breaking news
Old pension
-
డీఎస్సీ–2003 టీచర్లకు పాత పింఛన్
సాక్షి, హైదరాబాద్: డీఎస్సీ 2003 ఉపాధ్యాయులకు పాత పింఛన్ వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు మంగళవారం ఆదేశించింది. 2004, ఆగస్టు 31 వరకు పాత పింఛన్ విధానం (ఓపీఎస్) అమల్లో ఉన్నందున వారంతా అందుకు అర్హులని తేల్చిచెప్పింది. కొత్త కాంట్రిబ్యూటరీ పింఛన్ విధానం (సీపీఎస్) 2004, సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన విషయాన్ని గుర్తు చేసింది. అంతకుముందే వీరి నియామకం పూర్తయిందని స్పష్టం చేసింది.2004, సెప్టెంబర్ నుంచి అమల్లోకి వచ్చిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాన్ని తమకు వర్తింపజేయడాన్ని సవాల్ చేస్తూ మెదక్ జిల్లా దుబ్బాక మండలం రాజక్కపేట్ జెడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయుడు సీహెచ్ శ్రీనివాస్‌రెడ్డి సహా మరో 1,738 మంది హైకోర్టులో 2019, 2020లో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ నగేశ్ భీమపాక విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ వాదనలు వినిపిస్తూ.. ‘2003, నవంబర్ 13న డీఎస్సీకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. 2004, జూన్ వరకల్లా వీరంతా ఉపాధ్యాయులుగా నియమితులయ్యారు.కేవలం పరిపాలనాపరమైన ఆలస్యం కారణంగా 2005, నవంబర్‌లో నియామక ఉత్తర్వులు ఇచ్చారు. అలాంటప్పుడు సెప్టెంబర్‌లో వచ్చిన పింఛన్ విధానాన్ని ఎలా వర్తింపజేస్తారు. పిటిషనర్లంతా పాత పింఛన్‌కు అర్హులు’అని చెప్పారు. ప్రభుత్వం తరఫున జీపీ వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. రిట్ పిటిషనర్లు పాత పింఛన్ పథకానికి అర్హులని, వారందరికీ ఆ ప్రయోజనాలందించాలని ఆదేశించారు. పాత పింఛన్ విధానంలో.. ఉద్యోగిపై ఎలాంటి భారం లేకుండా భవిష్యత్‌కు భద్రత కల్పిస్తుంది. ఒకవేళ పెన్షన్‌దారుడు మరణిస్తే.. అతని కుటుంబ సభ్యులకు ఎలాంటి కోత లేకుండా పూర్తి పింఛన్ వస్తుంది. ఒక ఉద్యోగి పదవీ విరమణ సమయానికి చివరి నెల బేసిక్ వేతనంలో 50శాతాన్ని నెలసరి పింఛన్‌గా నిర్ధారిస్తారు. ఈ విధానంలో కరువు భత్యం(డీఏ), కరువు ఉపశమనం(డీఆర్), వేతన సవరణ కమిషన్(పీఆర్సీ) సిఫార్సులుండేవి. కొత్త పింఛన్ విధానంలో... ఉద్యోగి వేతనంలోంచి నెలనెలా కొంత వెచ్చించాలి. చివరకు వచ్చే పింఛన్ చాలా తక్కువ. ఈ విధానంలో మూలవేతనం, డీఏను కలిపి.. దానిపై 10 శాతం ఉద్యోగి, 10 శాతం ప్రభుత్వం నెలనెలా జమచేయాలి. ఈ మొత్తాన్ని ఎస్బీఐ, యూటీఐ, ఎల్ఐసీ షేర్లలో పెడతారు. విరమణ పొందాక 60 శాతం ఒకేసారి ఇస్తారు. మిగతా 40 శాతాన్ని నెలవారీగా లెక్కగట్టి ఇస్తారు. -
‘‘సీపీఎస్ రద్దు– ఓపీఎస్ అమలు’’ ఇదే మా నినాదం.. పోరాటం
సాక్షి, హైదరాబాద్: ‘కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దు చేయాలి... పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) పునరుద్ధరించాలి. ఎన్నికలకు ముందే ఈ ప్రక్రియ జరగాలి. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేసిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లాలి’అంటూ తెలంగాణ స్టేట్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ యూనియన్ (టీఎస్సీపీఎస్ఈయూ) గొంతెత్తింది. 2004 తర్వాత రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో నియమితులైన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు అమలు చేస్తున్న సీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం టీఎస్సీపీఎస్ఈయూ ఆధ్వర్యంలో నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 54 సంఘాల ఉద్యోగులు మద్దతు తెలుపుతూ పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో పాటు పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘ నేతలు సైతం ఈ సభకు హాజరై సీపీఎస్ రద్దుకు గొంతు కలిపారు. 