సీఐడీ చీఫ్‌గా వీవీ శ్రీనివాసరావు, పౌరసరఫరాల కమిషనర్‌గా స్టీఫెన్ రవీంద్ర నియమితులయ్యారు. ఏసీబీ డీజీగా అదనపు బాధ్యతలు చారుసిన్హాకు అప్పగించారు.
