ఆరుశాతం చెల్లించండి.. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం 

Telangana High Court Orders On Covid Time Employees Salaries - Sakshi

కోవిడ్‌ సమయంలో ఆపిన ఉద్యోగుల వేతనాలు, విశ్రాంత ఉద్యోగుల పింఛన్ల బకాయిలపై 6 శాతం వడ్డీ చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకున్న ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. లాక్‌డౌన్‌ కాలం కొనసాగే వరకు 50 శాతం వేతనం, పింఛన్లలో కోత విధిస్తూ 2020, మార్చి 30న రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్‌ 27ను తీసుకొచ్చింది. తర్వాత దీనిపై ఆర్డినెన్స్‌ కూడా తెచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ తెలంగాణ హైకోర్టు విశ్రాంత అధికారులు, ఉద్యోగుల సంక్షేమ సంఘం నేతలు, తెలంగాణ పింఛనర్ల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ప్రతినిధులతో పాటు మరికొందరు రిట్‌ పిటిషన్లు, ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. అలాగే హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది సత్యంరెడ్డి రాసిన లేఖను హైకోర్టు పిల్‌గా స్వీకరించింది. వీటన్నింటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్, జస్టిస్‌ తుకారాంజీ ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది చిక్కుడు చైతన్య మిత్ర వాదనలు వినిపించారు. కోవిడ్‌ సమయంలో ఉద్యోగుల వేతనాలతో పాటు పింఛన్లు కూడా ఆపారన్నారు. 

మూడు నెలలు ఇబ్బందులు పడ్డారు.. 
మూడు నెలలపాటు 50 శాతం వేతనాలు, పింఛన్లు నిలిపేయడంతో వారు ఇబ్బందులు పడ్డారని నివేదించారు. మూడు నెలలు ఆపిన మొత్తాన్ని కూడా ఒకేసారి చెల్లించలేదని, వాటిని కూడా విడతల వారీగా చెల్లించారని చెప్పారు. ఈ మొత్తానికి 12 శాతం వడ్డీ చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న ధర్మాసనం.. కోవిడ్‌ సమయంలో ఆపిన వేతనాలు, పింఛన్లకు 6 శాతం వడ్డీ చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వాదనలు ముగించింది. 2020, మార్చిలో జీవో విడుదల చేసిన తర్వాత మార్చి, ఏప్రిల్, మే నెల వేతనాల్లో కోత విధించారు. వీటిని ఇదే సంవత్సరం నవంబర్, డిసెంబర్, 2021 జనవరి, ఫిబ్రవరిలో విడతలవారీగా చెల్లించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top