‘అద్భుతం’ చేశారా?: తెలంగాణ ప్రభుత్వ తీరుపై హైకోర్టు విస్మయం

Telangana High Court Government Argument The Case Of Rain Damage Crops - Sakshi

వర్షాలకు దెబ్బతిన్న పంటల విషయంలో సర్కారు వాదనపై హైకోర్టు విస్మయం

5.65 లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగిందన్నారు

ఇప్పుడేమో ఒక్క ఎకరా పంట నష్టపోలేదంటున్నారు

‘పంట నష్టపరిహారం’ఇప్పించాలన్న పిల్‌పై తీర్పు రిజర్వు 

సాక్షి, హైదరాబాద్‌: ‘‘గత ఏడాది అక్టోబర్‌లో కురిసిన భారీవర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా 33 శాతం పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, సుమారుగా 5.65 లక్షల ఎకరాల్లో రైతులు పంట నష్ట పోయారని, కేంద్రం ఆర్థికసాయం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖలు రాశారు. ఇప్పుడేమో ఒక్క ఎకరాలోనూ పంట నష్టపోలేదని అంటున్నారు. ఈ అద్భుతం ఎలా సాధ్యమైంది. పంట నష్టం జరిగిందని, రూ.595 కోట్లు పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయగా, కేంద్ర ప్రభుత్వం ప్రతినిధి బృందం విచారణ జరిపి రూ.186 కోట్ల వరకు నష్టం జరిగిందని పేర్కొంది. పంట నష్టం జరిగిందనేందుకు స్పష్టమైన ఆధా రాలు ఉన్నా అసలు నష్టమే జరగలేదని ఎలా చెబు తారు’’అంటూ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విస్మయం వ్యక్తం చేసింది.

తొలుత నష్టం వచ్చిం దని అనుకున్నామని, తర్వాత రైతులు, అధికారులు తీసుకున్న చర్యల ఫలితంగా వరదలను సమర్థంగా ఎదుర్కొన్నామని, ఏజీ నివేదించారు. పంటనష్టం జరగలేదని గుర్తించినప్పుడు సాయం అవసరం లేదని కేంద్రానికి లేఖ ఎందుకు రాయలేదని ఏజీని ప్రశ్నించింది. విపత్తుల నిధి డబ్బు రాష్ట్రానికి ఇచ్చామని, ఈ డబ్బును వినియోగించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం తరఫు అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఎన్‌.రాజశ్వేరరావు చెప్పారు. 

రైతులే రానవసరంలేదు..
రాష్ట్రంలో భారీవర్షాలకు పంటలు నష్టపోయి ఉంటే, పరిహారం పంపిణీకి ఆదేశించాలంటూ సదరు రైతులు హైకోర్టును ఆశ్రయిస్తారన్న అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ వాదనను ధర్మాసనం తప్పుబట్టింది. రాష్ట్రంలో 60.84 లక్షల మంది రైతులు ఉన్నారని, ఇందులో పంట నష్టపోయిన రైతులంతా పరిహారం కోసం హైకోర్టును ఆశ్రయిస్తే ఎన్ని వేల కేసులు పడతాయో ఊహించు కోవాలని సూచించింది. ప్రస్తుతం ఉన్న 2.35 లక్షల కేసుల విచారణలోనే తీవ్ర జాప్యం జరుగుతోందని, ఇక కొత్తగా వేలల్లో కేసులు వచ్చిపడితే హైకోర్టు న్యాయమూర్తులపై ఎంత ఒత్తిడి ఉంటుందో ఆలోచించాలని స్పష్టం చేసింది.

రైతులందరూ కోర్టుకు రాలేరని, వారికి పంట నష్టపరిహారం, ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇప్పించాలంటూ దాఖలయ్యే ఇలాంటి ప్రజాహిత వ్యాజ్యాల్లో వచ్చే ఉత్తర్వులతో రైతులందరికీ న్యాయం జరుగుతుందని అభిప్రాయపడింది. గత ఏడాది కురిసిన భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చేలా ఆదేశించాలంటూ రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులు విస్సా కిరణ్‌కుమార్, రవి కన్నెగంటి, ఎస్‌.ఆశాలత దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎంఎస్‌ రామచందర్‌రావు, జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం మరోసారి విచారించింది. ఈ వ్యాజ్యంలో ప్రజాప్రయోజనమే లేదని ఏజీ నివేదించడంపై ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. 

హైదరాబాద్‌లో డబ్బు పంచారు
‘‘హైదరాబాద్‌లో గత అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలకు నష్టపోయినవారికి దాదాపు రూ.500 కోట్లు పరిహారంగా చెల్లించారు. ఇంటికి రూ.10 వేల చొప్పున పంచారు. మున్సిపల్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని విచ్చలవిడిగా డబ్బు పంచారు. అయితే అదే వర్షాలతో పంటలు నష్టపోయిన వారికి మాత్రం ఎటువంటి సాయం చేయకుండా వివక్షత చూపిస్తున్నారు. నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చేలా ఆదేశించండి’’అని పిటిషనర్ల తరఫున న్యాయవాది సీహెచ్‌ రవికుమార్‌ వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top