2 లక్షల కుటుంబాల చిరకాల వాంఛ ఇది ఈ సందర్భంగా టీఎస్సీపీఎస్ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ మాట్లాడారు. ‘ఐదేళ్ల క్రితం సీపీఎస్ రద్దు చేయాల్సింది కేంద్ర ప్రభుత్వమా? రాష్ట్ర ప్రభుత్వమా? అని అడిగిన సందర్భాలున్నాయి. ఆ ప్రశ్నలకు ఇప్పుడు సరైన సమాధానం దొరికింది. సీపీఎస్ పథకాన్ని రద్దు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. అదేవిధంగా ఈ పథకం కింద జమ అయిన నిధులను వెనక్కు ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రంలోని దాదాపు 2 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయుల కుటుంబాల చిరకాల వాంఛ సీపీఎస్ రద్దు– ఓపీఎస్ అమలు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికల హామీ మాదిరి కాకుండా ఎన్నికలకు ముందే సీపీఎస్‌ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలి. వెనువెంటనే ఓపీఎస్‌ను అమలు చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులంతా రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలబడే వారే. ప్రభుత్వం ఆదేశాలను తూచ తప్పకుండా అనుసరించి అమలు చేసేవారు కావడంతో ప్రభుత్వం ఏమాత్రం సంకోచించకుండా సీపీఎస్‌ను రద్దు చేయాలి’అని కోరారు. సీపీఎస్ ఉద్యోగుల ప్రధాన సమస్యలు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు దృష్టికి పోవడం లేదని, ఆయనకు సుదీర్ఘంగా వివరిస్తే తప్పకుండా పరిష్కారం లభిస్తుందన్నారు. అందుకోసమే రాష్ట్ర రాజధానిలో ఈ కార్యక్రమాన్ని తలపెట్టినట్లు వివరించారు. జిల్లాలను చుట్టి.. రాజధానికి చేరి.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు అమలు చేస్తున్న సీపీఎస్ రద్దుపై విస్తృత అవగాహన కలి్పంచేందుకు టీఎస్సీపీఎస్ఈయూ జూలై 16 నుంచి 31వ తేదీ వరకు పాత పెన్షన్ సాధన సంకల్ప యాత్రను తలపెట్టింది. రాష్ట్రంలోని 33 జిల్లాల మీదుగా సాగిన ఈ యాత్ర ద్వారా ఉద్యోగులు, ఉపాధ్యాయులను చైతన్య పరిచి పాత పెన్షన్ ఆవశ్యకత, సీపీఎస్ రద్దుపై విపులంగా వివరించి అభిప్రాయ సేకరణ జరిపింది. పక్షం రోజుల పాటు సాగిన ఈ యాత్రలో వివిధ ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొని మద్దతు పలికారు. ఈ క్రమంలో ఈనెల 12న హైదరాబాద్‌లో సీపీఎస్ ఉద్యోగులతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు స్థితప్రజ్ఞ ఇదివరకే ప్రకటించారు. ఇందులో భాగంగా శనివారం నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో తలపెట్టిన భారీ బహిరంగ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు హాజరయ్యారు. పోటెత్తిన వివిధ రాష్ట్రాల నేతలు కార్యక్రమంలో నేషనల్ మూమెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్స్ స్కీం జాతీయ అధ్యక్షులు విజయకుమార్ బంధు, పంజాబ్ సీపీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సుఖజిత్ సింగ్, కర్ణాటక సీపీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు శాంతారామ్, ప్రధాన కార్యదర్శి రంగనాథ్, ఆంధ్రప్రదేశ్ సీపీఎస్ నాయకుడు పల్లెల రామాంజనేయులు, మహారాష్ట్ర నుంచి విటేష్ ఖండేల్కర్, ఝార్ఖండ్ నుంచి విక్రమ్ సింగ్, ఛత్తీస్‌గఢ్ నుంచి రాకేష్ సింగ్, తమిళనాడు నుంచి ఆరోగ్యదాస్, తెలంగాణ రాష్ట్రం నుంచి ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సదానందం గౌడ్, తపస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సుబ్బయ్య, సురేష్, టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మధుసూదన్‌రెడ్డి, కటకం రమేశ్, ఎస్జీటీయూ రాష్ట్ర అధ్య క్షుడు మహిపాల్ రెడ్డి, టీఎస్‌టీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ నాయక్, వెటర్నరీ ఫోరం అధ్యక్షుడు అభిషేక్ రెడ్డి, బ్లైండ్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి అనిల్ పాల్గొన్నారు. ఇరువురు సీఎంలతో చర్చ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి. తప్పకుండా ఇరువురు సీఎంలతో పాత పెన్షన్ పునరుద్ధరణపై చర్చిస్తాం. అదేవిధంగా జార్ఖండ్‌లో అమలు చేస్తున్న పాత పెన్షన్ స్టాండింగ్ ఆపరేటింగ్ గైడ్‌లైన్స్ వివరిస్తాం. –విక్రమ్ సింగ్, జార్ఖండ్ సీపీఎస్ యూనియన్ అధ్యక్షుడు మేమూ ఎదురుచూస్తున్నాం తెలంగాణలో సీపీఎస్ రద్దుకోసం మహారాష్ట్రలో సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్నారు. పాత పెన్షన్ కోసం పార్టీ పరమైన నిర్ణయాన్ని తీసుకుంటే మరింత స్పష్టత వస్తుంది. –విటేష్ ఖండేల్కర్, మహారాష్ట్ర సీపీఎస్ యూనియన్ అధ్యక్షుడు కేసీఆర్ దేశ్‌కీ నేతా అయ్యేందుకు ఇదే చాన్స్ తెలంగాణలోని రెండు లక్షల ఉద్యోగుల సీపీఎస్‌ను రద్దు చేస్తే దేశంలోని మిగతా రాష్ట్రాలు కూడా అనుకరిస్తాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ దేశ్‌కి నేతా అయ్యేందుకు ఇదే మంచి అవకాశం. – విజయ్‌కుమార్ బంధు, సీపీఎస్ జాతీయ అధ్యక్షుడు -
పాత పెన్షన్ విధానం అమలు చేయాలి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ విద్యుత్ సంస్థల్లో 1999 నుంచి 2004 మధ్య కాలంలో చేరిన ఉద్యోగులకు పాతపెన్షన్, జీపీఎఫ్‌లను అమలు చేయాలని టీఎస్పీఈ జేఏసీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గురువారం ఆ సంఘం ప్రతినిధులు టీఎస్‌పీఈఏ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ ఐదేళ్ల కాలంలో 4700 మంది సంస్థలో ఉద్యోగులుగా చేరారని, వీరందరికీ పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేసి ఆదుకోవాలని కోరారు. శుక్రవారం ఇదే అంశం ప్రధాన డిమాండ్‌గా చలో హైదరాబాద్ సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సమావేశం అనంతరం తెలంగాణ విద్యుత్ సంస్థల చైర్మన్ ప్రభాకర్‌రావు నేతృత్వంలో ప్రతినిధి బృందం సీఎం కేసీఆర్‌ను కలిసి మరోసారి విజ్ఞప్తి చేయనున్నట్లు జేఏసీ ప్రతినిధులు రత్నాకర్‌రావు, సదానందం, సాయిబాబా, కుమారస్వామి, వెంకటనారాయణ, తదితరులు ఉన్నారు. -
సీపీఎస్’ రద్దు చేయాలని ర్యాలీ
మంచిర్యాల టౌన్ : 2004 తర్వాత నియమితులైన ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రస్తుతం అమలు చేస్తున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం(సీపీఎస్)ను రద్దు చేయాలని కోరుతూ సీపీఎస్ టీఈఏ టీఎస్ ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధ్యాయులు ఆదివారం మంచిర్యాల పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ సీపీఎస్ విధానంలో గ్రాట్యూటీ చెల్లింపు లేకపోవడం, పెన్షన్ భద్రత లేకపోవడం, ఉద్యోగి మరణిస్తే ఎలాంటి ఆర్థిక సహాయం వంటి సదుపాయాలు లేకపోవడం వల్ల ఉద్యోగ ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు. ఈ లోపభూయిష్ట విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. 1 సెప్టెంబర్ 2004 తర్వాత నియమించబడిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని జీవో ఎంఎస్ నంబర్ 652 ద్వారా వర్తింపచేస్తున్నారన్నారు. ఉద్యోగికి ప్రాన్ ఖాతా తెరిచి అతని వేతనం నుంచి 10 శాతం, ప్రభుత్వం 10 శాతం నెలనెలా జమచేస్తూ ఈ మొత్తాన్ని ఎన్ఎస్డీఎల్ ద్వారా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడుతున్నారన్నారు. ఉద్యోగి విరమణ అనంతరం ఈ మొత్తంలో 60 శాతం నగదులగా చెల్లించి, మిగతా 40 శాతం పెట్టుబడిపై వచ్చే మొత్తాన్ని నెలనెలా ఫించన్ చెల్లిస్తారన్నారు. కానీ ప్రభుత్వాలు ఉద్యోగి విరమణ అనంతరం వచ్చే మొత్తాలపై కనీస భరోసా కల్పించకపోగా, షేర్ మార్కెట్లో నష్టాలు వస్తే ఉద్యోగ విరమణ అనంతరం ఆర్థిక పరిస్థితిని నిర్వచించకపోవడం చాలా భాదాకరమన్నారు. దేశంలోని పౌరులకు సామ్యవాద, ప్రజాస్వామ్య తరహా పాలనను అందిస్తామని రాజ్యాంగ పీఠికలో చేర్పించారని, కానీ అందుకు విరుద్ధంగా ప్రభుత్వ ఉద్యోగుల హక్కు అయిన ‘సామాజిక భద్రత పింఛన్‌ను తొలగించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. సీపీఎస్ టీఈఏ రాష్ట్ర అధ్యక్షుడు దాముక కమలాకర్, రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడు మోకెనపల్లి శ్రీనివాస్, గాదె మహిపాల్, కోఆర్డినేటర్ బండి రమేశ్, శ్రావణ్ కుమార్, జోడె మధు, నాగుల రమేశ్, రమణ, తిరుపతి, నరేశ్‌కుమార్, శివరామకృష్ణ, తుమ్మ వెంకటేశం, వెంకటాద్రి పాల్గొన్నారు.