
ఓపీఎస్ వర్తింపజేయాలని సర్కార్‌కు హైకోర్టు ఆదేశం
ఉన్నత న్యాయస్థానంలో 1,739 మంది పిటిషన్లు
ఉపాధ్యాయులకు ఉపశమనం కల్పిస్తూ కోర్టు ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: డీఎస్సీ 2003 ఉపాధ్యాయులకు పాత పింఛన్ వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు మంగళవారం ఆదేశించింది. 2004, ఆగస్టు 31 వరకు పాత పింఛన్ విధానం (ఓపీఎస్) అమల్లో ఉన్నందున వారంతా అందుకు అర్హులని తేల్చిచెప్పింది. కొత్త కాంట్రిబ్యూటరీ పింఛన్ విధానం (సీపీఎస్) 2004, సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన విషయాన్ని గుర్తు చేసింది. అంతకుముందే వీరి నియామకం పూర్తయిందని స్పష్టం చేసింది.
2004, సెప్టెంబర్ నుంచి అమల్లోకి వచ్చిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాన్ని తమకు వర్తింపజేయడాన్ని సవాల్ చేస్తూ మెదక్ జిల్లా దుబ్బాక మండలం రాజక్కపేట్ జెడ్పీహెచ్‌ఎస్ ఉపాధ్యాయుడు సీహెచ్ శ్రీనివాస్‌రెడ్డి సహా మరో 1,738 మంది హైకోర్టులో 2019, 2020లో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ నగేశ్ భీమపాక విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ వాదనలు వినిపిస్తూ.. ‘2003, నవంబర్ 13న డీఎస్సీకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. 2004, జూన్ వరకల్లా వీరంతా ఉపాధ్యాయులుగా నియమితులయ్యారు.
కేవలం పరిపాలనాపరమైన ఆలస్యం కారణంగా 2005, నవంబర్‌లో నియామక ఉత్తర్వులు ఇచ్చారు. అలాంటప్పుడు సెప్టెంబర్‌లో వచ్చిన పింఛన్ విధానాన్ని ఎలా వర్తింపజేస్తారు. పిటిషనర్లంతా పాత పింఛన్‌కు అర్హులు’అని చెప్పారు. ప్రభుత్వం తరఫున జీపీ వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. రిట్ పిటిషనర్లు పాత పింఛన్ పథకానికి అర్హులని, వారందరికీ ఆ ప్రయోజనాలందించాలని ఆదేశించారు.
పాత పింఛన్ విధానంలో..
ఉద్యోగిపై ఎలాంటి భారం లేకుండా భవిష్యత్‌కు భద్రత కల్పిస్తుంది. ఒకవేళ పెన్షన్‌దారుడు మరణిస్తే.. అతని కుటుంబ సభ్యులకు ఎలాంటి కోత లేకుండా పూర్తి పింఛన్ వస్తుంది. ఒక ఉద్యోగి పదవీ విరమణ సమయానికి చివరి నెల బేసిక్ వేతనంలో 50శాతాన్ని నెలసరి పింఛన్‌గా నిర్ధారిస్తారు. ఈ విధానంలో కరువు భత్యం(డీఏ), కరువు ఉపశమనం(డీఆర్), వేతన సవరణ కమిషన్(పీఆర్సీ) సిఫార్సులుండేవి.
కొత్త పింఛన్ విధానంలో...
ఉద్యోగి వేతనంలోంచి నెలనెలా కొంత వెచ్చించాలి. చివరకు వచ్చే పింఛన్ చాలా తక్కువ. ఈ విధానంలో మూలవేతనం, డీఏను కలిపి.. దానిపై 10 శాతం ఉద్యోగి, 10 శాతం ప్రభుత్వం నెలనెలా జమచేయాలి. ఈ మొత్తాన్ని ఎస్‌బీఐ, యూటీఐ, ఎల్‌ఐసీ షేర్లలో పెడతారు. విరమణ పొందాక 60 శాతం ఒకేసారి ఇస్తారు. మిగతా 40 శాతాన్ని నెలవారీగా లెక్కగట్టి ఇస్తారు.